టీకా ఒక్క డోసు వేసుకున్నా.. వ్యాప్తి సగం తగ్గుతది

టీకా ఒక్క డోసు వేసుకున్నా.. వ్యాప్తి సగం తగ్గుతది

బ్రిటన్‌‌కు చెందిన పబ్లిక్‌‌ హెల్త్‌‌ ఇంగ్లండ్‌‌ స్టడీలో వెల్లడి
లండన్‌‌: కరోనా వ్యాక్సిన్‌‌ తీసుకుంటే వైరస్‌‌ నుంచి కాపాడటమే కాకుండా పక్కనున్న వాళ్లకు వ్యాపించకుండా అడ్డుకుంటుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఒక్క డోసు తీసుకున్నా కూడా ఇంట్లో వాళ్లకు వ్యాపించే రేటు 50శాతం తగ్గుతుందంటున్నారు. పబ్లిక్‌‌ హెల్త్‌‌ ఇంగ్లండ్‌‌ చేసిన స్టడీలో ఈ విషయం వెల్లడైంది. ఫైజర్‌‌, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌‌ తీసుకున్న వారిపై సైంటిస్టులు ఈ పరిశోధన చేశారు. ఒక్క డోసు వ్యాక్సిన్‌‌ తీసుకున్న వాళ్లకు కొద్ది రోజుల తర్వాత కరోనా వచ్చిన వాళ్లను, వాళ్ల దగ్గరి వాళ్లపై స్టడీ చేయగా వ్యాక్సిన్‌‌ తీసుకోని వాళ్లకు సోకడం 38 నుంచి 49 శాతం తగ్గిందని గుర్తించారు. స్టడీ వివరాలను బ్రిటన్‌‌ హెల్త్‌‌ సెక్రటరీ మ్యాట్‌‌ హాన్‌‌కాక్‌‌ వెల్లడించారు. ఒక డోసు వ్యాక్సిన్‌‌ తీసుకున్న తర్వాత కనీసం ఒకరు కరోనా బారిన పడిన 24 వేల కుటుంబాల్లో 57 వేల మంది వ్యాక్సిన్‌‌ తీసుకోని వారిపై ఈ స్టడీ చేశారు. వ్యాక్సిన్‌‌ తీసుకోని 10 లక్షల మంది ఇన్ఫర్మేషన్‌‌తో స్టడీ వివరాలను పోల్చి చూడగా ఈ వివరాలు వెల్లడయ్యాయని చెప్పారు. గతంలో జరిపిన పలు అధ్యయనాల్లో.. ఒక డోసు తీసుకున్న 4 వారాల తర్వాత వైరస్‌‌ వల్ల తలెత్తే లక్షణాలు 65 శాతం తగ్గినట్లు తేలిన విషయం తెలిసింది. బ్రిటన్‌‌లో వ్యాక్సినేషన్‌‌ మంచి రిజల్ట్స్‌‌ ఇస్తోందని పీహెచ్‌‌ఈ స్టడీలో తేలింది. మార్చి చివరి నాటికి 60 ఏళ్లు పైబడిన వారిలో 10,400 మరణాలను నియంత్రించగలిగామని స్టడీ వెల్లడించింది. వ్యాక్సిన్‌‌ తీసుకున్న ప్రతి నలుగురిలో ఒకరికి చాలా తక్కువ సైడ్‌‌ ఎఫెక్ట్స్‌‌ కనిపించాయని వ్యాక్సినేషన్‌‌పై చేసిన మరో స్టడీలో వెల్లడైంది. తలనొప్పి, ఆయాసం, అలసట ఎక్కువ మందిలో కనిపించాయని, అవి ఒకట్రెండు రోజుల్లో తగ్గిపోతున్నాయని స్టడీ చెప్పింది.