- బీటలు వారుతున్న ఇళ్లు 9 ఎకరాల మేర భూముల ఆక్రమణ పట్టించుకోని అధికారులు
వనపర్తి/పెబ్బేరు, వెలుగు : వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలోని ఏటిగడ్డ శాఖాపూర్ గ్రామంలో పెద్దగుట్టపై పలుగురాళ్ల కోసం చేస్తున్న బ్లాస్టింగ్లతో పల్లెవాసులకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. వేళాపాళా లేకుండా బ్లాస్టింగ్లు చేస్తుండడంతో ఇళ్లు బీటలు వారుతున్నాయి. ఇళ్లకు రిపేర్లు చేయిస్తున్నా, బ్లాస్టింగ్లు జరిగినప్పుడల్లా గ్రామంలోని ఇళ్లు దద్దరిల్లి పగుళ్లు రావడం సర్వసాధారణంగా మారింది.
ఇంట్లో ఉన్న సామాను కింద పడడం, ఇంటిపై వేసుకున్న సిమెంట్ రేకులు పగిలిపోయి వర్షాలు కురిసినప్పుడల్లా ఇల్లంతా తడవడం, దూలాలు పర్రెలు ఇచ్చి విరిగిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. రూల్స్ కు వ్యతిరేకంగా పనులు జరుగుతుండడంతో అక్కడ పని చేసే కార్మికులు సైతం ఇబ్బంది పడుతున్నారు.
ప్రమాదకరంగా బ్లాస్టింగ్లు..
ఏటిగడ్డ శాఖాపూర్ గ్రామంలో పెద్దగుట్టపై సర్వే నంబరు 521లో 1972లో అప్పటి ఉమ్మడి ఏపీ సర్కార్ ఎస్సీ, బీసీ రైతులకు సాగు చేసుకునేందుకు పట్టాలు ఇచ్చింది. అప్పటి నుంచి గ్రామ రైతులు అక్కడ పంటలు సాగు చేసుకుంటున్నారు. ఇందులోని 39 ఎకరాలను ఎస్వీఆర్ మినరల్స్ కంపెనీ 1999లో పలుగురాళ్ల క్వారీ ఏర్పాటు కోసం లీజుకు తీసుకుంది. 2021లో గడువు ముగియగా, అప్పటి ప్రభుత్వం లీజును 2041 వరకు పొడగించింది.
లీజుకు తీసుకున్న కంపెనీ ప్రమాదకరంగా బ్లాస్టింగ్లు చేస్తుందనే విమర్శలున్నాయి. కార్మికులతోనూ ప్రమాదకరంగా పనులు చేయిస్తున్నారని చెబుతున్నారు. ఇటీవల ఓ టిప్పర్ డ్రైవర్ బ్లాస్టింగ్ కారణంగా చనిపోతే, పొక్లెయిన్ తో స్తంభాన్ని పైకి ఎత్తుతుండగా పోల్ అతడిపై పడి చనిపోయినట్లు నమ్మించి ఆ కుటుంబానికి భారీ మొత్తంలో పరిహారం చెల్లించినట్లు ఆరోపణలున్నాయి. ఆ ప్రమాదంలో మరో కార్మికుడు సైతం తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనను బయటికి రాకుండా నష్టపరిహారంతో ఆ కుటుంబ సభ్యుల నోరు మూయించారని చెబుతున్నారు.
నిబంధనలు బేఖాతర్..
ప్రభుత్వ నిబంధనలను బేఖాతర్ చేస్తూ తమ భూములను సైతం ఆక్రమించుకుంటున్నారని రైతులు వాపోతున్నారు. గుట్టకు ఆనుకొని ఉన్న పొలాల్లో పెద్ద పెద్ద బండరాళ్లు వేసి, మట్టి పోసి గుడిసెలు వేయించి ఇప్పటికే 9 ఎకరాల వరకు భూములను ఆ కంపెనీ ఆక్రమించుకుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భూములు ఆక్రమించుకోవడంతో పాటు పరిహారం ఇవ్వకుండా సతాయిస్తున్నారని వాపోతున్నారు. ఈ విషయంపై పాతికేళ్లుగా కలెక్టర్లకు వివరిస్తున్నా, ఆందోళనలు చేస్తున్నా న్యాయం జరగడం లేదని రైతులు, గ్రామస్తులు చెబుతున్నారు. ఇప్పటికైన సదరు కంపెనీపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని గ్రామస్తులు
కోరుతున్నారు.
