చంద్రుడి నుంచి 2 కిలోల మట్టిని తెచ్చిన చైనా

చంద్రుడి నుంచి 2 కిలోల మట్టిని తెచ్చిన చైనా

బీజింగ్: చందమామ ఆవలివైపు ఉపరితలం నుంచి మట్టి, శిలల శాంపిల్స్ ను చైనా వ్యోమనౌక చాంగే–6 విజయవంతంగా భూమికి తీసుకొచ్చింది. శాంపిల్స్ తో కూడిన మాడ్యూల్ మంగళవారం మధ్యాహ్నం ఇన్నర్ మంగోలియాలోని సిజివాంగ్ బ్యానర్ ఏరియాలో సక్సెస్ ఫుల్ గా దిగిందని చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (సీఎన్ఎస్ఏ) ప్రకటించింది. శాంపిల్స్ ను భూమికి తేవడంతో ఈ మిషన్ పూర్తి స్థాయిలో సక్సెస్ అయిందని వెల్లడించింది. 

మాడ్యూల్ ను బీజింగ్ కు తరలిస్తున్నామని, అక్కడ దానిని ఓపెన్ చేసి శాంపిల్స్ ను ల్యాబ్ కు తరలిస్తామని తెలిపింది. వీటిపై పరిశోధనల కోసం అంతర్జాతీయ సైంటిస్టులకు కూడా అవకాశం కల్పిస్తామని పేర్కొంది. అయితే, ఇప్పటివరకూ మనకు కనిపించే చంద్రుడి ఇవతలివైపు (నియర్ సైడ్) ఉపరితలం నుంచి మాత్రమే మట్టి, శిలల శాంపిల్స్ ను భూమికి తీసుకురాగా.. ఆవలివైపు (ఫార్ సైడ్) నుంచి శాంపిల్స్​ను తేవడం ఇదే మొదటిసారి.  

2 కిలోల మట్టి, శిలల శాంపిల్స్.. 

చంద్రుడి ఆవలివైపు ఉపరితలం గురించి తెలుసుకునేందుకు గాను మే 3న చాంగే–6 మిషన్​ను చైనా చేపట్టింది. ఇందులో ఒక ఆర్బిటర్, ఒక రిటర్నర్, ఒక ల్యాండర్, ఒక అసెండర్లతో కూడిన చాంగే–6 వ్యోమనౌకను రాకెట్ ద్వారా ప్రయోగించింది. అంతరిక్షంలోకి చేరిన వ్యోమనౌక ఇంతకుముందే కక్ష్యలోకి పంపిన క్వికియావో–2 అనే రిలే శాటిలైట్ సాయంతో చైనా సౌత్ పోల్​పై ఆవలివైపున అయిట్కెన్ బేసిన్​లో జూన్ 2న విజయవంతంగా దిగింది. 

రెండ్రోజుల్లో డ్రిల్లింగ్ చేసి, దాదాపు 2 కిలోల మట్టి, శిలల శాంపిల్స్ ను సేకరించిన తర్వాత అసెండర్ భాగం పైకి ఎగిరి చంద్రుడి కక్ష్యలోకి చేరింది. ఆర్బిటర్ రిటర్నర్​తో అనుసంధానమై 13 రోజులు లూనార్ ఆర్బిట్​లోనే తిరిగాక భూకక్ష్య వైపు ప్రయాణించింది. మంగళవారం చైనాలోని ఇన్నర్ మంగోలియాలో రిటర్న్​ మాడ్యూల్ విజయవంతంగా దిగింది. చంద్రుడి అవతలివైపు ఉపరితలం లోయలు, కొండలు, బిలాలతోనే నిండి ఉంది. ఈ శాంపిల్స్​ను స్టడీ చేయడం ద్వారా చంద్రుడి ఉపరితలంపై రెండు వైపుల ఉండే భౌగోళిక తేడాలను గుర్తించేందుకు వీలు కానుంది.