సంపన్న రాష్ట్రంలో..కొంటేనే చదువులు.. విద్యపై ఇచ్చిన హామీలన్నీ మరిచిన కేసీఆర్​

సంపన్న రాష్ట్రంలో..కొంటేనే చదువులు.. విద్యపై ఇచ్చిన హామీలన్నీ మరిచిన కేసీఆర్​
  • నిధులు, నియామకాలు లేక ఆగమైతున్న ప్రభుత్వ విద్య

ఏ సమాజమైనా సుస్థిర, సమగ్ర అభివృద్ధి సాధించాలంటే నాణ్యమైన మానవ వనరులు కావాలి. నాణ్యమైన మానవ వనరులు సంపదను సృష్టించి, సామాజిక అవసరాలను తీరుస్తూ మెరుగైన జీవనానికి పునాదులు వేస్తాయి. నాణ్యమైన మానవ వనరులు ఎదగాలంటే సమాజానికి నాణ్యమైన విద్య అందించాలి. ఉమ్మడి ఏపీలో పాలకులు తెలంగాణ ప్రాంతంలో విద్యపై వివక్ష చూపారు. రాష్ట్రం సాధించుకుంటే విద్యారంగాన్ని ఉన్నతంగా అభివృద్ధి చేసుకోవచ్చని ఉద్యమ కాంలంలో ప్రజలు ఆకాంక్షించారు.

తెలంగాణ వచ్చిన తర్వాత అధికారం చేపట్టిన కేసీఆర్ మొదట్లో విద్యారంగ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని పలుమార్లు ప్రకటించారు. మౌలిక వసతుల లేమితో కునారిల్లుతున్న ప్రభుత్వ స్కూళ్లను కార్పొరేట్ కు దీటుగా తీర్చిదిద్దుతామని, కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్యను అందిస్తామని, సామాజిక, ఆర్థిక అంతరాలు లేని కామన్ స్కూల్ విధానాన్ని అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలో మహిళా, గిరిజన యూనివర్సిటీలతో పాటు ప్రతి జిల్లాకు ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని, విద్యారంగంలో ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తూ నాణ్యమైన విద్యను అందిస్తామని వాగ్దానం చేశారు. టీచర్​ పోస్టులు భర్తీ చేస్తామని, కామన్ సర్వీసు రూల్స్ సమస్యకు ఒకే ఒక్కరోజులో పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు. తొమ్మిదేండ్లలో పైహామీలు ఒక్కటి కుడా నెరవేరలేదు.

టీచర్ పోస్టులు భర్తీ చేయట్లే

తెలంగాణలో తొమ్మిది ఏండ్లలో కేవలం ఒకే ఒక్క సారి డీఎస్సీ నిర్వహించి ఏడున్నర వేల టీచర్​ పోస్టులు మాత్రమే భర్తీ చేశారు. ప్రస్తుతం 20వేల ఖాళీలు ఉన్నప్పటికీ నియామకాల ఉసే లేదు. గతేడాది డీఎస్సీ వేస్తామని ప్రకటించి జూన్ 2022 లో టెట్ నిర్వహించారు. సంవత్సరం దాటినా డీఎస్సీ మాట ఎత్తడం లేదు. ఒక్కరోజులో పరిష్కరిస్తామన్న కామన్ సర్వీసు రూల్స్ సమస్యను ప్రభుత్వం మరిచిపోయింది. వివాదాస్పద కొత్త సర్వీస్ రూల్స్ ఉత్తర్వులు ఇచ్చి, మరిన్ని సమస్యలను సృష్టించి టీచర్ల ప్రమోషన్లను జటిలం చేసింది. టీచర్​ పోస్టులు ఖాళీ ఉంటే పిల్లల చదువులకు ఇబ్బంది కలగకుండా విద్య వలంటీర్లను నియమించేవారు. రాష్ట్రంలో 2020-–21 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం ఖాళీలలో నియమాకాలు చేయకుండా, విద్యా వలంటీర్లతో నింపకుండా చదువును నిర్లక్ష్యం చేస్తున్నది. కరోనా తర్వాత ప్రభుత్వ బడుల్లో 1.20 లక్షల మంది విద్యార్థులు అదనంగా చేరారు. పెరిగిన సంఖ్యకు అనుగుణంగా తాత్కాలికంగా విద్యా వలంటీర్లను నియమించాల్సింది పోయి, గతంలో పనిచేసిన 15 వేల మందిని తొలగించడం బడులపై నిర్యక్ష్యానికి నిదర్శనం. మరోవైపు ఈ తొమ్మిదేండ్లలో 4 వేలకు పైగా స్కూళ్లను మూసివేసింది.

