నిర్భయ ఘటనకు 10ఏళ్లు... స్పీకర్‌కు డీసీడబ్ల్యూ చీఫ్ లేఖ

నిర్భయ ఘటనకు 10ఏళ్లు... స్పీకర్‌కు డీసీడబ్ల్యూ చీఫ్ లేఖ

నిర్భయ సామూహిక అత్యాచార ఘటనకు పదేళ్లు పూర్తయిన సందర్భంగా మహిళల భద్రత సమస్యలపై చర్చించాలని డీసీడబ్ల్యూ చీఫ్ స్వాతి మలివాల్ కోరారు. ఈ మేరకు నేటి పార్లమెంటరీ కార్యకలాపాలను నిలిపివేయాలని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ ఖర్‌లకు లేఖ రాశారు. పదేళ్లయినా ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నా.. అయినా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన యాసిడ్ దాడిని కూడా ఆమె ప్రస్తావించారు.

దారుణ ఘటనకు 10ఏళ్లు

సరిగ్గా పదేళ్ల క్రితం ఇదే రోజున దేశ రాజధాని చోటుచేసుకున్న ఓ అమానవీయమైన ఘటన ఇప్పుడు తలచుకున్నా ఒళ్లు గగుర్పొడుస్తుంది. నడిరోడ్డుపై ఓ అమ్మాయిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిర్భయ ఘటనగా పేరొందిన ఈ అత్యాచార ఘటన అప్పట్లో పార్లమెంటును సైతం గడగడలాడించింది. ఈ ఘటనలో నిందితులకు శిక్ష పడినా.. ఇప్పటికీ ఇలాంటి ఘటనలు పునరావృతమవుతూనే ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఇలాంటి ఘటనలు రోజురోజుకూ మరింత పెరిగిపోతున్నాయి. ఎన్ని చట్టాలు చేసినా, కఠిన శిక్షలు విధించినా.. 10ఏళ్లు పూర్తయినా పరిస్థితిలో ఏ మాత్రం మార్పు రావడం లేదు.