
ఈ మధ్య ఆన్ లైన్ పేరుతో సైబర్ నేరగాళ్లు నగదు కొట్టేస్తూ.. సొమ్ము పోగు చేసుకుంటున్నారు. మాయమాటలు చెప్తూ మహిళలను మోసం చేస్తున్నారు. లక్షల్లో దోచేసుకుంటున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో సైబర్ మోసగాళ్లు మహిళలను బురిడి కొట్టించారు. గిఫ్ట్స్ పేరుతో భారీ మొత్తంలో ఆన్ లైన్ లో నగదు కాజేశారు.
అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పీజేఆర్ ఎంక్లేవ్ కాలనీలో ఇద్దరు మహిళలు నివాసముంటున్నారు. వీరు సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే వీరిద్దరిని టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు మంచి గిఫ్ట్ ఇస్తామని నమ్మబలికారు. టాస్క్ పేరుతో ఆన్ లైన్ ద్వారా మొత్తం రూ. 25,23,375 కాజేశారు.
మొదటి మహిళ నుంచి రూ.20,63,375, మరో మహిళ నుంచి రూ. 4,60,000 నగదు తీసుకున్నారు. బహుమతులు వస్తాయనుకుని భారీ మొత్తంలో నగదును ట్రాన్స్ ఫర్ చేసిన మహిళలు..డబ్బులు పంపించాక నిందితుల ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో మోస పోయినట్లు బాధితులు గ్రహించారు. ఆ తర్వాత అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఇద్దరు మహిళలు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.