బ్యాటరీల తయారీకి బడా కంపెనీల పోటీ

బ్యాటరీల తయారీకి బడా కంపెనీల పోటీ

న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్​ వెహికల్స్​(ఈవీ) బ్యాటరీలను మనదేశంలోనే పెద్ద ఎత్తున తయారు చేయడానికి కేంద్రం  ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) కింద రాయితీలిస్తోంది. వీటిని పొందడానికి  బడా కంపెనీలు రంగంలోకి దిగాయి. ఇండియాలోనే పెద్ద ఎత్తున బ్యాటరీల తయారీకి ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఈ పథకం కింద రెండేళ్ల కాలంలో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. లోకల్​గా తయారు చేసిన బ్యాటరీల అమ్మకాలపై ఐదు సంవత్సరాలపాటు రూ.18,100 కోట్ల విలువైన ఇన్సెంటివ్​లు ఇస్తారు. ఈ పథకం కోసం శనివారం నాటికి 10 సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయని మినిస్ట్రీ ఆఫ్​ హెవీ ఇండస్ట్రీస్​ (ఎంహెచ్​ఐ) సీనియర్​ ఆఫీసర్​ ఒకరు చెప్పారు. ఇవన్నీ అడ్వాన్స్​డ్​ కెమిస్ట్రీ సెల్​ (ఏసీసీ) బ్యాటరీ స్టోరేజీ ప్రోగ్రామ్​ కోసం రిక్వెస్ట్​ ఫర్​ ప్రపోజల్స్​ (ఆర్​ఎఫ్​పీ)ని అందజేశాయి.  రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్ లిమిటెడ్, (రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్  అనుబంధ సంస్థ), హ్యుండయ్ గ్లోబల్ మోటార్స్ కంపెనీ లిమిటెడ్, ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్, లుకాస్- టీవీఎస్​ లిమిటెడ్, మహీంద్రా & మహీంద్రా లిమిటెడ్, అమర రాజా బ్యాటరీస్ లిమిటెడ్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, లిమిటెడ్ ఇండస్ట్రీస్ లార్సెన్ & టూబ్రో లిమిటెడ్, ఇండియా పవర్ కార్పొరేషన్ లిమిటెడ్‌ల నుంచి అప్లికేషన్లు వచ్చాయని కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయి. ఈ స్కీమ్​ కింద ఈ నెల 14 వరకు అప్లికేషన్లు తీసుకున్నామని, 15న టెక్నికల్​ బిడ్స్​ను తెరిచామని వెల్లడించాయి. ఎంపికైన కంపెనీ రెండేళ్లలోపు మాన్యుఫ్యాక్చరింగ్​ ఫెసిలిటీని ఏర్పాటు చేయాలి. ఏసీసీని 50 గిగావాట్​ అవర్​ (జీడబ్ల్యూహెచ్​) మేరకు పెంచడానికి పీఎల్​ఐ స్కీమును ప్రభుత్వం ప్రకటించింది. ఏసీసీ కంటే 2.6 రెట్లు ఎక్కువ కెపాసిటీ కోసం దేశవిదేశాల కంపెనీల నుంచి బిడ్స్​ వచ్చాయని సీనియర్​ ఆఫీసర్​ ఒకరు చెప్పారు. ఈ కంపెనీలన్నీ బ్యాటరీలను తయారు చేయడం మొదలుపెడితే దేశమంతటా ఈవీల వాడకం పెరుగుతుంది. ఫలితంగా పెట్రోల్​, డీజిల్​ వెహికల్స్​తగ్గుతాయి. దీనివల్ల మనదేశం దిగుమతి చేసుకునే పెట్రో ప్రొడక్టుల పరిమాణమూ తగ్గి ఫారెన్​ కరెన్సీ ఆదా అవుతుంది. దీనికితోడు పర్యావరణానికి మేలు జరుగుతుంది. కాలుష్యం తగ్గుతుంది. 

పీఎస్​యూ జాగాల్లో చార్జింగ్ స్టేషన్లు

 పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్‌‌‌‌లను ఏర్పాటు చేసే ప్రైవేట్ ఏజెన్సీలకు భూమిని అందించడానికి ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలకు అనుమతులు వచ్చాయి. బిడ్డింగ్​ ద్వారా   ప్రైవేట్​ కంపెనీలను ఎంపిక చేసి పబ్లిక్​ సెక్టార్​ యూనిట్​ (పీఎస్​యూ) ఆవరణలో జాగా ఇస్తారు. చార్జింగ్​ ద్వారా వచ్చే ఆదాయాన్ని రెండు సంస్థలూ పంచుకుంటాయి.  ​ ఫ్లోర్​ప్రైస్​ను యూనిట్​కు రూపాయిగా నిర్ణయించారు.  ప్రభుత్వ ఏజెన్సీల వద్ద అందుబాటులో ఉన్న భూమిని చార్జింగ్​ స్టేషన్లకు యూనిట్‌‌‌‌కు రూపాయి రాయితీతో అందించవచ్చు. ఈ స్టేషన్ల టారిఫ్ కూడా మార్చి 2025 వరకు సరఫరా సగటు ధరను మించకుండా చూస్తారు. మునుపటి మార్గదర్శకాల ప్రకారం, పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్‌‌‌‌ల టారిఫ్  సరఫరాకు అయ్యే సగటు ఖర్చులో 15 శాతానికి మించకూడదు. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ  కొత్త   గైడ్​లైన్స్ ప్రకారం రెండు సంస్థలూ పదేళ్ల వరకు ఒప్పందం కుదుర్చుకోవచ్చు. ఈవీల కస్టమర్లు తమ ఇండ్లలోనూ సాధారణ కరెంటు ద్వారా చార్జింగ్ చేసుకోవచ్చు. మరో సంగతి ఏమిటంటే.. అన్ని గవర్నమెంటు ఆఫీసుల్లోనూ ఈవీలను వాడాలని కేంద్రం తన డిపార్ట్​మెంట్లతోపాటు రాష్ట్రాలకు సూచించింది. వీలైతే పాత వెహికల్స్​ను ఎలక్ట్రిక్​ వెహికల్స్​గా అప్​గ్రేడ్​ చేసుకోవచ్చని పేర్కొంది.