​20వ తేదీ నుంచి తెలుగులో స్వరాజ్ సీరియల్

​20వ తేదీ నుంచి తెలుగులో స్వరాజ్ సీరియల్
  • తెలుగులో ‘స్వరాజ్’ సీరియల్
  • రేపటి  నుంచి డీడీ యాదగిరి చానెల్ లో ప్రసారం 

పద్మారావునగర్, వెలుగు: ఆజాదీకా అమృత్ మహోత్సవ్​లో భాగంగా కేంద్ర సమాచార -ప్రసార మంత్రిత్వ శాఖ వివిధ కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా స్వరాజ్య సముపార్జన దిశగా దేశం సాగించిన పయనాన్ని ప్రముఖంగా ప్రదర్శిస్తూ ‘స్వరాజ్:- భారత్ కే స్వతంత్రత సంగ్రామ్ కీ సమగ్ర గాథ’ అనే మెగా సీరియల్‌ను దూరదర్శన్ నిర్మించింది. ఈ సీరియల్​20వ తేదీ నుంచి ‘డీడీ యాదగిరి’ చానెల్ లో తెలుగులో ప్రసారం చేయనున్నట్లు దూరదర్శన్​ హైదరాబాద్ ​కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎన్వీ రమణ, డిప్యూటీ డైరెక్టర్ సురేఖ వెల్లడించారు.

గురువారం కవాడిగూడ సీజీవో టవర్స్​లో ప్రెస్​ఇన్ ఫర్మేషన్ ​బ్యూరో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ప్రతి శనివారం రాత్రి 8 గంటలకు ఈ సీరియల్ ప్రసారమవుతుందన్నారు. అలాగే ఆదివారం రాత్రి 9.30 గంటలకు, బుధ, శుక్రవారాల్లో ఉదయం 11 గంటలకు మళ్లీ ప్రసారం అవుతుందని చెప్పారు. 75 ఎపిసోడ్ల ఈ సీరియల్​ను ప్రజలు తప్పనిసరిగా చూడాలని సూచించారు.

ప్రధాని నరేంద్ర మోడీ సీరియల్​ మొదటి ఎపిసోడ్​ను ఇటీవలే కేంద్ర మంత్రులతో కలసి న్యూఢిల్లీలో చూశారని తెలిపారు. సమావేశంలో పీఐబీ- సీబీసీ డైరెక్టర్  శృతి పాటిల్, దూరదర్శన్ కేంద్రం ప్రోగ్రామింగ్ ఎగ్జిక్యూటివ్  కె.కామేశ్వరి, పీఐబీ మీడియా, కమ్యూనికేషన్​ ఆఫీసర్​ వర్గంటి గాయత్రి తదితరులు పాల్గొన్నారు.