చైనా పోర్ట్ సిటీలో మళ్లీ కరోనా కేసులు: ఐదు రోజుల్లో సిటీ మొత్తానికి టెస్టులు

చైనా పోర్ట్ సిటీలో మళ్లీ కరోనా కేసులు: ఐదు రోజుల్లో సిటీ మొత్తానికి టెస్టులు

దాదాపు 94 లక్షల జనాభా ఉన్న సిటీలో ప్రతి ఒక్కరికీ కేవలం ఐదు రోజుల్లో కరోనా టెస్టులు చేయాలని చైనా నిర్ణయించింది. తొలుత ఆ దేశంలోనే మొదలైన కరోనా వైరస్ వ్యాప్తి దాదాపుగా కంట్రోల్ అయిన సమయంలో పోర్ట్ సిటీ షింగ్‌డావోలో మళ్లీ పాజిటివ్ కేసులు రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కొన్ని నెలలుగా కరోనా కేసులే లేని షింగ్‌డావోలో ఆదివారం నాడు ఆరుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో మున్సిపల్ హెల్త్ కమిషన్ అధికారులు అలర్ట్ అయ్యారు. సిటీలో ఉంటున్న మొత్తం 94 లక్షల మందికి కరోనా టెస్టులు చేయాలని నిర్ణయించినట్లు సోమవారం ప్రకటించారు. భారీ సంఖ్యలో వేగంగా టెస్టులు చేసేందుకు అవసరమైన కెపాసిటీ చైనాకు ఉందని హెల్త్ కమిషన్ తెలిపింది. ఆదివారం కొత్తగా కరోనా కేసులు నమోదనప్పటి నుంచి సోమవారం ఉదయం లోపే లక్షా 40 వేల మంది డాక్టర్లు, నర్సులు, హాస్పిటల్ సిబ్బంది, సిటీలో రకరకాల జబ్బులతో ఆస్పత్రుల్లో ఉన్న పేషెంట్లకు టెస్టులు పూర్తి చేసినట్లు చెప్పింది. టార్గెట్ అనుకున్న ప్రకారం ఐదు రోజుల్లోనే 94 లక్షల మందికి టెస్టులు చేస్తామని వెల్లడించింది. చైనాలో ఇంత భారీ సంఖ్యలో కరోనా పరీక్షలు చేయడం ఇదే తొలిసారి కాదు. జూన్ నెలలో 2 కోట్ల మంది జనాభా ఉన్న బీజింగ్ సిటీ మొత్తానికి టెస్టులు చేశారు.