తొమ్మిదేండ్ల బీఆర్​ఎస్​ పాలనలో..విద్యుత్​ రంగ విధ్వంసం

తొమ్మిదేండ్ల బీఆర్​ఎస్​ పాలనలో..విద్యుత్​ రంగ విధ్వంసం

రైతులకు విద్యుత్ సరఫరా

రైతులకు 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేశామని బీఆర్‌‌ఎస్ పాలకులు ప్రజలను పక్కదోవ పట్టించారు. ఇదెలా జరిగిందో ఆధారాలతో సహా చూద్దాం. 

రాష్ట్రంలో వినియోగదారులకు విద్యుత్ చార్జీలు ఎంత ఉండాలో అన్న అంశం తెలంగాణ రాష్ట్ర  విద్యుత్ నియంత్రణ మండలి (Telangana State Electricity Regulatory Commission-TSERC) నిర్ణయిస్తుంది. అలాగే ఏయే రంగానికి ఎంత విద్యుత్ అవసరమో కూడా కమిషన్ అంచనా వేస్తుంది. రాష్ట్రంలో రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా అమలులో ఉంది. వ్యవసాయ వినియోగదారుల విద్యుత్ సరఫరాకు అయ్యే ఖర్చును కొంత ప్రభుత్వం, కొంత ఇతర వినియోగదారుల నుంచి వసూలు చేస్తారు. ప్రభుత్వం భరించే మొత్తాన్ని “సబ్సిడీ” అని, ఇతర వినియోగదారుల నుంచి వసూలు చేసే అధిక మొత్తాన్ని “క్రాస్ సబ్సిడీ” అని పిలుస్తారు. అయితే వ్యవసాయ విద్యుత్ వినియోగ కమిషన్ మొదట అనుమతించిన వినియోగం కన్నా ఏమాత్రం పెరిగినా, ఆ పెరిగిన ఖర్చును  ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. ఈ భారాన్ని ఇతర వినియోగదారులపై వేసే అవకాశం ఉండదు. 

రాష్ట్రం ఏర్పడ్డ ఈ తొమ్మిదేండ్లలో వ్యవసాయ రంగ సరఫరాకు 11,925 కోట్ల యూనిట్లు అవసరమని కమిషన్ అంచనా వేసింది. కానీ విద్యుత్ సంస్థలు 15,306 కోట్ల యూనిట్లను సరఫరా చేశాయి. ఈ మొత్తం విద్యుత్తు కొనుగోలుకు విద్యుత్ సంస్థలకు అయిన ఖర్చు సుమారు రూ. 90,000 కోట్లు.  వ్యవసాయ వినియోగానికి అంచనా కన్నా అధికంగా జరిగిన విద్యుత్ సరఫరా 3380 కోట్ల యూనిట్లు (15,306 - –11,925). సరఫరా, పంపిణీ నష్టాలను పరిగణనలోనికి తీసుకుంటే సుమారు 3980 కోట్ల యూనిట్లను విద్యుత్ సంస్థలు అదనంగా కొనుగోలు చేశాయి. ఈ విద్యుత్తు కొనుగోలుకు బహిరంగ మార్కెట్​లో సగటున యూనిట్​కు సుమారు రూ.7 వెచ్చించారు. అంటే ఈ విద్యుత్తు మొత్తం కొనుగోలు ఖర్చు రూ.27,860 కోట్లు. 

ఈ అదనపు ఖర్చులో ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం భరించలేదు. అంతే కాదు... కమిషన్ మొదట అంచనా వేసిన వ్యవసాయ విద్యుత్తు కొనుగోలు ఖర్చు కూడా పెరిగిపోయింది. ఇది సుమారు రూ 2000 కోట్లు. ఈ ఖర్చులు కూడా ప్రభుత్వం భరించలేదు. ఈ లెక్కన వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం చెల్లించని మొత్తం రూ. 29, 860 కోట్లు. మొత్తం రూ 90,000 కోట్ల ఖర్చులో ఇది మూడవ వంతు (33%).  

రైతులకు విద్యుత్ సరఫరాలో భరించిన ఖర్చు ఎనిమిదిన్నర గంటలకే..

