
- ఎస్సారెస్పీ నుంచి ఎల్లంపల్లి దాకా ఇదే పరిస్థితి
- ఎగువన వర్షాల్లేక ఈ ఏడాది భిన్న పరిస్థితులు
- రెండు నెలల్లోనే నిండిన కృష్ణా ప్రాజెక్టులు
హైదరాబాద్, వెలుగు:ఓ వైపు కృష్ణా నది పరుగులు పెడుతుంటే.. గోదావరి మాత్రం వరద లేక వెలవెలబోతున్నది. ఎస్సారెస్పీ నుంచి ఎల్లంపల్లి వరకు ఈసారి ఏ ఒక్క ప్రాజెక్టులోకి ఆశించిన మేర నీరు చేరలేదు. కొన్నేండ్లుగా తొలుత గోదావరిలో వరదలు మొదలై ప్రాజెక్టులు నిండాకే కృష్ణాకు వస్తున్నాయి. కానీ, ఈ ఏడాది మాత్రం ఎగువన వర్షాల్లేక గోదావరి బేసిన్లో వరదలు రావడం లేదని అధికారులు చెబుతున్నారు.
ప్రాజెక్టులు నిండకపోవడంతో అధికారుల గోదావరి బేసిన్‌లోని ఆయకట్టుకు వారబందీ పద్ధతిలో నీళ్లు ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం గోదావరి బేసిన్‌లోని ఒక్క సింగూరు ప్రాజెక్ట్ తప్ప.. ఏ ప్రాజెక్టులోనూ నీటిమట్టాలు ఆశాజనకంగా లేవు. సింగూరు ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 29.91 టీఎంసీలకుగాను ప్రస్తుతం 18.95 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ప్రధాన ప్రాజెక్ట్ అయిన శ్రీరాంసాగర్‌లో మాత్రం నీటి కొరత ఉంది. ఆ ప్రాజెక్టులో 80.5 టీఎంసీలకుగాను 21.03 టీఎంసీల నీళ్లే ఉండడం గమనార్హం.
ప్రాజెక్టుకు 608 క్యూసెక్కుల వరద మాత్రమే వస్తోంది. శ్రీరాంసాగర్ కింద దాదాపు 9.50 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా.. ప్రస్తుత పరిస్థితుల్లో శ్రీరాంసాగర్ నుంచి నీళ్లిచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అటు ఎల్లంపల్లి ప్రాజెక్టులోనూ 20.18 టీఎంసీలకుగాను 8.81 టీఎంసీల నిల్వ ఉంది. ఈ ప్రాజెక్టుకూ అంతంతమాత్రంగానే వరద వస్తోంది.1,868 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
రికార్డవుతోంది.
పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధవారం అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడుతాయని పేర్కొంది.
ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. వరంగల్, వికారాబాద్, సిద్దిపేట, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, నిజామాబాద్, నిర్మల్, మహబూబ్‌నగర్, మహబూబాబాద్, ఖమ్మం, కరీంనగర్, జనగామ, జగిత్యాల, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.
ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. హైదరాబాద్‌లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మంగళవారం కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్, ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, వరంగల్, ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా ములుగు జిల్లా వెంకటాపురంలో 11.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మంచిర్యాల జిల్లా భీమినిలో 9.5 సెంటీమీటర్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో 9.4, ములుగు జిల్లా అలుబాకలో 8.5, మంచిర్యాల జిల్లా కుందారంలో 8.5, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా గిన్నెధరిలో 7.9, వరంగల్ జిల్లా చెన్నారావుపేటలో 6.5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. కాగా, హైదరాబాద్ సిటీలోనూ మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. షేక్‌పేటలో అత్యధికంగా 4.5 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. గోల్కొండలో 2.4, గచ్చిబౌలిలో 1.7, ఆసిఫ్‌నగర్‌లో 1.5 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది.
కృష్ణాలో వరద జోరు..
గోదావరి వరదల్లేక వెలవెలబోతున్నా.. కృష్ణా నదిలో మాత్రం రెండు నెలలుగా వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది జూన్‌లోనే కృష్ణాకు వరదలు మొదలయ్యాయి. జూరాలలో 9.66 టీఎంసీలకుగాను 7.68 టీఎంసీల నీళ్లున్నాయి. ప్రస్తుతం 67 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతుండగా, దిగువకు 67,908 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం ప్రాజెక్టుకు 1,10,183 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతుండగా, 1,17,529 క్యూసెక్కులు కిందికి వదులుతున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 215.81 టీఎంసీలకుగాను 209.16 టీఎంసీల జలాలున్నాయి. సాగర్‌కు 67,346 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 312.05 టీఎంసీలకుగాను, 256.32 టీఎంసీల నిల్వ ఉంది.