Fack Check : ఆ వస్తువులు వాడొద్దని మోదీ ఎప్పుడూ చెప్పలేదు..

Fack Check : ఆ వస్తువులు వాడొద్దని మోదీ ఎప్పుడూ చెప్పలేదు..

దేశంలో పండుగ సీజన్ జోరందుకుంది. ఈ పండుగల సమయంలో చాలా మంది షాపింగ్ చేయడం కొత్తేం కాదు. దేశీయ, విదేశీ మార్కెట్ల నుంచి ఇంపోర్ట్ అయిన వివిధ వస్తువులు వినియోగదారులను ఆకర్షిస్తాయి. అయితే, ఈ సమయంలో, విదేశీ వస్తువులను బహిష్కరించాలని ప్రధాని నరేంద్ర మోడీ విజ్ఞప్తి చేశారంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. కానీ ఈ పోస్ట్‌ను వాస్తవంగా తనిఖీ చేయగా, అది పూర్తిగా నకిలీదని తేలింది.

ఏం వైరల్ అవుతోంది?

అక్టోబర్ 30, 2023న, షమ్జీ చభాడియా అనే ఫేస్‌బుక్ యూజర్ ఈ పోస్ట్‌ను షేర్ చేశారు. అందులో ప్రధాని మోదీ చేతులు జోడించి ఉన్న ఫొటో, ఫొటోపై సుదీర్ఘ సందేశం రాసి ఉంది. ఈ ఫొటోలోని సందేశం ఏం చెబుతుందంటే:

బ్రిటీష్ వాళ్ళు కూడా ఇండియాలో వ్యాపారం చేస్తూ మనల్ని బానిసలుగా మార్చారు. అప్పట్లో మనం నిరక్షరాస్యులం, కానీ ఈ రోజు మనం చదువుకున్నాం. 90 రోజుల పాటు ఎటువంటి విదేశీ వస్తువులను కొనుగోలు చేయకూడదు. అప్పుడు భారతదేశం ప్రపంచంలోనే రెండవ సంపన్న దేశంగా మారుతుంది. భారతదేశం కేవలం రూ.90 రోజుల్లోనే అమెరికన్ డాలర్ కి సమానం అవుతుంది. మీరు జోకులు ఫార్వార్డ్ చేసే బదులు ఈ సందేశాన్ని ఫార్వార్డ్ చేస్తే , ఇది ఉద్యమంగా మారవచ్చు. గత సంవత్సరం, ఒక ప్రచారంలో, దీపావళి సమయంలో ప్రజలు చైనా ఉత్పత్తులను కొనలేదు. దీని వల్ల 20% వస్తువులు వృధా అయ్యి, చైనాను ఆందోళనకు గురిచేసింది. మన దేశం చాలా పెద్దది. ఇది ప్రయత్నించండి. భారతీయులారా, మేల్కోండి" అని ఆ నోట్ లో ఉంది.

ఈ సందేశంతో, పండుగల సీజన్‌లో విదేశీ వస్తువులను కొనుగోలు చేయవద్దని, చైనా ఉత్పత్తులను బహిష్కరించాలని, చైనాకు గుణపాఠం చెప్పాలని ప్రధాని అందరికీ విజ్ఞప్తి చేసినట్లు ఈ ప్రచారం జరుగుతోంది.  ఈ వైరల్ సందేశం వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకోవడానికి ఫ్యాక్ట్ చెక్ తనిఖీ చేపట్టింది. ముందుగా కీవర్డ్స్ సాయంతో గూగుల్ లో సెర్చ్ చేయడంతో.. ఆన్‌లైన్‌లో విస్తృతంగా సెర్చ్ చేసినప్పటికీ, పండుగ సీజన్‌లో చైనీస్ ఉత్పత్తులను బహిష్కరించాలని విజ్ఞప్తి చేసిన ప్రధాని మోడీ లేదా ప్రభుత్వం నుండి మాకు అధికారిక సమాచారం ఏదీ కనుగొనబడలేదు.

అయితే, గూగుల్ సెర్చ్ సమయంలో, ఓ హిందీ వెబ్‌సైట్‌లో ఒక వార్తా కథనాన్ని కనుగొన్నారని. దీనిలో వీలైనన్ని ఎక్కువ స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. ఈ వార్త నవంబర్ 1, 2021న ప్రచురించబడింది. ఈ వార్త ముఖ్యాంశం ఏంటంటే.. ప్రధాని నరేంద్ర మోదీ దీపావళికి స్వదేశీ వస్తువుల కొనుగోలుతో, "చైనా రూ. 50 వేల కోట్ల నష్టాన్ని చవిచూసింది" అని విజ్ఞప్తి చేశారు. "దేశీయ వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహించాలని, స్థానిక వస్తువులకు స్థానం ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీ దేశప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇటీవల, 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రధాని మోదీ దీపావళి నాడు స్వదేశీ వస్తువులను స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు. లోకల్ ఫర్ వోకల్ అనే నినాదాన్ని పునరావృతం చేశారు.

స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయాలనే విజ్ఞప్తి ఏ నిర్దిష్ట దేశానికి వ్యతిరేకంగా లేదని కూడా ఈ కథనం తెలిపింది. ఈ కథనంలోని ఐదవ పేరాలో, “స్వదేశీ, ‘లోకల్ ఫర్ వోకల్’ మంత్రం ఏ దేశానికీ వ్యతిరేకం కాదని ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వంలోని పలువురు మంత్రులు స్పష్టం చేశారు. భారతదేశాన్ని స్వావలంబనగా మార్చడానికి ఒక చొరవ" అని చెప్పారు.

ఫ్యాక్ట్ చెక్‌లో ఏం బయటపడిందంటే..

ఈ విషయంపై తనిఖీ చేసినప్పుడు, ప్రధాని మోదీ గానీ లేదా కేంద్ర ప్రభుత్వం గానీ అలాంటి విజ్ఞప్తిని చేయలేదని తేలింది. ఈ వైరల్ సందేశం పూర్తిగా కల్పితమైనదని బట్టబయలైంది.