యూరప్లో రికార్డు ఉష్ణోగ్రతలు..జనం అవస్థలు

యూరప్లో రికార్డు ఉష్ణోగ్రతలు..జనం అవస్థలు

యూరప్ నిప్పుల కుంపటయ్యింది. రోజు రోజుకు పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎండల తీవ్రతకు ఇప్పటి వరకు యూరప్ లోని 21 దేశాల్లో 15 వందల మందికి పైగా చనిపోయారు. ముఖ్యంగా పశ్చిమ యూరప్‌ లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. వడగాలులు తీవ్రంగా వీస్తున్నాయి. సోమవారం స్పెయిన్‌ లో ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయిలో 43 డిగ్రీలు దాటాయి. బ్రిటన్, ఫ్రాన్స్‌లో వడగాలుల తీవ్రతతకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించారు. బ్రిటన్, ఫ్రాన్స్‌ లో ఉష్ణోగ్రతలు మరింత పెరగొచ్చని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫ్రాన్స్‌ లోని చాలా ప్రాంతాల్లో గతంలో ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ వెల్లడించింది. నాట్‌ సిటీలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని చెప్పింది. 

రికార్డు ఉష్ణోగ్రతలు..


బ్రిటన్‌ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మంగళవారం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. లింకన్‌ షైర్‌ లోని కోనింగ్స్‌ బై లో ఏకంగా 40.3 డిగ్రీలు, హీత్రూలో 40.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యింది. లండన్‌ లోని కేంబ్రిడ్జిలో 2019లో నమోదైన 38.7 డిగ్రీల ఉష్ణోగ్రతే ఇప్పటిదాకా రికార్డు. ఇప్పుడు దాన్ని బ్రేక్ చేసి.. టెంపరేచర్ 40 డిగ్రీలు దాటిపోయింది. లండన్‌ తో పాటు ఇంగ్లండ్‌ లోని చాలా ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో వాతావరణ విభాగం ప్రమాద హెచ్చరికలు చేసింది. బ్రిటన్ లో ఎండ తీవ్రత నుంచి బయటపడేందుకు చాలా మంది నదులు, సరస్సులను ఆశ్రయిస్తున్నారు. సాయంత్రమైతే చాలు బీచ్ లకు, నదీతీరాలకు పరుగులు పెడుతున్నారు. 

నెదర్లాండ్స్ లో సోమవారం ఉష్ణోగ్రతలు 39 డిగ్రీల వరకు పెరిగాయి. రాబోయే రోజుల్లో బెల్జియం, జర్మనీలో టెంపరేచర్స్ 40 డిగ్రీల వరకు పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు. గత గురువారం పోర్చుగల్‌లో టెంపరేచర్ 47 డిగ్రీలకు చేరింది. అధిక ఉష్ణోగ్రతలతో పోర్చుగల్, స్పెయిన్‌ లో వడగాలులకు వెయ్యి మందికిపైగా ప్రజలు చనిపోయారు. కార్చిచ్చు వల్ల ముహసా నుంచి సుమారు 300 మందిని తరలించారు. స్పెయిన్‌లో సుమారు 20 ప్రాంతాల్లో కార్చిచ్చును ఆపేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. తీవ్రమైన గాలులతో మంటలు అదుపులోకి రావడం లేదు. అటు స్పెయిన్‌ లోని సివెల హాటెస్ట్‌ లో  పది రోజుల పాటు అక్కడ 41 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు రికార్డ్‌ అయ్యాయి. 41 డిగ్రీల దగ్గర మొదలైన పెరుగుదల 47 డిగ్రీల వరకు వెళ్లింది. ఇప్పటి వరకు స్పెయిన్ లో 1995 జూలై 24న రికార్డ్‌ అయిన 45.2 డిగ్రీల ఉష్ణోగ్రతే అత్యధికం. ఇప్పుడది మరో రెండు డిగ్రీలు పెరిగింది. దీంతో ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. 

ఎండలపై హెచ్చరికలు..


వేసవి కాలం మరో రెండు నెలలు ఉండటంతో.. ఎండల తీవ్రత మరింత పెరగొచ్చని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో బ్రిటన్ లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. లండన్‌ లో కొన్ని రైళ్లు రద్దు చేయగా.. మరికొన్ని ఆలస్యంగా నడిపారు. 40 డిగ్రీల ఎండలుంటే రైలు పట్టాలపై వెళ్లే సమయంలో ఉష్ణోగ్రతలు 50, 60, 70 డిగ్రీల వరకు వెళ్తాయి. అలాంటి సమయాల్లో పట్టాలు అతుక్కుపోయి, రైళ్లు పట్టాలు తప్పే ప్రమాదముంది. అందుకే రైళ్ల రద్దు చేసినట్టు అధికారులు చెప్పారు. ఎండల దెబ్బకు బ్రిటన్ లో విమానాల రాకపోకలు ఆపేయాల్సి వచ్చింది. దీంతో ల్యూటన్ ఎయిర్ పోర్టు నుంచి విమాన రాకపోకలను నిలిపివేశారు. అధిక ఉష్ణోగ్రత వల్ల రన్ వే పై తారు కరిగిపోయి ల్యాండింగ్ సమయంలో ఇబ్బందులొస్తాయని అధికారులంటున్నారు. ప్రభుత్వం కూడా హెచ్చరికలు జారీ చేసింది. బోస్టన్ సిటీలో నాలుగు రోజుల పాటు హీట్ ఎమర్జెన్సీ ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. ప్రభుత్వం కూడా ప్రజలకు కూలింగ్  కిట్లు అందజేస్తోంది. అలాగే.. పెంపుడు జంతువుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు సూచనలు చేసింది. 

