
ఇండియన్ ఆర్మీకి మరో కొత్త అస్త్రం అందింది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ధనుష్ వార్ గన్ సైన్యంలో చేరింది. మధ్యప్రదేశ్ జబల్‌పూర్‌లోని గన్ క్యారియర్ ఫ్యాక్టరీలో సోమవారం దీన్ని ఆవిష్కరించారు. 114 తుపాకీల తయారీకి ఆర్డర్ చేస్తే ఆరింటిని ప్రస్తుతం సైన్యానికి అప్పగించారు. బోఫోర్స్ హొవిట్జర్ నమూనా తరహాలో రూపొందించిన ఈ ‘దేశీ బోఫోర్స్’ గన్‌లను పాకిస్థాన్, చైనా సరిహద్దుల్లో వాడనున్నారు. వీటి పరిధి 11 కిలోమీటర్లు. ఒక్కోగన్ తయారీకిరూ.14.5 కోట్లు ఖర్చయింది. ధనుష్ తో పాటు కే9వజ్ర, ఎం777 లైట్ వెయిట్ హొవిట్జర్‌లనూ ఇటీవలే సైన్యానికి అందించారు. ఈ ఆయుధాల కోసం దశాబ్దాలుగా ఆర్మీ వేచి చూస్తోంది. అప్పట్లో బోఫోర్స్ కుంభకోణం దేశాన్ని కుదిపేయడంతో స్వీడన్ కంపెనీబోఫోర్స్ ‘ట్రాన్స్‌ఫర్ ఆఫ్ టెక్నాలజీ’ని పూర్తి చేయలేక పోయింది. ఆ తర్వాత మేకిన్ ఇండియాలో భాగంగా గన్‌లను తయారు చేశారు. ఈ ఏడాది చివరికి 18గన్‌లతో ఓ రెజిమెంట్ ను ఏర్పాటు చేసేందుకు ఆర్మీప్లాన్ చేస్తోంది.
155 ఎంఎం గన్
ఇనర్షియల్ నావిగేషన్ బేస్డ్ సైటింగ్ సిస్టమ్ ఉన్నధనుష్ ను పగలు, రాత్రి వేళల్లోనూ ఉపయోగించవచ్చు. సెల్ఫ్ ప్రొపల్షన్ వ్యవస్థ ఉండటంతో సులభంగా గుట్టలు, కొండలు ఎక్కేయగలదు. బై మాడ్యులార్‌చార్జ్ సిస్టమ్‌తో గన్ పరిధి పెంచారు. నాటో 155ఎంఎం మందు గుండ్లను పేల్చేలా ఆధునీకరించారు.గతేడాది జూన్‌లో పోక్రన్‌లో చివరిసారి ధనుష్ ను పరీక్షించారు. అంతకు ముందు సిక్కిం, లేహ్, లద్ధాఖ్ లోనిచలి వాతావరణంలో, ఒడిశాలోని బాలాసోర్ తేమ వాతావరణంలోనూ గన్‌ను పరిశీలించారు.
80 శాతం దేశీనే..
గన్ క్యారియర్ ఫ్యాక్టరీ (జీసీఎఫ్ ) 2011అక్టోబర్‌లో ధనుష్ ప్రాజెక్టును మొదలుపెట్టింది. 2014లో నమూనాను సిద్ధం చేసింది. ఆ తర్వాత మరో 11 నమూనాలు తయారు చేసింది. వాటితో 4,200 రౌండ్లు కాల్పులు జరిపింది. గన్‌లోని పరికరాలు, వస్తువుల్లో81 శాతం దేశీయంగానే రూపొందించామని జీసీఎఫ్ చెప్పింది. 2019 నాటికి ఇది 90శాతానికి చేరిందని పేర్కొంది.