డ్వాక్రా మహిళలకు డ్రోన్లు  .. కేంద్ర మంత్రి అనురాగ్ వెల్లడి

డ్వాక్రా మహిళలకు డ్రోన్లు  .. కేంద్ర మంత్రి అనురాగ్ వెల్లడి
  • ఏడాదికి లక్ష ఆదాయం పొందే చాన్స్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
  • వ్యవసాయం కోసం రైతులకు కిరాయికి డ్రోన్లు.. వచ్చే రెండేండ్లలో 15 వేల సంఘాలకు అందజేత
  • రూ.1,261 కోట్లు కేటాయింపు మరో ఐదేండ్లు ఫ్రీ రేషన్ స్కీమ్

న్యూఢిల్లీ :  డ్వాక్రా గ్రూప్ మహిళల కోసం కేంద్రం సరికొత్త స్కీమ్ తీసుకొస్తున్నది. స్వయం సహాయక సంఘాలకు కేంద్ర ప్రభుత్వం డ్రోన్లు అందించనుంది. ఈ డ్రోన్లను రైతులకు అద్దెకు ఇవ్వడం ద్వారా ఉపాధి పొందొచ్చు. 15వేల డ్వాక్రా గ్రూప్​లను ఎంపిక చేసి 2024–25 నుంచి 2025–2026 ఫైనాన్షియల్ ఇయర్ మధ్య డ్రోన్లు అందజేసేందుకు కేబినెట్ నిర్ణయించింది. ఈ స్కీమ్ కోసం మొత్తం రూ.1,261 కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.

ఒక్కో సంఘానికి ఒక్కో డ్రోన్ అందజేస్తున్నట్లు తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం కేబినెట్ భేటీ అయింది. మంత్రివర్గంలో తీసుకున్న కీలక నిర్ణయాలను కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం మీడియాకు వెల్లడించారు. ‘‘దీన్ దయాళ్ అంత్యోదయ యోజన కింద ఏర్పాటైన మొత్తం 89లక్షల స్వయం సహాయక సంఘాల నుంచి 15వేల సంఘాలను గర్తించి డ్రోన్లు అందజేస్తాం. వివిధ రాష్ట్రాల్లో డ్రోన్​ల వినియోగం, ఆర్థికంగా సాధ్యమయ్యే క్లస్టర్ల ఆధారంగా డ్వాక్రా సంఘాల ఎంపిక ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు కిరాయి మీద వ్యవసాయ ఆధారిత సేవలు అందించేందుకు ఈ డ్రోన్లు ఉపయోగపడ్తాయి. ఫలితంగా ఒక్కో గ్రూప్ ఏటా లక్ష రూపాయల దాకా ఆదాయం పొందే అవకాశం ఉంటుంది” అని అనురాగ్ ఠాకూర్ తెలిపారు.

అన్న యోజన స్కీమ్​తో 81కోట్ల మందికి లబ్ధి

ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) కింద 81.35 కోట్ల మంది ప్రజలకు మరో ఐదేండ్ల వరకు ఫ్రీగా రేషన్ అందిస్తామని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున బియ్యం ఇస్తామన్నారు. దీని కోసం రూ.11.80 లక్షల కోట్లు ఖర్చు పెడ్తున్నట్లు వివరించారు. 2024, జనవరి 1 నుంచి ఐదేండ్ల పాటు ఈ స్కీమ్ కొనసాగుతుందన్నారు. 2020, కరోనా టైమ్​లో నిరుపేదలను ఆదుకునేందుకు ప్రధాని మోదీ ఈ స్కీమ్ తీసుకొచ్చారని తెలిపారు. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ (ఎన్ఎఫ్ఎస్ఏ) కింద సబ్సిడీ అందజేస్తున్నట్లు వివరించారు.

ఎరువులపై సబ్సిడీకి కేబినెట్ ఆమోదం

16వ ఫైనాన్స్ కమిషన్ 2026, ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం అవుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పన్నుల పంపిణీకి సంబంధించిన నిష్పత్తిని సూచించడానికి, ఫైనాన్సింగ్ డిజాస్టర్ మేనేజ్​మెంట్ యాక్టివిటీస్​ను సమీక్షించే నిబంధనలకు మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కమిషన్ తన ఐదేండ్ల కాలానికి (2026–27 నుండి 2030–31 వరకు) తన నివేదికను అక్టోబర్ 31, 2025 నాటికి రాష్ట్రపతికి సబ్మిట్ చేయనుంది. కాగా, 2023–24 రబీ సీజన్ కోసం ఫాస్పేట్, పొటాష్ ఎరువులపై సబ్సిడీకి కేంద్రం ఆమోదం తెలిపింది.అదేవిధంగా, జన్ ఔషధి కేంద్రాల సంఖ్యను 10 వేల నుంచి 25 వేలకు పెంచేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

మరో మూడేండ్లు ఫాస్ట్​ ట్రాక్ కోర్టులు

సెక్సువల్ అఫెన్సెస్ కేసుల్లో సత్వర న్యాయం అందించేందుకు ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టులు మరో మూడేండ్లు కొనసాగించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. వీటి నిర్వహణ కోసం రూ.1,952.23 కోట్లు ఖర్చు చేయనుంది. ఇందు లో కేంద్రం రూ.1,207.24 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.744.99 కోట్లు భరిస్తున్నాయి. నిర్భయ గ్యాంగ్ రేప్ కేసు తర్వాత 31 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 1,023 ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేయాలని డిసైడ్ అయింది. 1,95,000 కేసులు పరిష్కారమయ్యాయి. ఏడాదికి 65 నుంచి 165 కేసులు సాల్వ్ అవుతున్నాయి. ఒక జ్యూడీషియల్ ఆఫీసర్, ఏడుగురు సపోర్ట్ స్టాఫ్​తో నడిచే స్పెషల్ ఫాస్ట్​ట్రాక్ కోర్టు కోసం ఏటా రూ.75లక్షల ఖర్చు అవుతున్నది.

రూ.24వేల కోట్లతో గిరిజనుల కోసం స్కీమ్

గిరిజనుల అభివృద్ధి, సత్వర న్యాయం కోసం ప్రకటించిన ‘ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్’​కు కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.24,104 కోట్లతో ఈ స్కీమ్​ను తీసుకొచ్చారు. ఇందులో రూ.15,336 కోట్ల షేర్ కేంద్రానిది కాగా, రూ.8,768 కోట్లు రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. 18 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 220 జిల్లాల్లోని 28.16లక్షల గిరిజనులు ఈ స్కీమ్​తో లబ్ధి పొందుతారు.2011 లెక్కల ప్రకారం.. మొత్తం జనాభాలో ఎస్టీలు 10.45 కోట్ల మంది ఉన్నారు.

ఒక్కో డ్రోన్ విలువ రూ.10 లక్షలు

‘‘ఒక డ్రోన్, దాని యాక్ససరీస్ కోసం రూ.10 లక్షల దాకా ఖర్చు అవుతుంది. ఇందులో 80% (రూ.8లక్షలు) కేంద్రం భరిస్తుంది. బ్యాలెన్స్ అమౌంట్ కోసం నేషనల్ అగ్రికల్చర్ ఇన్​ఫ్రా ఫైనాన్సింగ్ ఫెసిలిటీ (ఏఐఎఫ్) కింద స్వయం సహాయక సంఘాల క్లస్టర్ లెవల్ ఫెడరేషన్(సీఎల్ఎఫ్)లు లోన్ పొందొచ్చు. ఏఐఎఫ్​లోన్​పై 3% వడ్డీ రాయితీ కూడా అందించడం జరుగుతుంది” అని అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. డ్రోన్ల వినియోగం కోసం 10 నుంచి 15 గ్రామాలను కలిపి ఒక క్లస్టర్​గా ఏర్పాటు చేస్తామన్నారు.

వాణిజ్య పంటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ‘‘ఒక్కో గ్రూప్ నుంచి బాగా చదువుకున్న వారిని ఎంపిక చేసి డ్రోన్ ఆపరేటింగ్​పై 15 రోజులు ట్రైనింగ్ ఇస్తాం. వీరిలో పైలట్​కు రూ.15 వేలు, కో పైలట్​కు రూ.10 వేల గౌరవ వేతనం అందజేస్తాం. ఫిట్టింగ్, మెకానికల్ రిపేరింగ్ చేసేందుకు సంఘంలోని సభ్యురాలు లేదా ఫ్యామిలీ మెంబర్​కు డ్రోన్ టెక్నీషియన్/అసిస్టెంట్ ట్రైనింగ్ కోసం ఎంపిక చేస్తాం” అని అనురాగ్ ఠాకూర్ వివరించారు.