కరోనాతో బడులు బంద్.. బాల కార్మికులుగా మారుతున్న పిల్లలు

కరోనాతో బడులు బంద్.. బాల కార్మికులుగా మారుతున్న పిల్లలు
  • పిలల్ల సదువులు ఆగం
  • బాల కార్మికులు పెరుగుతున్నరు

కరోనా మహమ్మారి కారణంగా లక్షలాది మంది పిల్లలు బాల కార్మికులుగా మారుతున్నారు. దేశవ్యాప్తంగా నిరుడు మార్చి నుంచే బడులు బంద్ కావడంతో గ్రామీణ ప్రాంత స్టూడెంట్లను తల్లిదండ్రులు పొలం పనులకు, కూలీలకు, పరిశ్రమల్లో ఇతర పనులకు తీసుకెళ్తున్నారు. దీంతో చదువుకోవాల్సిన పిల్లలందరూ బాల కార్మికులుగా మారుతున్నారు. యూనిసెఫ్, ఇతర సంస్థల రిపోర్టుల ప్రకారం.. మన దేశంలో 5 నుంచి 14 ఏండ్ల లోపు పిల్లల్లో కోటి మందికి పైగా బాల కార్మికులు ఉన్నారు. కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితులతో ఈ సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉంది.  

గ్రామీణ ప్రాంత పిల్లలు, వారి తల్లిదండ్రులపై కరోనా తీవ్ర ప్రభావాన్ని చూపెట్టింది. ఊర్లల్లో ఆర్థిక పరిస్థితులు తలకిందులయ్యాయి. దాంతో తల్లిదండ్రులు తమ పిల్లలను వ్యవసాయ పనులకు తీసుకెళ్లడం, ఫ్యాక్టరీలలో చేర్పించడం, చిన్న వయసులోనే పెండ్లిళ్లు చేయడం ఎక్కువైపోయింది. ఇప్పటికే వేలాది చైల్డ్ మ్యారేజ్ లను అధికారులు అడ్డుకున్నారు. బడులు నడుస్తున్నప్పుడు పిల్లలకు పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం అందేది. కానీ ప్రస్తుతం బడులు నడవక, భోజనం కూడా అందకపోవడంతో అనేక మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు.  కరోనా వ్యాప్తితో లక్షలాది మంది వలస కార్మికులు తమ సొంతూళ్లకు వెళ్లారు. దీంతో వారి పిల్లల చదువులు ఆగమయ్యాయి. సొంతూళ్లలో ఉపాధి కరువై, పిల్లలనూ పనులకు తీసుకెళ్తున్నారు. 

ప్రభుత్వాలు పట్టించుకోవాలె 
బాల కార్మికుల సంఖ్య మరింత పెరగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. విద్యార్థులందరికీ ఆన్ లైన్ ఎడ్యుకేషన్ అందేలాగా డిజిటల్ డివైజ్ లు అందజేయాలి. ఉచితంగా ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలి. మధ్యాహ్న భోజనం కూడా అందేలాగా చూడాలి. తల్లిదండ్రులకు సరైన ఉపాధి అవకాశాలు కల్పించాలి. ప్రజలు, వ్యాపారులు, టీచర్లు కలిసికట్టుగా పని చేసి, బాల కార్మికుల సంఖ్య పెరగకుండా చూడాలి. లేనట్లయితే భవిష్యత్తులో ఘోరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. 

చిన్న స్కూళ్లనూ ఆదుకోవాలె 
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన యాన్యువల్ ఎడ్యుకేషన్ రిపోర్టుల ప్రకారం.. ఏటా బాల కార్మికుల సంఖ్య పెరుగుతోంది. దేశవ్యాప్తంగా కరోనా ధాటికి చాలా బడ్జెట్ పాఠశాలలు కూడా మూసివేత దశలో ఉన్నాయి. అందులో చదువుకునే విద్యార్థుల భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకమైంది. అందుకే చిన్న స్కూళ్ల పరిరక్షణకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఆయా స్కూల్స్ లోని ప్రైవేట్ టీచర్లకు ఆర్థిక సాయం చేయాలి. ప్రభుత్వ బడుల్లో సౌలతులు ఏర్పాటు చేయాలి. 
- పిన్నింటి బాలాజీరావు, టీపీయూఎస్ అధ్యక్షుడు, వరంగల్ జిల్లా