24 గంటల్లో ఆ ట్వీట్లు డిలీట్ చేయండి

24 గంటల్లో ఆ ట్వీట్లు డిలీట్ చేయండి

న్యూఢిల్లీ : ముగ్గురు కాంగ్రెస్ సీనియర్ నేతలకు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కుమార్తెకు సంబంధించి వారు చేసిన ట్వీట్లను 24గంట్లలోగా డిలీట్ చేయాలని జైరాం రమేష్, పవన్ ఖేరా, నెట్టా డిసౌజాలను ఆదేశించింది. ఒకవేళ వారు డిలీట్ చేయకపోతే ట్విట్టర్ వారి ట్వీట్లను తొలగించాలని సూచించింది. ఇక స్మృతి ఇరానీ దాఖలు చేసిన రూ.2 కోట్ల పరువునష్టం కేసులో ఆగస్టు 18న కోర్టు ఎదుట హాజరుకావాలని ముగ్గురు నేతలను ఆదేశించింది. కాంగ్రెస్ నేతల ట్వీట్ల ద్వారా పిటిషన్దారు పరువుకు భంగం వాటిల్లిందని  విచారణ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ మణి పుష్కర్ణ అభిప్రాయపడ్డారు. నిజానిజాలు తెలియకుండానే ఆరోపణలు చేసినట్లు అర్థమవుతోందని అన్నారు. 

హైకోర్టు సమన్లు జారీ చేసిన విషయాన్ని జైరాం రమేష్  కన్ఫమ్ చేశారు. స్మృతి ఇరానీ దాఖలు చేసిన కేసుపై సమాధానం ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టు నోటీసు జారీ చేసినట్లు ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. వాస్తవాలు కోర్టు ముందుంచేందుకు సిద్ధంగా ఉన్నామన్న రమేష్.. స్మృతి ఇరానీ ఆరోపణలను ఛాలెంజ్ చేయనున్నట్లు ప్రకటించారు. 

ఇదిలా ఉంటే కాంగ్రెస్ నేతల వైఖరిపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఫైర్ అయ్యారు. సాధారణ పౌరులైనా, ఒక హోదాలో ఉన్న వారిపై కించపరిచే ఆరోపణలు చేసేటప్పుడు నిజానిజాలు తెలుసుకోవాలని చురకలంటించారు. 

స్మృతి ఇరానీ కూతురు (18) గోవాలో ఎలాంటి అనుమతులు లేకుండా బార్ నిర్వహిస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి తన కూతురు ఎలాంటి వ్యాపారాలు చేయడం లేదని చెప్పారు. తన పరువుకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేసిన జైరాం రమేష్, పవన్ ఖేరా, నెట్టా డిసౌజాలపై పరువు నష్టం దావా వేశారు.