ఉన్నత విద్యకు ఉరి

ఇంటర్ విద్య పరిస్థితి మరింత దుర్భరంగా ఉంది. రాష్ట్రంలో 407 ప్రభుత్వ జూనియర్  కాలేజీలు, అందులో 5800 అధ్యాపక పోస్టులు ఉండగా కేవలం 750 మంది రెగ్యులర్ అధ్యాపకులు మాత్రమే పనిచేస్తున్నారు. మిగతా 5,100 ఖాళీలలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, గంటల ప్రాతిపదికన అధ్యాపకులచే బోధన చేయించి శ్రమదోపిడీ చేస్తున్నారు. ఉన్నత విద్యారంగం పరిస్థితి  కూడా ఇదే రకంగా ఉంది. రాష్ట్రంలో ఇంటర్, ఉన్నత విద్య పూర్తిగా ప్రైవేటు చేతుల్లోకి వెళ్లిపోయింది. తెలంగాణలో ఇప్పటికీ ఐదు ప్రైవేటు యూనివర్సిటీలు ఉండగా మరో 5 ప్రైవేటు యూనివర్సిటీలు రానున్నాయి. ప్రభుత్వ యూనివర్సిటీలలో అధ్యాపకులతో 40 శాతం  పనిచేస్తుండగా 60 శాతం ఖాళీలు, డిగ్రీ కళాశాలలో 50 శాతానికి పైగా ఖాళీలు ఉన్నాయి. ఉన్నత విద్యారంగం ఖాళీలు, నిధుల కొరతతో విలవిలలాడుతున్నది. ఉన్నత విద్య కోసం  2023 బడ్జెట్ లో కేటాయించింది  రూ.3,001కోట్లు మాత్రమే. అంటే మొత్తం బడ్జెట్ లో 1శాతం మాత్రమే. ఇది నిర్వహణ వ్యయానికే సరిపోతుంది. సంపన్నరాష్ట్రంగా, దేశంలోనే నంబర్​ వన్​గా చెప్పుకునే తెలంగాణలో విద్యారంగానికి బడ్జెట్ కేటాయింపులు 10 శాతం కూడా దాటకపోవడం, పాఠశాల విద్యలో 20 శాతం, ఇంటర్ విద్యలో 55 శాతం, ఉన్నత విద్యలో 60 శాతం ఖాళీలు ఉండడం, శోచనీయం. కార్పొరేట్ అనుకూల విధానాల వల్ల ప్రభుత్వ విద్యాసంస్థలు సహజ మరణాన్ని పొందుతున్నాయి. ఫలితంగా విద్య వ్యాపారంగా మారింది. తద్వారా చదువు అంగడి సరుకుగా మారి కొనగలిగే వాడికే సొంతమై పేదలకు అందని ద్రాక్షగా మిగిలే ప్రమాదం ఉంది.

