అమెరికా ఆర్మీ నెట్​వర్క్​లోకి చైనా మాల్​వేర్​

అమెరికా ఆర్మీ నెట్​వర్క్​లోకి చైనా మాల్​వేర్​
  • సీక్రెట్​గా చేర్చిన చైనీస్ హ్యాకర్లు 
  • దానితో మిలిటరీ బేస్​లకు, ఇండ్లకు కరెంట్ కట్ చేయొచ్చు 
  • న్యూయార్క్ టైమ్స్ పత్రిక కథనం

న్యూయార్క్: అమెరికా మిలిటరీ నెట్ వర్క్​లోకి చైనీస్ హ్యాకర్లు ఒక సీక్రెట్ మాల్వేర్ ను చొప్పించారని, ఆ మాల్​వేర్​ను గుర్తించేందుకు అమెరికన్ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని న్యూయార్క్ టైమ్స్ పత్రిక శనివారం ఓ కథనంలో వెల్లడించింది. అమెరికాలోని పవర్ గ్రిడ్లు, కమ్యూనికేషన్ నెట్ వర్క్​లను ఆ మాల్​వేర్​తో చైనా కంట్రోల్ చేసే అవకాశం ఉందని.. అదే గనక జరిగితే కీలకమైన మిలిటరీ బేస్​లకు కరెంట్, వాటర్ సప్లైకి ఆటంకం కలుగుతుందని తెలిపింది. కమ్యూనికేషన్ వ్యవస్థలనూ స్తంభింపచేసే ప్రమాదం ఉందని పేర్కొంది. కేవలం మిలిటరీ బేస్​లకే కాకుండా దేశవ్యాప్తంగా సాధారణ జనాలకు సైతం కరెంట్, వాటర్, కమ్యూనికేషన్ కట్ అయ్యేలా ఈ మాల్​వేర్​తో కంట్రోల్ చేసే చాన్స్ ఉందంటూ అధికారులను ఉద్దేశించి చెప్తున్నారని ఆ పత్రిక వివరించింది. 

ఇండో–పసిఫిక్​లో చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసేలా తైవాన్ కు అమెరికా మద్దతిస్తున్న నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఘర్షణలు పెరిగితే.. చైనా హ్యాకర్లు అమెరికాపై ఈ మాల్​వేర్​తో ప్రతాపం చూపుతారన్న ఆందోళనలు నెలకొన్నాయని పేర్కొంది. కాంగ్రెస్ అధికారి ఒకరు ఈ మాల్​వేర్​ను ‘టైమర్ ఆన్ చేసిన టైం బాంబు’గా పోల్చారని తెలిపింది. కాగా, చైనాలో అమెరికన్ అంబాసిడర్ నికోలస్ బర్న్స్ ఈమెయిల్ అకౌంట్​ను చైనా హ్యాకర్లు హ్యాక్ చేశారని వారం కిందట సీఎన్ఎన్ వార్తా సంస్థ కూడా వెల్లడించింది.