22 వేల కోట్లు ఎగ్గొట్టిన్రు

22 వేల కోట్లు ఎగ్గొట్టిన్రు
  • 28 బ్యాంకుల నుంచి లోన్​లు 
  • గుజరాత్​లోని దహేజ్, సూరత్​లలో షిప్ యార్డులు

న్యూఢిల్లీ: దేశంలో బ్యాంకుల్లో రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన మరో భారీ కుంభకోణం బయటపడింది. షిప్​ల తయారీ కంపెనీ ఎబీజీ షిప్​యార్డ్ లిమిటెడ్ దేశంలోని వివిధ బ్యాంకుల్లో 22 వేల కోట్లకు పైగా మోసానికి పాల్పడింది. బ్యాంకులకు లోన్లు ఎగ వేశారనే ఆరోపణలతో షిప్ యార్డ్ డైరెక్టర్లపై సీబీఐ కేసు పెట్టింది. ఎస్​బీఐ  నేతృత్వంలోని 28 బ్యాంకుల్లో రూ.22,842 కోట్లకు పైగా మోసాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ షిప్‌‌యార్డ్ చైర్మన్, ఎండీ రిషి కమలేశ్ అగర్వాల్​తో పాటు నలుగురు డైరెక్టర్లు, ఏబీజీ ఇంటర్నేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీపైనా కేసు ఫైల్ చేసినట్లు సీబీఐ అధికారులు చెప్పారు. వీళ్లంతా బ్యాంకుల్లో రుణాలు తీసుకుని ఎగ్గొట్టారని, కుట్ర, నమ్మకద్రోహం వంటి నేరాలకు పాల్పడ్డారంటూ పలు సెక్షన్ల కింద 
కేసులు పెట్టినట్లు తెలిపారు. 

ఒక్క ఎస్​బీఐకే 2,925 కోట్లు బాకీ
మొత్తం 28 బ్యాంకులను ఏబీజీ షిప్​యార్డు మోసం చేసినట్లు సీబీఐ అధికారులు పేర్కొన్నారు. ఇందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు ఐసీఐసీఐ, ఐడీబీఐ వంటి బ్యాంకులున్నాయి. ఈ కుంభకోణంపై ఇప్పటికే బ్యాంకులు 2019 నవంబర్​లో, మరోసారి 2020 ఆగస్టులో ఫిర్యాదు చేశాయి. ఏబీజీ షిప్ యార్డు.. ఎస్​బీఐకి రూ.2,925 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంకుకు రూ.7,089 కోట్లు, ఐడీబీఐ బ్యాంక్​కు రూ.3,634 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడాకు రూ.1,614 కోట్లు, పీఎన్​బీ బ్యాంక్​కు రూ.1,244 కోట్లు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్​కు రూ.1,228 కోట్లు బాకీ ఉందని ఎస్​బీఐ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. బ్యాంకు మోసంపై ఏడాదిన్నరగా దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. ఆధారాలు సేకరించి ఈ నెల 7న ఏబీజీ షిప్ యార్డ్​పై కేసు ఫైల్ చేసింది. 2012 నుంచి 2017 మధ్య నిందితులంతా కుమ్మక్కయ్యారని, బ్యాంకు నిధులను దుర్వినియోగం చేసినట్లు ఫోరెన్సిక్ ఆడిట్​లో తేలిందని పేర్కొంది. సీబీఐ చరిత్రలోనే ఇది అతి పెద్ద మోసం అని ఓ ఉన్నతాధికారి కామెంట్ చేశారు.

For more news..

ఏడాదిలోపు డిజిటల్ రూపాయి లాంచ్

ఈజీ డ్రైవ్​ నుంచి టూవీలర్​ లోన్లు