
న్యూఢిల్లీ : మనీ లాండరింగ్ ఆరోపణలపై రోల్స్ రాయిస్ మీద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) క్రిమినల్ కేసును దాఖలు చేసింది. ప్రభుత్వ రంగంలోని హెచ్‌ఏఎల్, ఓఎన్‌జీసీ, గెయిల్‌ల నుంచి ఆర్డర్ల కోసం ఒక ఏజంట్‌కు 2007–2011 మధ్య కాలంలో ఈ కంపెనీ రూ. 77 కోట్లను అక్రమ చెల్లింపు జరిపిందనేది ఆరోపణ. పీఎంఎల్‌ఏ నిబంధనల కింద ఈ కేసును నమోదు చేశారు. ఈ కేసులో సీబీఐ జూలై 2019 లో ఒక ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. ఆ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా తాజా కేసును దాఖలు చేసినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. రోల్స్ రాయిస్, దాని ఇండియన్ సబ్సిడరీ, సింగపూర్‌కు చెందిన అశోక్ పట్ని, ఆయన కంపెనీ ఆష్మోర్ ప్రైవేట్ లిమిటెడ్, ముంబైకి చెందిన టర్బోటెక్ ఎనర్జీ సర్వీసెస్ ఇంటర్నేషనల్‌తోపాటు, హెచ్‌ఏఎల్, ఓఎన్‌జీసీ, గెయిల్ ఉద్యోగులు కొందరి మీదా కేసు దాఖలైంది. 2000–2013 మధ్య కాలంలో హెచ్‌ఏఎల్‌తో రోల్స్ రాయిస్ మొత్తం రూ. 4,700 కోట్ల వాణిజ్యం జరిపినట్లు సీబీఐ పేర్కొంది. 5 ఏళ్ల సుదీర్ఘ దర్యాప్తు తర్వాత సీబీఐ తన ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. డిఫెన్స్ మంత్రిత్వ శాఖలోని ఒకరు ఫిర్యాదు చేయడంతో సీబీఐ ఈ దర్యాప్తును మొదలు పెట్టింది. ఈ కేసును మరింత లోతుగా పరిశీలించేందుకే ఈడీ విచారణ చేపట్టింది. ఈ అక్రమ నిధులు ఎక్కడికి, ఎలా వెళ్లాయనే అంశాలపై ఈడీ దృష్టి నిలపనుంది. రోల్స్ రాయిస్ ఇండియాలో ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగులెవరూ ఈ కేసులో లేరని, తామెప్పుడూ నైతిక ప్రమాణాలను పాటిస్తామని రోల్స్ రాయిస్ ప్రతినిధి తెలిపారు. ఎలాంటి అక్రమాలను తాము సహించమని కూడా సీబీఐ ఎఫ్‌ఐఆర్ తర్వాత రోల్స్ రాయిస్ వెల్లడించింది. ఇండియా తమకు చాలా ముఖ్యమైన మార్కెట్‌గా పేర్కొంది.