వ్యవసాయరంగానికి సరఫరాకుగానూ విద్యుత్ సంస్థలకు అయిన మొత్తం ఖర్చు రూ 90,000 కోట్లు. ఇందులో ప్రభుత్వం సబ్సిడీల ద్వారా నేరుగా చెల్లించినది రూ 37,000 కోట్లు మాత్రమే. ప్రభుత్వం చెల్లించకుండా ఎగ్గొట్టిన మొత్తం రూ.30,000 కోట్లు. మిగిలిన రూ 23,000 కోట్లు క్రాస్ సబ్సిడీల ద్వారా ఇతర వినియోగ దారుల నుంచి వసూలు చేశారు. అంటే మొత్తం ఖర్చులో ప్రభుత్వం భరించింది 40% మాత్రమే. సరఫరా చేసిన విద్యుత్ సగటు సమయం 

13 గంటలు అనుకుంటే ఇందులో 40%, అంటే ప్రభుత్వం   కేవలం 5 గంటలకే విద్యుత్ సరఫరా ఖర్చు భరించింది. క్రాస్ సబ్సిడీలను కలుపుకున్నా ప్రభుత్వం కేవలం 8 ½ గంటల సరఫరానే చేసినట్టు లెక్క తేలుతుంది. కేవలం 8 ½ గంటల సరఫరాకు ఖర్చులు భరించిన బీ‌‌ఆర్‌‌ఎస్ ప్రభుత్వం 24 గంటల విద్యుత్ సరఫరా చేశామని అబద్ధాలు చెబుతూ రైతులను మోసం చేసింది. మరోవైపు విద్యుత్ సంస్థలను అప్పుల ఊబిలో నిండా ముంచింది.

విధిలేక ఆస్తులు తాకట్టు పెట్టిన డిస్కంలు

ప్రభుత్వం డబ్బులు చెల్లించకుంటే మరి విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు)  ఏం చేశాయి? తప్పనిసరి పరిస్థితుల్లో బ్యాంకులు, ఇతర సంస్థల నుంచి అధిక వడ్డీలకు వేలకోట్ల రూపాయల అప్పులు చేసి విద్యుత్తును కొనుగోలు చేశాయి. దీనికోసం ఆరు దశాబ్దాలుగా పోగుచేసుకున్న తమ మొత్తం ఆస్తులను గజం భూమి వదలకుండా బ్యాంకులకు తాకట్టు పెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇదేకాకుండా వ్యవసాయ విద్యుత్  కొనుగోలు ఖర్చులు భరించలేక, జెన్​కో, ట్రాన్స్​కో, సింగరేణి లాంటి సంస్థలకు చేయాల్సిన చెల్లింపులు చేయకుండా డిస్కంలు వేలకోట్ల రూపాయలు బకాయిలు పడ్డాయి. కేవలం సింగరేణి సంస్థకు విద్యుత్ సంస్థలు చెల్లించాల్సిన బకాయిలు

మార్చి 2023 నాటికి రూ.20, 000 కోట్లు దాటాయి అంటే పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. బీ‌‌ఆర్‌‌ఎస్ పాలకుల బాధ్యతా రాహిత్యం కారణంగా విద్యుత్ సంస్థలు అప్పుల ఊబుల్లోకి కూరుకు పోయాయి. ఇప్పుడు ఆ అప్పులు తీర్చడానికి మరిన్ని అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉచిత విద్యుత్తును ఇస్తున్నామని ఘనంగా ప్రచారం చేసుకున్న బీ‌‌ఆర్‌‌ఎస్ ప్రభుత్వం విద్యుత్ సంస్థలను నిండా ముంచింది. ఇంతచేసీ ఎప్పుడూ 24 గంటల సరఫరా చేయలేదు. ప్రతిపక్ష పార్టీలు సబ్ స్టేషన్లలో లాగ్ బుక్కులను చూపించమని డిమాండ్ చేస్తే, మొత్తం లాగ్ బుక్కులను ఎవరికీ అందుబాటులో లేకుండా చేశారు.

వ్యవసాయానికి ఎన్ని గంటల సరఫరా జరిగినట్టు?

2018లో 24 గంటల సరఫరా అంటూ బీఆర్‌‌ఎస్ ప్రభుత్వం ప్రచారం మొదలు పెట్టింది. వాస్తవానికి ఈ ఐదేండ్లలో ఎప్పుడూ వ్యవసాయ రంగానికి కావాల్సిన త్రీ-ఫేస్​ సరఫరా 12 నుంచి 14 గంటలు మించలేదు. మిగిలిన సమయంలో కేవలం సింగిల్-ఫేస్ సరఫరా జరిగేది. సింగిల్-ఫేస్ సరఫరా వ్యవసాయ పంపుసెట్లకు పనికిరాదు. కాబట్టి వ్యవసాయ విద్యుత్ సరఫరా సగటున 13 గంటలని అనుకోవచ్చు. కానీ, ప్రభుత్వం భరించిన ఖర్చు ఆధారం గానే, ప్రభుత్వం వ్యవసాయానికి ఎన్ని గంటలు సరఫరా చేసిందో మనం అంచనా వేయాలి.

కె. రఘు, విద్యుత్వ రంగ నిపుణుడు