బడ్జెట్​లో విద్యకు భారీ కోత

ఉమ్మడి ఏపీలో ప్రభుత్వం విద్యపై చూపిన నిర్లక్ష్యానికి రెట్టించిన నిర్లక్ష్యం ఇప్పుడు తెలంగాణలో కొనసాగుతున్నది. కేసీఆర్ ప్రభుత్వం విద్యకు బడ్జెట్ కేటాయింపులు భారీగా తగ్గించింది. ఉమ్మడి ఏపీలో విద్యకు 13 నుంచి 15 శాతంగా ఉన్న బడ్జెట్ కేటాయింపులు 2014 నుంచి క్రమంగా తగ్గాయి. 2014-–15లో 10.89 శాతం, 2015-–16లో 9.6 9శాతం,  2016-–17 లో 8.23 శాతం, 2017-–18లో 8.49 శాతం, 2018–19లో 7.61 శాతం,  2019–20 లో6.76 శాతం, 2020-–21 లో 6.63 శాతం, 2021-–22లో 6.76 శాతం, 2022–23 లో 6.26 శాతం కాగా 2023-–24  బడ్జెట్ లో విద్యకు కేటాయించింది కేవలం 6.56  శాతమే. రాష్ట్రంలో పాఠశాల విద్యలో బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం సుమారు ఇరవై వేల టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. 484 మండల విద్యాధికారి(ఎంఈవో)  పోస్టులలో 17 మంది మాత్రమే రెగ్యులర్ విధానంలో పనిచేస్తుండగా 467 ఖాళీలన్నాయి. 33 జిల్లాలకు 12  జిల్లా విద్యా అధికారి(డీఈవో) పోస్టులు మాత్రమే మంజూరు అయినవి అందులో ఐదుగురు మాత్రమే రెగ్యులర్ విధానంలో పని చేస్తుండగా 21 జిల్లాల్లో ఇన్​చార్జి డీఈవోలు పనిచేస్తున్నారు. 62 డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ లకు 58 ఖాళీలు, 16 హెడ్‌మాస్టర్ గ్రేడ్-1 లలో 15 ఖాళీలు, 4,421 హెడ్‌మాస్టర్ గ్రేడ్ -2 లకు 1947 మంది పని చేస్తుండగా 2474 ఖాళీలు ఉన్నాయి. 2019లో రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత జిల్లాలు 10 నుంచి 33 వరకు, పెరగ్గా మండలాల సంఖ్య 594కి చేరుకుంది. రాష్ట్రంలో అదనంగా ఏర్పడినమండలాలకు ఎంఈవో పోస్టుల నియామకాలకు ఎటువంటి ప్రయత్నాలు చేయడం లేదు. రెగ్యులర్ ఎంఈవోలు లేక స్కూళ్లలో స్టాండర్డ్స్ పడిపోతున్నాయి.

25 లక్షల మందిని వదిలి... 4 లక్షల మందికి విద్యనిస్తే చాలా?
గురుకులాల ద్వారా మొత్తం విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని చేసే ప్రచారంలో నిజం లేదు. రాష్ట్రంలో 60లక్షల స్టూడెంట్లు స్కూల్ స్థాయిలో నమోదులో ఉండగా సుమారు 30లక్షల 50వేలు ప్రైవేటు స్కూళ్లల్లో, 29 లక్షల 50వేల విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో విద్య పొందుతున్నారు. ప్రభుత్వం తన బ్రాండుగా, గొప్పగా చెప్పే కులాల పేరుతో మతాల పేరుతో స్థాపించిన 1002 గురుకుల స్కూళ్ల లో  నాలుగున్నర లక్షల మంది మాత్రమే చదువుతున్నారు. కేవలం  నాలుగున్నర లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తూ మిగతా 25 లక్షల స్టూడెంట్ల విద్యను నిర్లక్ష్యం చేస్తున్నారు. 2022 జనవరిలో మన ఊరు–మనబడి, మన బస్తీ–మన బడి పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా  మొదటి దశ క్రింద 9123 బడుల్లో సౌలత్​లు కల్పిస్తామన్నారు. కానీ ఇది ముందుకు పడలేదు. తరగతి గదులు శుభ్రం చేయడానికి, బడి గంట కొట్టడానికి, మూత్రశాలలు, మరుగుదొడ్లను శుభ్రం చేయడానికి అటెండర్లు, పారిశుద్ధ్య నిర్వాహకులు లేక పోవడంతో పిల్లలు, టీచర్లు నానా అవస్థలు పడుతున్నారు. మధ్యాహ్న భోజన కార్మికులకు సకాలంలో బిల్లులు చెల్లించకుండా నెలల తరబడి జాప్యం చేయడం వల్ల మధ్యాహ్న భోజన ఏజెన్సీలు అప్పుల పాలై వంట చేయడానికి ముందుకు రావడం లేదు.

- డి.శ్రీనివాస్,రాష్ట్ర ఉపాధ్యక్షుడు, టీపీటీఎఫ్