- నోవాటెల్ హోటల్ వద్ద నల్ల దుస్తులు, ప్లకార్డులతో ఆందోళన
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర పర్యటనకు వచ్చిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని నోవాటెల్ హోటల్ వద్ద బీజేవైఎం కార్యకర్తలు అడ్డుకొని, నల్ల దుస్తులు, ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రాష్ట్రంలో పర్యటించే హక్కు రాహుల్ గాంధీకి లేదని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేశ్ కుండే స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు గడుస్తున్నా, మేనిఫెస్టోలో ప్రకటించిన గ్యారెంటీలను అమలు చేయడంలో విఫలమైందని ఆయన విమర్శించారు.
ప్రజా సమస్యలను పరిష్కరించడంలో చిత్తశుద్ధి చూపకుండా సీఎం రేవంత్ రెడ్డి, పాలకవర్గం స్వప్రయోజనాలపైనే దృష్టి సారిస్తున్నారని ఆరోపించారు. విద్యార్థులకు సంబంధించిన సుమారు రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని బీజేవైఎం నేతలు డిమాండ్ చేశారు. ప్రతి ఏటా 2 లక్షల ఉద్యోగాల భర్తీ, రూ.4 వేల నిరుద్యోగ భృతి, మహిళలకు రూ.2,500 ఆర్థిక సాయం, తులం బంగారం, విద్యార్థినులకు స్కూటీల పంపిణీ హామీలను అమలు చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో మౌలిక సదుపాయాల కొరతను తీర్చాలని పేర్కొన్నారు. నిరసనలో బీజేవైఎం నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సింధు, రాష్ట్ర ఉపాధ్యక్షులు చాడ అనిత రెడ్డి, సాయినాథ్, నితిన్ నందాకర్, సెక్రటరీలు ఝాన్సీ, శివచంద్రగిరి, హరిప్రసాద్, జిల్లా అధ్యక్షులు సాయిరాం గౌడ్, అవినాష్ గౌడ్, రాహుల్ భరత్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.
