కాంగ్రెస్ ను బతికించిందే ఆర్యవైశ్యులు : తుమ్మల నాగేశ్వరరావు

కాంగ్రెస్ ను బతికించిందే ఆర్యవైశ్యులు : తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం టౌన్, వెలుగు :  స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీని బతికించింది ఆర్యవైశ్యులేనని మాజీ మంత్రి, ఖమ్మం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సిటీలోని 32 వ డివిజన్ లో బొలిశెట్టి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఖమ్మం కాంగ్రెస్ పార్టీ పాలేరు నియోజకవర్గ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. వామపక్ష భావజలంతో నైజాంకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర ఆర్యవైశ్యులదన్నారు. ఖమ్మం నేడు అరాచకాలకు, అవినీతికి, భూ కబ్జాలకు మారు పేరుగా మారిందన్నారు. బుధవారం జరిగిన సభలో సీఎం కేసీఆర్ ఓటమికి భయపడి దిగజారుడు మాటలు మాట్లాడారని మండిపడ్డారు.

కల్వకుంట్ల కుటుంబం అవినీతితో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందని విమర్శించారు. రాజకీయ నాయకునికి ఉండాల్సిన లక్షణాలకన్నా, భిన్నమైన లక్షణాలు కలిగిన వ్యక్తి పువ్వాడ అజయ్ అన్నారు. కక్ష సాధింపు అతని నైజమని, ఏ సామాజిక వర్గం దగ్గరకు వెళితే ఆ పేరు తగిలించుకుని తిరుగుతున్న మేక వన్నె పులి పువ్వాడ అని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో అభివృద్ధి చేసే నాయకుడు కావాలో, అరాచకాలు  చేసే నాయకుడు కావాలో ప్రజలు తేల్చుకోవాలన్నారు. అనంతరం తుమ్మల క్యాంపు కార్యాలయంలో పలువురు బీఆర్ఎస్  నుంచి కాంగ్రెస్​లో చేరారు.

యూత్ ఆధ్వర్యంలో భారీ బైక్​ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు మహ్మద్ జావేద్, సీనియర్ నాయకులు సుగ్గల ఈశ్వర లింగం, యెర్నేని రామారావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మానుకొండ రాధా కిషోర్, మున్నూరు కాపు సంఘం నాయకులు శెట్టి రంగారావు, పొదిలి రవికుమార్, తాళ్లూరి హనుమంతరావు, కార్పొరేటర్లు నాగండ్ల దీపక్ చౌదరి, దొడ్డా నగేశ్, వడ్డేబోయిన నర్సింహారావు, కోసూరి రమేశ్​గౌడ్, శంకర్ నాయక్, కల్లూరి సోమనాథం, నరాల నరేశ్, బాణాల లక్ష్మణ్, రమాదేవి పాల్గొన్నారు.

ALSO READ : మహబూబ్​నగర్ జిల్లాలో వంద మంది నేతలు బీఎస్పీలో చేరారు