మహేశ్వరం కాంగ్రెస్ టికెట్పై పునరాలోచన చేయాలి : దేప భాస్కర్ రెడ్డి

మహేశ్వరం కాంగ్రెస్ టికెట్పై పునరాలోచన చేయాలి : దేప భాస్కర్ రెడ్డి

మహేశ్వరం కాంగ్రెస్ టికెట్ పై చాలామంది లీడర్లు ఆశలు పెట్టుకున్నారు. కానీ.. ఆశావాహులకు టికెట్ దక్కలేదు. మహేశ్వరం కాంగ్రెస్ టికెట్ ను కిచ్చన్నగారి లక్ష్మారెడ్డికి ఇచ్చారు. దీంతో నియోజకవర్గంలో సీనియర్ లీడర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం (అక్టోబర్29న) చిగిరింత పారిజాత నర్సింహరెడ్డి తమ ముఖ్య నాయకులు, అనుచరులతో కలిసి సమావేశం నిర్వహించారు. మరోవైపు.. టికెట్ ఆశించి భంగపడ్డ దేప భాస్కర్ రెడ్డి కూడా తమ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఆర్కే పురంలోని స్వాగత్ గ్రాండ్  కన్వెన్షన్ హల్ లో సమావేశమయ్యారు.

మహేశ్వరం టికెట్ పై కాంగ్రెస్ అధిష్టానం పునరాలోచన చేయాలని దేప భాస్కర్ రెడ్డి కోరారు. పదేళ్ల నుంచి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని భుజాలపై మోస్తున్న  తమలాంటి వారికి కాకుండా ఉమ్మడి రంగారెడ్డి  జిల్లా సీనియర్ నాయకుడు అనే కారణంతో కిచ్చన్నగారి లక్ష్మారెడ్డికి టికెట్ ఇవ్వడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. తనతోపాటు మహేశ్వరం టికెట్ ఆశించిన డీసీసీ అధ్యక్షులు చల్లా నర్సింహారెడ్డి, ఏనుగు జంగారెడ్డి, ఎల్మెట్టి అమరేందర్ రెడ్డిలలో ఎవరికి కేటాయించినా పార్టీని గెలిపించుకుంటామని చెప్పారు. 

నియోజకవర్గంలో 90 శాతం కార్యకర్తలు తనకే టిక్కెట్ కేటాయించాలని కోరుతున్నారని,  ఇప్పటికి సమయం మించిపోలేదన్నారు. టికెట్ విషయంలో అధిష్టానం పునరాలోచించాలని కోరారు. లేనిపక్షంలో పార్టీ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యకర్తల అభిప్రాయం మేరకు తమ నిర్ణయం ఉంటుందని తెలిపారు.

ALSO READ :- బీసీలను కేటీఆర్ అవమానించారు..తక్షణమే క్షమాపణ చెప్పాలి: బండి సంజయ్