కార్వీపై ఈడీ దాడులు.. రూ.700 కోట్ల విలువైన షేర్ల జప్తు

కార్వీపై ఈడీ దాడులు.. రూ.700 కోట్ల విలువైన షేర్ల జప్తు

న్యూఢిల్లీ: కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్‌ (కేఎస్‌బీఎల్‌) సీఎండీ పార్థసారథితోపాటు మరికొందరి ఇండ్లలో, ఆఫీసుల్లో సోదాలు నిర్వహించి, రూ.700 కోట్ల విలువైన షేర్లను ఫ్రీజ్‌ చేశామని ఈడీ ప్రకటించింది. ఇన్వెస్టర్ల స్టాకులను కుదవబెట్టి అక్రమంగా లోన్లు పొందిన కేసులో పార్థసారథిని తెలంగాణ పోలీసులు గత నెల అరెస్టు చేయడంతో ఆయన చంచల్‌గూడ జైలులో ఉన్నారు. ఈ నెల 22న హైదరాబాద్‌లోని ఆరు లొకేషన్లు సహా కార్వీ గ్రూపు కంపెనీలపై, సంబంధిత ఎంటిటీలపై, ఇండ్లపై దాడులు చేశామని ఈడీ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. ఈ సందర్భంగా ప్రాపర్టీ డాక్యుమెంట్లను, పర్సనల్‌ డైరీలను, ఎలక్ట్రానిక్ డివైజ్‌లను, ఈ–మెయిల్‌ డంపుల వంటి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ‘‘పార్థసారధి తన గ్రూప్‌ కంపెనీలోని షేర్లను ప్రైవేటు డీల్స్‌ ద్వారా అమ్మేయాలని ప్రయత్నించారు. అందుకే వీటిని ఫ్రీజ్‌ చేశాం. కార్వీ గ్రూపు షేర్లు పార్థసారధి, ఆయన కొడుకులు రజత్‌, అధిరాజ్‌, గ్రూపు ఎంటిటీల పేరిట ఉన్నాయి’’ అని ఈడీ వివరించింది.

పార్థసారధి తన క్లయింట్లకు చెందిన సెక్యూరిటీలను కుదవబెట్టి రూ.329 కోట్ల లోన్లను తీసుకున్నట్టు పోలీసులు కేసు పెట్టారు. ఈ డబ్బును దారి మళ్లించినట్టు పేర్కొన్నారు. ఇండస్‌ఇండ్‌ బ్యాంకు రూ.137 కోట్లకు మోసం చేసినట్టు హైదరాబాద్‌లోనే మరో కేసు రికార్డయింది. ఐసీఐసీఐ బ్యాంకును రూ.562.5 కోట్లకు మోసం చేసిన కేసులోనూ పార్థసారధి నిందితుడు. హైదరాబాద్‌ పోలీసుల ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈడీ కేసులు నిందితులపై కేసులు పెట్టింది. ఇందుకోసం అన్ని ఎఫ్‌ఐఆర్‌లను కలిపింది. ఇతర బ్యాంకుల నుంచి, ఇండివిజువల్‌ ఇన్వెస్టర్లు, షేర్‌హోల్డర్ల నుంచి కూడా పిర్యాదులు వస్తున్నాయని ఈడీ తెలిపింది. పార్థసారధి బ్యాంకుల నుంచి దాదాపు రూ.2,873 కోట్ల విలువైన లోన్లు తీసుకున్నారని తెలిపింది. సెబీ కూడా కేఎస్‌బీఎల్‌లో జరిగిన మోసాలపై విచారణ జరుపుతోంది.