గన్స్ లాక్కొని కాల్పులు జరిపారు. అందుకే ఎన్ కౌంటర్ చేశాం: సీపీ సజ్జనార్

గన్స్ లాక్కొని కాల్పులు జరిపారు. అందుకే ఎన్ కౌంటర్ చేశాం: సీపీ సజ్జనార్

దిశ హత్యకేసు నిందితులు నేరస్వభావం ఎక్కువ

సాక్ష్యాల్ని తారుమారు చేసేందుకు ప్రయత్నించారు

గన్స్ లాక్కొని పోలీసులపై కాల్పులు జరిపారు

కాల్పుల్లో ఎస్సై, కానిస్టేబుల్ కు తీవ్రగాయాలయ్యాయి.  

దిశ హత్యకేసులో నిందితులు నేరపూరిమైన స్వభావం కలిగి ఉన్నారని సైబరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. దిశ హత్యకేసు నిందితుల ఎన్ కౌంటర్ అనంతరం మీడియాతో మాట్లాడిన సీపీ..బాధితురాలి సెల్ ఫోన్ , పవర్ బ్యాంక్ , వాచ్ ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కేసు విచారణలో భాగంగా నిందితుల్నితెల్లవారు జామున చటాన్ పల్లి అండర్ పాస్ బ్రిడ్జ్ వద్దకు తీసుకు వచ్చి ఆరా తీశామన్నారు. సాక్షాల్ని తారుమారు చేసేందుకు ప్రయత్నం చేశారన్నారు.

తెల్లవారు జామున 5:45 నుంచి 6:10 సమయంలో నిందితులు తప్పించుకునేందుకు పోలీసులపై రాళ్లతో దాడి చేశారని..ఏ1 ఆరీఫ్, ఏ4 చెన్నకేశవులు పోలీసుల వద్ద గన్ తీసుకొని కాల్పులు జరిపారన్నారు.

నవీన్, శివ రాళ్లతో దాడి చేయడంతో ఎస్సై వెంకటేశ్వేర్లు, కానిస్టేబుల్ అరవింద్ గౌడ్ కు గాయాలయ్యాయని చెప్పారు. కాల్పులు జరపొద్దని వారించినా నిందితులు పట్టించుకోకుండా కాల్పులకు తెగబడ్డారన్నారు. దీంతో కాల్పులు చేయాల్సి వచ్చిందని సీపీ చెప్పారు.

విచారణ పూర్తి కాలేదు..!

నిందితులపై ఎన్ కౌంటర్ జరిగినా కేసు విచారణ ముగియలేదన్నారు. దిశ హత్యకేసు నిందితుల్లో ఎవరూ మైనర్లు లేరన్నారు. నేర పూరిత స్వభావం ఉన్న ఈ నలుగురు గతంలో ఏమైనా దారుణాలకు తెగబడ్డారా అన్న కోణంలో విచారిస్తున్నట్లు తెలిపారు.

దిశ కుటుంబసభ్యులపై ప్రశ్నల వర్షం కురిపించొద్దు

దిశ హత్యకేసు వ్యవహారం చాలా సున్నితమైన అంశమని సీపీ సజ్జనార్ చెప్పారు. ఈ కేసుకు సంబంధించి వారి కుటుంబసభ్యుల్ని అడిగే ప్రయత్నం చేయోద్దని కోరారు.