మరికాసేపట్లో గవర్నర్ను కలవనున్న ఫఢ్నవిస్, షిండే

మరికాసేపట్లో గవర్నర్ను కలవనున్న ఫఢ్నవిస్, షిండే

ముంబయి :మహారాష్ట్రలో కొన్ని రోజులగా సాగుతున్న నాటకీయ పరిణామాలకు తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. సీఎం పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేసిన నేపథ్యంలో రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. శివసేన రెబల్ నేత ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని 49 మంది ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు ప్రకటించినట్లు సమాచారం. గోవాలో రెబల్ ఎమ్మెల్యేలతో సమావేశమైన అనంతరం షిండే ముంబయి చేరుకున్నారు. బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ను కలిసి మద్దతు ప్రకటించారు. ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గ కూర్పుపై ఇరువురు నేతలు చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో దేవేంద్ర ఫడ్నవిస్, ఏక్ నాథ్ షిండే మరికాసేపట్లో గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వాలని కోరనున్నట్లు తెలుస్తోంది.


మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది. ఏక్ నాథ్ షిండేకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వనున్నట్లు సమాచారం. వీరిద్దరితో పాటు కొద్ది మంది ఎమ్మెల్యేలు కేబినెట్ మంత్రులుగా రేపు ప్రమాణం చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.