కార్చిచ్చుతో జనం వలస..


యూరప్‌లోని చాలా దేశాల్లో కార్చిచ్చుల వల్ల 30 వేల మందికిపైగా ప్రజలు ఇళ్లు విడిచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఫ్రాన్స్, పోర్చుగల్, స్పెయిన్, గ్రీస్ దేశాల అడవుల్లో కార్చిచ్చుతో వేలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఫ్రాన్స్‌ లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన జెరోంద్‌ లో భారీ కార్చిచ్చు చెలరేగింది. వారం రోజులుగా 17వేల హెక్టార్లలో మంటలు చెలరేగాయి. ఇప్పటికీ మంటలు అదుపులోకి రాలేదు. స్పెయిన్‌లోని జమోరాలో మంటల వల్ల ఇద్దరు చనిపోయారు. రైలు పట్టాలకు దగ్గర్లో మంటలు చెలరేగడంతో రైళ్ల రాకపోకలు కూడా నిలిచి పోయాయి. అయితే ఎక్కువ ఉష్ణోగ్రత, వేగంగా వీస్తున్న గాలులు, గాలిలో తేమ తగినంతగా లేకపోవడంతో మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయని అక్కడి అధికారులు చెబుతున్నారు.  వారం రోజులుగా చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు లేదా అంత కన్నా ఎక్కువగా రికార్డ్ అవుతున్నాయి. ఇవి కార్చిచ్చుకు కారణమవుతున్నాయి. వేగంగా వీస్తున్న గాలులు అంతే వేగంగా దిశ మార్చుకుంటుండటంతో.. అటవీ ప్రాంతం మరింత ఎక్కువగా అగ్నికి ఆహుతి అవుతోంది. ఈ  మంటలార్పేందుకు వేలాది మంది సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఫైర్ ఇంజిన్లు, విమానాలు, హెలికాప్టర్లతో మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటలంటుకున్న ప్రాంతంపై విమానాలతో కెమికల్ చల్లుతున్నారు. హెలికాప్టర్లతో నీటిని తీసుకెళ్లి చల్లుతున్నారు. అయినా మంటలు అందుపులోకి రావడం లేదు. దీంతో మరిన్ని విమానాలు, హెలికాప్టర్లను రంగంలోకి దింపనున్నట్టు అధికారులు చెప్పారు.

బూడిదైన అటవీ ప్రాంతం..


ఫ్రాన్స్ లో దాదాపు 27 వేల ఎకరాల్లో మంటలంటుకున్నాయి. దీంతో అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న 32 వేల మందికి పైగా ప్రజలను  సురక్షిత ప్రాంతాలకు తరలించారు. స్పెయిన్ లో లక్షా 40 వేల ఎకరాలకు పైగా అటవీ ప్రాంతం కాలి బూడిదైంది. స్పెయిన్ లో అధికారిక లెక్కల ప్రకారం వడదెబ్బతో 510 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ లెక్క మరింత ఎక్కువగానే ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. పోర్చుగల్ లో కేవలం ఏడు రోజుల్లో 659 మంది వడదెబ్బతో చనిపోయారు. మొత్తంగా దక్షిణ యూరప్ లో 15 వందల మందికి పైగా చనిపోయారని అధికారులంటున్నారు. అయితే.. ఒక్క పోర్చుగల్ లోనే వెయ్యి మంది వరకు చనిపోయినట్టు తెలుస్తోంది. 

 గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్..


 పర్యావరణ మార్పుల వల్లే వేడిగాలుల తీవ్రత గతంలో ఎన్నడు లేనంతగా పెరిగిందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. పారిశ్రామిక విప్లవం మొదలైన నాటి నుంచి ఇప్పటికి భూమి ఉష్ణోగ్రత 1.1 డిగ్రీలు పెరిగిందంటున్నారు.  గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ తోనే యూరప్ లో సగటు ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయని ఎక్స్ పర్ట్స్ వివరిస్తున్నారు. కర్బన్ ఉద్గారాలు తగ్గించాలని లక్ష్యాలు పెట్టుకున్నా.. అవి మరింత పెరిగిపోతున్నాయని.. ఇదే ప్రమాదకరంగా మారుతోందంటున్నారు. 2050 నాటికి కర్బన ఉద్గారాలను సున్నాకు తీసుకురావాలని యూరోపియన్ యూనియన్ నిర్ణయించింది. కానీ అది ఏ మేరకు సాధ్యమవుతుందనేది మాత్రం ప్రశ్నార్థకంగానే మారింది. 

 ప్రపంచానికి  వేకప్ కాల్... 


యూరప్ లో భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలపై ఐక్యరాజ్యసమితి వాతావవరణ విభాగం ఆందోళన వ్యక్తం చేసింది. 2060 వరకు ఉష్ణోగ్రతల్లో పెరుగుదల ఉంటుందని హెచ్చరించింది. యూరప్ పరిస్థితులు ప్రపంచానికి ఓ వేకప్ కాల్ కావాలని చెప్పింది. వాతావరణ పరిరక్షణ దిశగా ప్రజలకు అవగాహన కల్పించాలంది. గ్రీన్ హౌస్ గ్యాసెస్ ని పెంచుతూ వాతావరణాన్ని ప్రపంచం కలుషితం చేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేసింది . కరోనాతో తీవ్రంగా ఎఫెక్ట్ అయిన వాళ్లపై వాతావరణ మార్పుల ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది.