
మన దేశంలో సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ యాక్ట్ (సీఏఏ) అమలు గత వారమే షురూ అయింది. అస్సాంలో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్నార్సీ) సెకండ్, ఫైనల్ లిస్ట్ వచ్చి కూడా ఏడాదిన్నర అవుతోంది. ఈ రెండూ ఇండియా వ్యవహారాలే అయినా పొరుగు దేశాల (పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్థాన్) ప్రస్తావన రాక మానదు. ఆ దేశాల నుంచి వలస వచ్చిన ఆరు మతాల వారికి (హిందు, సిక్కు, బౌద్ధ, జైన్, పార్శీ, క్రిస్టియన్లకు) సిటిజన్‌షిప్ ఇవ్వటానికే సీఏఏని తెర పైకి తేగా, అస్సాంలోని ఇల్లీగల్ మైగ్రెంట్స్‌ని గుర్తించటానికి ఎన్నార్సీ అనే భూతద్దంతో వెతికారు. సీఏఏ గురించి చర్చించిన ప్రతిసారీ పైన చెప్పిన మూడు దేశాలే ఇండియాలోని అక్రమ వలసలకు అసలు కారణం అంటూ వేలెత్తి చూపాల్సి వచ్చింది. అంతేకాదు. తమ తమ దేశాల్లోని నాన్–ముస్లిం మైనారిటీలను నానా యాతనలు పెట్టాయని, అందుకే వాళ్లు అక్కడ ఉండలేక ఇండియాకి వచ్చేశారనే విమర్శను ఆ మూడు దేశాలు ఫేస్ చేస్తున్నాయి. ఈ మాటలు ఆ దేశాలను పరోక్షంగా బాధపెట్టి ఉంటాయి. వాళ్ల స్పందన కూడా ఆ విధంగానే ఉంది. అలా లేకపోతేనే ఆశ్చర్యపోవాలి. కాకపోతే ఆ నెగెటివ్ రియాక్షన్ డోసులో కాస్త తేడాలున్నాయంతే.
ఫెయిలైన ‘ట్రిబ్యునల్’
అస్సాంలో ఎన్నార్సీ డ్రాఫ్ట్‌ని తొలిసారి (2018 జనవరిలో) బయటపెట్టినప్పుడు చాలా మంది జంకారు. ఆరు నెలల తర్వాత సెకండ్, ఫైనల్ లిస్ట్ పబ్లిష్ చేయటంతో ఆ ఆందోళన మరింత పెరిగింది. తమను ఫారినర్లుగా తేల్చేస్తారేమోనని లిస్టులో పేర్లులేని దాదాపు రెండు కోట్ల మంది భయపడ్డారు. అప్పీల్‌కి అవకాశమున్నా తాము ఇల్లీగల్ మైగ్రెంట్స్ అనే నిజం తెలిసిపోతుందంటూ భుజాలు తడుముకున్నారు. వీరిలో ఎక్కువ మంది బెంగాలీ మాట్లాడే హిందువులు, ముస్లింలే. అస్సాంలో దశాబ్దాల కిందటే వీళ్లు సెటిలయ్యారు.
వీళ్లంతా ఈస్ట్ పాకిస్థాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్) నుంచి వచ్చినోళ్లే. వాళ్లపై 1980ల్లో పెద్దఎత్తున దాడులు జరిగాయి. దాదాపుగా 3,000 మందికి పైగా చనిపోయారు. ఆ గొడవలకు ఫుల్స్టాప్ పెట్టడానికి ప్రధాని రాజీవ్ గాంధీ అస్సాం ఒప్పందం కుదిర్చారు. రాష్ట్రంలోకి అడ్డదారిలో వచ్చినోళ్లను ఏరిపారేయటానికి ‘ఇల్లీగల్ మైగ్రెంట్స్ డిటర్మినేషన్ ట్రిబ్యునల్’ను ఏర్పాటు చేశారు. అది కేవలం 10 వేల మందినే గుర్తించి, చివరికి 1,600 మందిని మాత్రమే బంగ్లాదేశ్‌కి పంపగలిగింది. ట్రిబ్యునల్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు కావటంతో దాన్ని రద్దు చేసి, ఎన్నార్సీని పూర్తి చేయటానికి గడువు పెట్టారు.
యాంటీ–ఇండియన్ లాబీయింగ్ పెరిగితే!
