రేపిస్టును అరెస్ట్ చేయ‌డానికి లేడీ ఎస్ఐ హ‌నీట్రాప్

రేపిస్టును అరెస్ట్ చేయ‌డానికి లేడీ ఎస్ఐ హ‌నీట్రాప్

న్యూఢిల్లీ: పోలీస్ ఆఫీస‌ర్లు, ఆర్మీ అధికారులు లేదా ప‌బ్లిక్ ఎవ‌రినైనా స‌రే నేర‌గాళ్లు ఫేస్‌బుక్ ద్వారా చాటింగ్ చేసి మోసం చేయ‌డం వార్త‌ల్లో వినే ఉంటాం. హ‌నీట్రాప్ వేసి డ‌బ్బులు, ఆర్మీ సీక్రెట్లు తెలుసుకున్న ఘ‌ట‌న‌లు తెలిసిందే. కానీ ఇక్క‌డ వెరైటీగా పోలీసులు ఓ రేపిస్టును ప‌ట్టుకోవ‌డానికి ఈ టెక్నిక్ వాడారు. నేర‌స్తుడిని ప‌ట్టుకోవ‌డానికి అత‌డి పేరు త‌ప్ప‌ వేరే ఏ వివ‌రాలు తెలియ‌క‌పోవ‌డంతో ఏం చేయాలా అని ఆలోచిస్తున్న‌ప్పుడు ఓ పోలీస్ ఆఫీస‌ర్‌కు త‌ట్టిన ఆలోచ‌నే ఇది. ఫేస్‌బుక్‌లో అత‌డి పేరు సెర్చ్ చేసి వ‌చ్చిన ప్రొఫైల్స్ ఫొటోల‌ను బాధితురాలికి చూపించి నిందితుడిని క‌న్ఫామ్ చేసుకున్నారు. ఆ త‌ర్వాత ఓ లేడీ ఎస్ఐ అత‌డితో చాటింగ్ చేసి క‌లుద్దామంటూ ట్రాప్ వేసి అరెస్ట్ చేశారు. ఈ ఘ‌ట‌న ఢిల్లీలో జ‌రిగింది.

మాయ‌మాటలు చెప్పి రేప్.. అడ్రస్ మార్పు

ఢిల్లీకి చెందిన 16 ఏండ్ల బాలిక త‌న‌పై ఓ వ్య‌క్తి ప‌లుమార్లు రేప్ చేశాడ‌ని జులై 30న‌ పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. త‌న ఇంటి ప‌క్క‌నే కిరాయి ఇంట్లో ఉండే యువ‌కుడు త‌న‌తో ప‌రిచ‌యం పెంచుకుని, పెండ్లి చేసుకుంటాన‌ని చెప్పి ప‌దే ప‌దే క‌లిశాడ‌ని కంప్లైంట్‌లో పేర్కొంది. తాను గ‌ర్భ‌వ‌తిని అయ్యాయ‌ని తెలియ‌డంతో క‌నిపించ‌కుండా పోయాడ‌ని చెప్పింది. అత‌డిని ప‌ట్టుకునేందుకు ఆమె ద‌గ్గ‌ర మ‌రేమైనా వివ‌రాలు ఉన్నాయా అని పోలీసులు అడుగ‌గా, ఆ యువ‌కుడి పేరు ఆకాశ్ అని, అది త‌ప్ప మ‌రేం తెలియ‌ద‌ని ఆ బాలిక తెలిపింది. అత‌డి ఫోన్ నంబ‌ర్ గానీ, ప‌ర్మ‌నెంట్ అడ్ర‌స్ గానీ ఏమీ త‌న ద‌గ్గ‌ర లేవ‌ని చెప్ప‌డంతో ఎలా ప‌ట్టుకోవాలో అర్థం కాలేదు. దీంతో ఎస్ఐ ప్రియాంక త‌న టీమ్‌తో క‌లిసి ఫేస్‌బుక్‌లో ఆకాశ్ అన్న‌ పేరుతో ఉన్న ప్రొఫైల్స్ సెర్చ్ చేయ‌డం మొద‌లుపెట్టారు. ఆ పేరుతో వ‌చ్చిన వంద‌ల ప్రొఫైల్స్‌ను వ‌య‌సు ఆధారంగా లిస్ట్ చేసి, బాధితురాలి ముందు ప్రొఫైల్ ఫొటోల‌న్నీ ఉంచారు. వాటిలో ఆకాశ్ జైన్ అన్న పేరుతో ఉన్న వ్య‌క్తి నిందితుడ‌ని ఆ బాలిక గుర్తు ప‌ట్టి చెప్పింది. దీంతో ఆ లేడీ ఎస్ఐ ప్రియాంక‌ త‌న ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లో పోలీస్ జాబ్‌కు సంబంధించిన వివ‌రాల‌న్నీ తొల‌గించి, నిందితుడికి ఫేస్‌బుక్ రిక్వెస్ట్ పెట్టారు. అత‌డు వెంట‌నే యాడ్ చేసుకోవ‌డంతో ఆమె చాటింగ్ మొద‌లుపెట్టారు. అత‌డిపై ఇష్టం ఉన్న‌ట్టుగా న‌టించి ట్రాప్ చేసి, ఫోన్ నంబ‌ర్ తీసుకున్నారు. సోమ‌వారం క‌లుద్దామ‌ని చెప్ప‌డంతో ఓకే అని ఆకాశ్ రావ‌డంతో అత‌డిని అరెస్ట్ చేశారు. 

నిందితుడికి ఒక అడ్ర‌స్ అంటూ లేద‌ని, ప‌దే ప‌దే రెంట్ ఇండ్లు మారుతూ ఉంటాడ‌ని పోలీసుల ఎంక్వైరీలో తేలింది. గ‌తంలో కూడా ఇటువంటి నేరాలు ఏమైనా చేశాడా అన్న కోణంలో విచార‌ణ చేపడుతున్నామ‌ని ఎస్ఐ ప్రియాంక చెప్పారు. పెండ్లి చేసుకుంటాన‌ని న‌మ్మించి మైన‌ర్‌పై కొన్ని నెల‌ల పాటు అత‌డు లైంగిక దాడి చేశాడ‌ని, ప్ర‌స్తుతం బాధిత బాలిక 45 రోజుల గ‌ర్భిణి అని తెలిపారు.