చైనాలో న్యుమోనియా బీభత్సం.. సమాచారం కోరిన ఆరోగ్య సంస్థ

చైనాలో న్యుమోనియా బీభత్సం.. సమాచారం కోరిన ఆరోగ్య సంస్థ

పిల్లలలో శ్వాసకోశ వ్యాధులు, న్యుమోనియా లక్షణాలతో పెరుగుతున్న కేసుల గురించి మరింత సమాచారం కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అధికారికంగా చైనాను అభ్యర్థించింది. అయినప్పటికీ, చైనా ఎటువంటి వ్యాధులను గుర్తించలేదని తెలిపింది. ఉత్తర చైనాలోని పిల్లలలో శ్వాసకోశ వ్యాధులు ఆందోళనకరమైన పెరుగుదలను చూపుతున్న చైనీస్ నిఘా వ్యవస్థ నుంచి డేటాను పర్యవేక్షిస్తున్నట్లు UN ఆరోగ్య సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ విషయంపై నవంబర్ 23న టెలికాన్ఫరెన్స్ నిర్వహించింది. పరిస్థితిని నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు చెప్పారు.  

చైనాలో వ్యాప్తి చెందుతున్న ఈ కొత్త వ్యాధి ప్రపంచానికి ముప్పు కాదా అనే దానిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టంగా ఏమీ చెప్పలేదు. కానీ డబ్ల్యూహెచ్ఓ ఈ విషయంపై క్షుణ్ణంగా పరిశీలన చేస్తోంది. వాస్తవానికి 2019లో ఈ సీజన్లో చైనాలో కరోనా కేసులు నమోదు కాగా, ఆ తర్వాత ఈ వైరస్ ప్రపంచాన్ని వణికించింది. అందుకే వీలైనంత త్వరగా ఈ కొత్తగా వెలుగులోకి వచ్చిన ఈ న్యుమోనియా వ్యాధికి కారణాన్ని కనుగొనేందుకు డబ్ల్యూహెచ్ఓ ప్రయత్నిస్తోంది.

అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, చైనాలోని ప్రజలు శ్వాసకోశ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించే చర్యలను అనుసరించాలని WHO సిఫార్సు చేస్తోంది. ఇందులో ఇన్ఫ్లుయెంజా, కొవిడ్ - 19(COVID-19), ఇతర శ్వాసకోశ వ్యాధికారక కారకాలకు వ్యతిరేకంగా సిఫార్సు చేయబడిన టీకాలు ఉన్నాయని ఏజెన్సీ తెలిపింది.