V6 News

బీహార్ లో కల్తీ మద్యం ఘటన.. పెరుగుతున్న మృతుల సంఖ్య

బీహార్ లో కల్తీ మద్యం ఘటన.. పెరుగుతున్న మృతుల సంఖ్య

బీహార్ లో కల్తీ మద్యం మరణాలు కలకలం రేపుతున్నాయి..  సరన్ జిల్లాలోని చాప్రాలో కల్తీ మద్యం తాగి చనిపోయిన వారి సంఖ్య 60కి చేరింది. సివన్ జిల్లాలో భగవాన్ పూర్ లో కల్తీ మద్యం తాగి మరో నలుగురు చనిపోయారు. రాష్ట్రంలో కల్తీ మద్యం సేవించి పలువురు మరణిస్తున్న ఘటనలపై నితీష్ సర్కార్ లక్ష్యంగా విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. మద్యం తయారీ, విక్రయం, అక్రమ మద్యం నియంత్రణ కోసం కార్యాచరణ ప్రణాళిక చేపట్టాలని పిటిషన్ లో డిమాండ్ చేశారు. ఇక కల్తీ మద్యం ఏరులై పారుతోందని ఆందోళన వ్యక్తం చేస్తూ విపక్ష ప్రతినిధులు గవర్నర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. గవర్నర్ ను కలిసి మెమోరండం సమర్పించారు. నిందితులకు నితీశ్ ప్రభుత్వం రక్షణ కల్పిస్తోందని బీజేపీ నేతలు ఆరోపణలు గుప్పించారు. అవసరమైతే ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని కోరామన్నారు. బాధితులకు నష్టపరిహారం అందించేలా చూడాలని వారు కోరారు.

బీహార్ కల్తీ మద్యంపై జాతీయ మానవహక్కుల కమిషన్ స్పందించింది. మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా కేసును సుమోటోగా స్వీకరించింది. దీనిపై వివరణ ఇవ్వాలని బీహార్ లోని సంబంధిత అధికారులకు జాతీయ మానవహక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. బీహార్ లోని చాప్రా లిక్కర్ ఘటనలో పరిహారం పై బీహార్ సీఎం నితీష్ కుమార్ వెనక్కి తగ్గడం లేదు. పరిహారం ఇవ్వాలని పలువురు డిమాండ్ చేస్తున్నారంటూ అసెంబ్లీలో ఫైర్ అయ్యారు. మద్యం తాగితే చావు తప్పదని, తాగి చనిపోయిన వారికి నష్టపరిహారం ఇవ్వరని స్పష్టం చేశారు. తాగడానికి అనుకూలంగా మాట్లాడేవారు ప్రజలకు ఎలాంటి మంచి చేయరని నితీష్ కుమార్ తెలిపారు.