అధిర్ రంజన్ వ్యాఖ్యలపై కొనసాగుతున్న దుమారం

అధిర్ రంజన్ వ్యాఖ్యలపై కొనసాగుతున్న దుమారం

కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆయన మాటలు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అవమానించేలా ఉన్నాయంటూ బీజేపీ మండిపడుతోంది. కాంగ్రెస్ నేతలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎంపీలు ఆందోళనకు దిగారు. రాష్ట్రపతిని అవమానించే ఉద్దేశం లేదని, పొరపాటు జరిగిందని వివరణ ఇచ్చినా బీజేపీ మాత్రం క్షమాపణ చెప్పాలని పట్టుబడుతోంది.

ఏం జరిగిందంటే
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాగాంధీ ఈడీ విచారణ, జీఎస్టీ విషయంలో కేంద్రం వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ ఎంపీలు బుధవారం నిరసన చేపట్టారు. పార్లమెంటు నుంచి విజయ్ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడి నుంచి రాష్ట్రపతి భవన్ కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అదే సమయంలో లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి వద్దకు వచ్చిన ఓ జర్నలిస్టు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారని ప్రశ్నించగా.. రాష్ట్రపత్ని భవనానికి అని నోరు జారారు. ఈ వ్యాఖ్యలు కాస్తా మీడియాలో ప్రసారం కావడం దుమారానికి కారణమైంది. అధిర్ రంజన్ మాటలపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తోంది. 

క్షమాపణ చెప్పను
తన వ్యాఖ్యలపై అధిర్ రంజన్ చౌదరి వివరణ ఇచ్చారు. పొరపాటున రాష్ట్రపత్ని అన్నానని సంజాయిషీ ఇచ్చే ప్రయత్నం చేశారు. దాన్ని బీజేపీ అస్త్రంగా వాడుకుంటోందని మండిపడ్డారు. రాష్ట్రపతిగా అత్యున్నత పదవిలో ఉన్నవాళ్లెవరైనా వారి కులంతో సంబంధం లేదని చెప్పారు. ప్రజా సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు బీజేపీ అనవసర రాద్దాంతం చేస్తోందని మండిపడ్డారు. పొరపాటున అన్న పదాన్ని వివాదాస్పదం చేయడం సరికాదని, తాను క్షమాపణ చెప్పే ప్రసక్తేలేదని అధిర్ రంజన్ చౌదరి స్పష్టం చేశారు. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్పందించారు. ఈ విషయంలో అధిర్ ఎప్పుడో క్షమాపణ చెప్పారని అన్నారు. 

బహిరంగ క్షమాపణ చెప్పాలె
రాష్ట్రపతి ద్రౌప‌ది ముర్ముపై కాంగ్రెస్ నేత అధిర్ రంజ‌న్ చౌద‌రి చేసిన కామెంట్లపై పార్లమెంటులో తీవ్ర దుమారం రేగింది.  ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతిని తీవ్రంగా అవమానించిందని అన్నారు. అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న దేశ తొలి మహిళా గిరిజన అధ్యక్షురాలిని అవమానించినందుకు సోనియా గాంధీ దేశానికి, గిరిజనులకు క్షమాపణ చెప్పాలని అన్నారు. ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీ ఆమెను తీవ్రంగా అవమానిస్తోందని స్మృతి ఇరానీ ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు ముర్మును తోలుబొమ్మ అని కామెంట్ చేస్తున్నట్లు చెప్పారు.

జాతియావత్తుకు క్షమాపణ చెప్పాలె 
అటు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సైతం కాంగ్రెస్ పార్టీతోపాటు సోనియాగాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు స్వయంగా వారి పార్టీ నేత అలా మాట్లాడటానికి అనుమతించార‌నీ, అందుకే ఆమె కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అధిర్ రంజన్ చౌదరి ఇప్పటికే క్షమాపణ చెప్పారని సోనియా గాంధీ దేశ ప్రజలను తప్పుదోవ పట్టి్స్తున్నారని నిర్మలా సీతారామన్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా గిరిజన మహిళా నేతను కించపరిచే ప్రయత్నం చేస్తున్నారని, అందుకే జాతియావత్తుకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తోందని అన్నారు.