కొత్త పార్లమెంట్.. పాత పార్లమెంట్ తేడా ఇదే..

కొత్త పార్లమెంట్.. పాత పార్లమెంట్ తేడా ఇదే..


దేశరాజధాని ఢిల్లీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. తొలుత పార్లమెంట్ భవనంలో లోక్ సభ స్పీకర్ కుర్చీ వద్ద సెంగోల్ (రాజదండం)ను ప్రతిష్టించారు. మఠాధిపతుల ఆశీర్వచనంతో సెంగోల్ ప్రతిష్టాపన చేశారు. అనంతరం నూతన పార్లమెంట్ భవన కార్మికులను ప్రధాని శాలువాలతో సన్మానించి, జ్ఞాపికలు అందజేశారు.  అసలు పాత, కొత్త పార్లమెంట్ భవనాల  తేడా ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. . .

పార్లమెంట్‌లోని లోక్‌సభ భవనాన్ని జాతీయ పక్షి నెమలి థీమ్‌పై, రాజ్యసభను జాతీయ పుష్పం కమలం థీమ్‌పై రూపొందించారు.పాత లోక్‌సభలో గరిష్టంగా 552 మంది కూర్చోవచ్చు. కొత్త లోక్‌సభ భవనం 888 సీట్ల సామర్థ్యం కలిగి ఉంది. పాత రాజ్యసభ భవనంలో 250 మంది సభ్యులు కూర్చునే సామర్థ్యం ఉండగా, కొత్త రాజ్యసభ హాలు సామర్థ్యాన్ని 384కి పెంచారు.

కొత్త పార్లమెంట్ హౌస్‌లో ఉభయ సభల సమావేశం సందర్భంగా 1,272 మంది సభ్యులు అక్కడ కూర్చునే అవకాశం ఉంటుంది.  కొత్త భవనంలో ఎంపీలందరికీ వేర్వేరుగా కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నామని, ‘ పేపర్‌లెస్ ఆఫీస్’ లే లక్ష్యంగా ఆధునిక డిజిటల్ సౌకర్యాలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు.

కొత్త పార్లమెంట్‌లో భారత ప్రజాస్వామ్య వారసత్వాన్ని వర్ణించే కాన్‌స్టిట్యూషనల్‌ హాల్ ఉంటుంది. భారత రాజ్యాంగం అసలు ప్రతిని కూడా అక్కడ ఉంచుతారు. అలాగే ఎంపీలు కూర్చునేందుకు పెద్ద హాలు, లైబ్రరీ, కమిటీల కోసం అనేక గదులు, డైనింగ్ రూమ్‌లు, పార్కింగ్ స్థలాలు ఎక్కువగా ఉంటాయి. ఈ మొత్తం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతం 64,500 చదరపు మీటర్లలో విస్తరించి ఉంది. కొత్త పార్లమెంట్ వైశాల్యం ప్రస్తుత పార్లమెంట్ భవనం కంటే 17,000 చదరపు మీటర్లు ఎక్కువ.

కొత్త పార్లమెంట్   ఇలా... 

సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ కింద కొత్త పార్లమెంటు భవనం నిర్మించారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టు ఖర్చు దాదాపు రూ. 20 వేల కోట్లు.  వాస్తవానికి దిల్లీలోని రాజ్‌పథ్‌కు సమీపంలో ఉన్న ప్రాంతాన్ని సెంట్రల్ విస్టా అని పిలుస్తారు. ఇందులో రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ సమీపంలో ఉన్న ప్రిన్సెస్ పార్క్ ప్రాంతం కూడా ఉంది.

రాష్ట్రపతి భవన్, పార్లమెంట్, నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్, ఉపరాష్ట్రపతి ఇల్లు కూడా సెంట్రల్ విస్టా పరిధిలోకి వస్తాయి. ప్రస్తుత పార్లమెంట్ భవనం దాదాపు 100 ఏళ్ల నాటిది. ఆ పార్లమెంట్ హౌస్‌లో ఎంపీలు కూర్చోవడానికి స్థలం సరిపోవట్లేదని కేంద్ర ప్రభుత్వం అంటోంది.

సీట్ల కొరత

ప్రస్తుతం లోక్‌సభ స్థానాల సంఖ్య 545. 1971 జనాభా లెక్కల ఆధారంగా చేసిన డీలిమిటేషన్‌తో ఈ సీట్ల సంఖ్యలో ఇప్పటివరకు ఎలాంటి మార్పు జరగలేదు.  కొత్త పార్లమెంట్ ప్రారంభ సమయంలో  త్వరలో ఎంపీల సీట్లు పెరుగుతాయని దేశ ప్రధాని మోడీ సంచలన ప్రకటన చేశారు. పాత పార్లమెంట్‌లో తగినన్ని సీట్లు లేవు.. పాత పార్లమెంట్‌లో సాంకేతిక సమస్యలున్నాయని చెప్పారు ప్రధాని మోడీ. ఈ తరుణంలోనే.. త్వరలో ఎంపీల సీట్లు పెరుగుతాయని దేశ ప్రధాని మోడీ సంచలన ప్రకటన చేశారు. అటువంటి పరిస్థితిలో కొత్తగా ఎన్నికైన ఎంపీలు కూర్చోవడానికి స్థలం సరిపోదు.

మౌలిక సదుపాయాలు

స్వాతంత్య్రానికి ముందు పార్లమెంటు భవనాన్ని నిర్మిస్తున్నప్పుడు మురుగు కాలువలు, ఎయిర్ కండిషనింగ్, ఫైర్ ఫైటింగ్, సీసీటీవీ, ఆడియో వీడియో సిస్టమ్స్ వంటి వాటిని పెద్దగా పట్టించుకోలేదని ప్రభుత్వం చెబుతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా వీటిని పార్లమెంట్‌ హౌజ్‌కు చేర్చారు. అనంతరం భవనంలో తేమ వంటి సమస్యలు తలెత్తి అగ్నిప్రమాదాలు పెరిగాయి. దాదాపు 100 ఏళ్ల క్రితం పార్లమెంట్‌ భవనాన్ని నిర్మించినప్పుడు దిల్లీ భూకంప జోన్‌-2లో ఉండగా, ఇప్పుడు అది నాలుగుకు చేరుకుంది. ఎంపీలు కాకుండా, వందలాది మంది ఉద్యోగులు పార్లమెంటులో పనిచేస్తున్నారు. పార్లమెంట్‌లో జనం రద్దీ కూడా పెరిగింది.

పాత పార్లమెంట్‌ను ఏం చేయనున్నారు?

పాత పార్లమెంట్ హౌస్‌ను బ్రిటీష్ వాస్తుశిల్పులు సర్ ఎడ్విన్ లుటియన్స్, హెర్బర్ట్ బేకర్ 'కౌన్సిల్ హౌస్'గా రూపొందించారు. దీన్ని నిర్మించడానికి ఆరు సంవత్సరాలు (1921-1927) పట్టింది. అప్పట్లో బ్రిటీష్ ప్రభుత్వ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఈ భవనంలో పనిచేసేది.  అప్పట్లో దీని నిర్మాణానికి రూ. 83 లక్షలు ఖర్చు చేశారు. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 'కౌన్సిల్ హౌస్'ను పార్లమెంట్ హౌస్‌గా మార్చారు. ఇపుడు కొత్త పార్లమెంట్ భవనం అందుబాటులోకి రానుండటంతో పాత పార్లమెంట్ భవనాన్ని పార్లమెంటరీ కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు.