కారులోనే జంట కాపురం.. ఆ తర్వాత అదిరిపోయే ఐడియా

కారులోనే జంట కాపురం.. ఆ తర్వాత అదిరిపోయే ఐడియా

కోవిడ్ యావత్ ప్రపంచాన్ని ఊపేసింది. అనేక కుటుంబాల్ని చిన్నాభిన్నం చేసింది. కొందర్నీ కట్టుబట్టలతో రోడ్డుపై నిల్చోబెట్టింది. మరికొందర్నీ ఎవరూ లేని అనాథల్ని చేసింది. ఇటు ఉద్యోగాలపై కూడా కరోనా ఎఫెక్ట్ బాగానే పడింది. అనేకమంది తమ ఉద్యోగాల్ని కోల్పోయారు. ఇప్పటికే చాలామంది కరోనాతో జాబ్ కోల్పోయి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న ఘటనలు గురించి మనం విన్నాం చూశాం. తాజాగా అలాంటి కథే మరో జంటది.  ఢిల్లీకి చెందిన అమృత,  కరణ్ దంపతులు కోవిడ్ కారణంగా తమ ఉద్యోగం కోల్పోయారు. కరణ్  ప్రభుత్వ ఉద్యోగం పోయింది. దీంతో అతడు తాను ఉంటున్న క్వార్టర్‌ కూడా కాళీ చేయాల్సి వచ్చింది. 

దీంతో ఈ జంట కారులోనే రెండు నెలల పాటు ఉన్నారు. అప్పుడే వీరికి ఓ ఆలోచన వచ్చింది. రాజ్మా చావల్ సహా ఇంట్లో వండిన ఆహారాన్ని విక్రయించే కొత్త బిజినెస్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు.  'అమృతా జీ కే రాజ్మా చావల్' పేరుతో వ్యాపారం ప్రారంభించారు. కారులోనే ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేశారు.  కారు వెనుక భాగంలో వంటకాల్ని పెట్టి అమ్మడం ప్రారంభించారు. ఢిల్లీలోని తల్కటోరా స్టేడియంలో కారును ఉంచి ప్రస్తుతం ఈ జంట బిజినెస్ చేస్తున్నారు.  అమృత కరణ్ ఆదివారం మినహా ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు వినియోగదారులకు వేడి వేడిగా ఇంట్లో వండిన ఆహారాన్ని అందిస్తారు. 

మెనూలో చోలే చావల్, రాజ్మా చావల్, కధీ చావల్ వంటి నోరూరించే వంటలు ఉన్నాయి. దీంతో పాటు బూందీ రైతా, సలాడ్, గ్రీన్ చట్నీ కూడా అందిస్తున్నారు. హాఫ్ ప్లేట్ రూ. 30, ఫుల్ ప్లేట్ ధర కేవలం రూ. 50 మాత్రమే.  దిల్ సే ఫుడీ అని కూడా పిలువబడే ప్రముఖ ఫుడ్ బ్లాగర్ కరణ్ దువా ఢిల్లీలో వీరిని కలిశారు. రాజ్మా చావల్ స్టాల్ నడుపుతున్న వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోకు 315k పైగా వ్యూస్ వచ్చాయి. వేల సంఖ్యలో లైక్‌లు కామెంట్‌లు కూడా పెట్టారు. ఈ జంటకు నెటిజన్ల నుంచి ఫుల్ సపోర్ట్ దొరికింది. 

ఈ వీడియో 2021లో షేర్ చేయబడినప్పటికీ, అది మళ్లీ హెడ్‌లైన్స్‌లో నిలిచింది. ఢిల్లీ దంపతుల  ప్రేరణ కలిపించే ఈ కథ ఆన్‌లైన్‌లో అందరి హృదయాలను కదిలించింది. అయినప్పటికీ, ఢిల్లీలో ఓమిక్రాన్ వేరియంట్ పెరుగుదల సమయంలో వారు అమ్మకాలలో కష్టాలు మరియు నష్టాలను ఎదుర్కొన్నారు. ఒమిక్రాన్ వేరియంట్ పెరిగినప్పుడు రాజ్మా రైస్ అమ్మకాలు పడిపోయాయి.  ప్రస్తుతం వీరి ఆదాయం కొద్దిపాటి లాభాలతో నెలకు రూ. 60,000గా ఉంది. ఇటీవలే ఈ జంట  కొత్త రుచికరమైన - షాహీ పనీర్‌ను పరిచయం చేసింది. త్వరలో థాలీని కూడా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామని కరణ్ బెటర్ ఇండియాతో చెప్పారు. . తమ వ్యాపారాన్ని విస్తరించాలని, మరిన్ని పరికరాలను కొనుగోలు చేయాలని ఓ షాపు కూడా తెరవాలని తాము ఆశిస్తున్నామన్నారు.  ఇక్కడ కస్టమర్లు హాయిగా కూర్చుని తినవచ్చని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

కృష్ణజింకల కేసు: సల్మాన్ ఖాన్‌కు హైకోర్టులో ఊరట

ఈ సారి 95 నుంచి 105 సీట్లు.. రాస్కోండి