సీఏఏ, ఎన్నార్సీ అంశాలు ఇండియాకు సంబంధించినవేననే మాటను ఒప్పుకుంటున్న బంగ్లాదేశ్… తమ దేశంలో నాన్–ముస్లిం మైనారిటీలు ఇబ్బంది పడ్డారనే వాదనను మాత్రం అంగీకరించట్లేదు. ఆ దేశంలో 89 శాతం మంది ముస్లింలే. ఒక్క శాతం మందే క్రిస్టియన్లు, ఇతర కమ్యూనిటీల వారు ఉన్నారు. అయినా తమది సెక్యులర్ దేశమేనని బంగ్లా చెప్పుకుంటుంది. ఆచరణలోనూ చూపుతోంది. చాలా దేశాల కన్నా తమ వద్దే మత సామరస్యం బెటరంటూ కాస్త గర్వంగానే ఫీలవుతోంది. ఇవన్నీ పట్టించుకోకుండా తనను పాకిస్థాన్ సరసన చేర్చటాన్ని జీర్ణించుకోలేకపోతోంది బంగ్లాదేశ్. ఇండియా తమకు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ లిస్టు ఇస్తే… చెక్ చేసుకొని తామే వాళ్లను వెనక్కి తెచ్చుకుంటామని చెబుతోంది. బంగ్లాలోకి మతం పేరుతో ముస్లింలను తిప్పి పంపితే రాంగ్ సిగ్నల్స్ వెళ్లే ప్రమాదం ఉందని ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఈ రివర్స్ మైగ్రేషన్… బంగ్లాదేశ్‌లోని ఇస్లామిస్టులను, యాంటీ–ఇండియన్ లాబీలను ఎంకరేజ్ చేస్తే ప్రమాదం. వాళ్లు కేవలం పది శాతమే ఉన్న హిందువులను టార్గెట్ చేయొచ్చని హెచ్చరిస్తున్నారు. పైపెచ్చు.. ఇండియాపై ‘ముస్లిం వ్యతిరేక దేశం’ అనే ముద్ర వేస్తారని చెబుతున్నారు ఎనలిస్టులు.
సున్నితంగా డీల్ చేయాలి
సీఏఏ వల్ల బంగ్లాదేశ్ దిశగా సాగుతున్న రివర్స్ మైగ్రేషన్‌ని, అరెస్టులను సున్నితంగా డీల్ చేయకపోతే బంగ్లాతో సంబంధాలు తెగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ‘పొరుగు దేశాలకే మొదటి ప్రాధాన్యం. అదే ముఖ్య విధానం’ అన్నది ఇండియన్ ఫారిన్ పాలసీ. దీనిని మాటల్లో చెప్పడమే కాక, చేతల్లోనూ చూపిస్తుంటాం. అలాంటప్పుడు బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లను ఒకేలా చూడటం సరికాదంటున్నారు.
మైగ్రేషన్ పాపం ఎర్షాద్దే!
బంగ్లాదేశ్‌లో నాన్–ముస్లిం మైనారిటీలపై గతంలో ఎటాక్‌లు జరగలేదా అంటే ‘ఎందుకు లేదు’ అనేదే సమాధానంగా వస్తుంది. 2001–06లో బీఎన్పీ–జమాత్ సర్కార్ ఉన్నప్పుడు హిందువులపై పెద్ద ఎత్తున అణచివేతలు చోటు చేసుకున్నాయి. హరాస్మెంట్లకు లెక్కే ఉండేది కాదు. గుళ్లు కూడా కూల్చేశారు. దీంతో హిందువులు చేసేదేమీ లేక, చెప్పుకునే దిక్కు తోచక ఇండియాకి తిరుగుముఖం పట్టారు. మొదట్లో సెక్యులర్‌గానే ఉన్న రాజ్యాంగాన్ని డిక్టేటర్ జనరల్ హుస్సేన్ ముహమ్మద్ ఎర్షాద్ బలవంతంగా సవరించారు. ఇస్లామ్‌ను జాతీయ మతంగా మార్చేశారు. కానీ, బంగ్లాదేశ్‌లో 20 ఏళ్ల కిందట పవర్లోకి వచ్చిన ప్రధాని షేక్ హసీనా హిందువులపై దాడులకు చెక్ పెట్టారు. తమ దేశం నుంచి ఇండియాలోకి జరిగే ఇల్లీగల్ మైగ్రేషన్‌కి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేశారు. అయినా బంగ్లాదేశ్ నుంచి వలసలు ఆగేవి కావు. కాకపోతే ఆమె వచ్చాక కాస్త తగ్గాయని చెప్పొచ్చు. అస్సాంలో ఎన్నార్సీ అమల్లోకి వచ్చాక లిస్టులో లేనోళ్ల కోసం డిటెన్షన్ సెంటర్లను పెద్ద సంఖ్యలో కట్టారు.