MLC 2025: ఫాఫ్‌కు ఇలాంటివి మామూలే: 40 ఏళ్ళ వయసులో ఫుల్ లెంగ్త్ డైవ్ చేస్తూ కళ్లుచెదిరే క్యాచ్

MLC 2025: ఫాఫ్‌కు ఇలాంటివి మామూలే: 40 ఏళ్ళ వయసులో ఫుల్ లెంగ్త్ డైవ్ చేస్తూ కళ్లుచెదిరే క్యాచ్

సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఫాఫ్ డుప్లెసిస్ ఫీల్డింగ్ లో అద్భుతాలు చేయడం కొత్త కాదు. 40 ఏళ్ళ వయసులో కూడా నమ్మశక్యం కానీ క్యాచ్ లను అందుకుంటూ ఔరా అనిపిస్తున్నాడు. గ్రౌండ్ లో ఎక్కడున్నా.. బంతి ఎంత దూరంగా వెళ్తున్నా విన్యాసాలు చేస్తాడు. తాజాగా ఒక అద్భుతమైన క్యాచ్ తో ప్రపంచ క్రికెట్ ను షాక్ కు గురి చేశాడు. సింగిల్ హ్యాండ్ క్యాచ్ తో శెభాష్ అనిపించాడు. మేజర్ లీగ్ క్రికెట్ లో భాగంగా ఈ సూపర్ క్యాచ్ నమోదయింది. 

మేజర్ లీగ్ క్రికెట్ లో శనివారం (జూన్ 14) ముంబై ఇండియన్స్ న్యూయార్క్, టెక్సాస్ సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. కాలిఫోర్నియాలో జరిగిన ఈ మ్యాచ్ లో టెక్సాస్ సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న డుప్లెసిస్ కీలక దశలో సంచలన క్యాచ్ తో మెరిశాడు. ముంబై చేజింగ్ చేస్తున్నప్పుడు ఇన్నింగ్స్ 14 ఓవర్ రెండో బంతిని సూపర్ కింగ్స్ ఫాస్ట్ బౌలర్ ఆడమ్ మిల్నే ఆఫ్ స్టంప్ కు దూరంగా విసిరాడు. ఈ బంతిని కవర్స్ మీదుగా మైకేల్ బ్రేస్ వెల్ బలంగా షాట్ ఆడాడు. కవర్స్ లో ఫీల్డింగ్ చేస్తున్న డుప్లెసిస్.. కుడి వైపు ఫుల్ లెంగ్త్ డైవ్ చేసి ఒంటి చేత్తో క్యాచ్ అందుకున్నాడు.

అప్పటికే 20 బంతుల్లో 38 పరుగులు చేసి మంచి జోరు మీదున్న బ్రేస్ వెల్.. డుప్లెసిస్ పట్టిన స్టన్నింగ్ క్యాచ్ కు నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది. ఫాఫ్ పట్టిన అద్భుత క్యాచ్ కు బ్రేస్ వెల్, మొనక్ పటేల్ 97 పరుగుల భాగస్వామ్యానికి తెర పడింది. ఇక్కడ నుంచి వరుస విరామాల్లో ఎంఐ న్యూయార్క్ వికెట్లను కోల్పోతూ వచ్చి మ్యాచ్ ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టెక్సాస్ సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఎంఐ న్యూయార్క్ 8 వికెట్ల నష్టానికి 182 పరుగులకే పరిమితమై 3 పరుగుల తేడాతో ఓడిపోయింది.