శాశ్వత సీజ్ ఫైర్ కోసం కృషి చేస్తం: భారత్​, పాక్ ఘర్షణపై చైనా కామెంట్

శాశ్వత సీజ్ ఫైర్ కోసం కృషి చేస్తం: భారత్​, పాక్ ఘర్షణపై చైనా కామెంట్

బీజింగ్: భారత్, పాకిస్తాన్​ మధ్య శాశ్వత కాల్పుల విరమణ కోసం తాము నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామని చైనా ప్రకటించింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నప్పటి నుంచి తాము తటస్థంగా ఉన్నామని, సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చామని పేర్కొంది. పాకిస్తాన్​ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి మహ్మద్​ఇషాఖ్ దార్​మూడు రోజుల చైనా పర్యటన సోమవారం మొదలైంది. ఈ సందర్భంగా చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావోనింగ్‎ను భారత్, పాక్​ అంశంపై  మీడియా ప్రశ్నించింది. 

ఇందుకు ఆమె స్పందిస్తూ.. ఇరు దేశాల మధ్య శాశ్వత సీజ్​ఫైర్​ కోసం తాము ప్రయత్నిస్తామన్నారు. ఇప్పటికే ఇరు దేశాలు సీజ్​ఫైర్​కు అంగీకరించాయని, దాన్ని శాశ్వతం చేసేందుకు తాము నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామని చెప్పారు. చైనా, పాకిస్తాన్​ మధ్య ఉన్న అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకొని పాక్​డిప్యూటీ పీఎం దార్​ తమ దేశానికి వచ్చారని ఆమె తెలిపారు. 

కాగా, పాకిస్తాన్‏కు ఎయిర్​డిఫెన్స్, శాటిలైట్​సహకారాన్ని చైనా అందించడం వెనుక ఉద్దేశమేమిటని.. పాకిస్తాన్​ఉపయోగించిన చైనా డిఫెన్స్​సిస్టమ్​ఇండియన్​డిఫెన్స్​సిస్టమ్​ముందు నిలవలేకపోయిందన్న కథనాలపై ఏమంటారని మీడియా ప్రశ్నించగా.. ఆమె దాటవేశారు. సంబంధిత అథారిటీని అడగాలని తప్పించుకున్నారు.

మూడు రోజులు చైనాలో పాక్​ ఉప ప్రధాని పర్యటన

పాకిస్తాన్​ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి మహ్మద్​ఇషాఖ్​దార్​మూడు రోజుల చైనా పర్యటన కోసం సోమవారం బీజింగ్‎కు చేరుకున్నారు. భారత్​చేపట్టిన ‘ఆపరేషన్​ సిందూర్’​ తర్వాత చైనాలో ఆయన పర్యటిస్తుండటం ఇదే మొదటి సారి. భారత్, పాక్​ మధ్య నెలకొన్న పరిస్థితులపై చైనా ప్రభుత్వంతో ఆయన చర్చించనున్నారు. సింధూ జలాల ఒప్పందం రద్దు అంశాన్ని  ప్రత్యేకంగా ప్రస్తావించనున్నట్లు తెలుస్తున్నది. 

చైనా నుంచి మరింత డిఫెన్స్​సాయాన్ని పాకిస్తాన్​ కోరనున్నట్లు సమాచారం. దార్​వెంట పాకిస్తాన్ ఆర్మీ ఉన్నతాధికారులు కూడా ఉన్నట్లు తెలుస్తున్నది. కాగా.. 2020 నుంచి 2024 మధ్య పాకిస్తాన్‎కు చైనా భారీగా ఆయుధాలను సరఫరా చేసింది. ఇందులో ఫైటర్​ జెట్లు, రాడార్లు, నౌకలు, సబ్​మెరైన్స్​, మిసైల్స్​ ఉన్నాయి. ఈ వివరాలను ఇటీవల స్టాక్​హోమ్​ఇంటర్నేషనల్​పీస్​రీసెర్చ్​ఇన్​స్టిట్యూట్​(ఎస్​ఐపీఆర్​ఐ) రిపోర్ట్​ బయటపెట్టింది.