పురుగులే పురుగుమందులు

పురుగులే పురుగుమందులు

అదో పెద్ద వ్యవసాయ క్షేత్రం. పంటలు బాగా పండే ప్రాంతం. అక్కడ కూడా పంటలకు తెగుళ్లొస్తుంటాయి. పురుగులు పంటలను నాశనం చేస్తుంటాయి. కానీ రైతులు మాత్రం రసాయనాలు వాడలేదు. కొత్త పద్ధతిని ఆలోచించారు. పురుగులు చంపడానికి పురుగులనే వాడుతున్నారు. మంచి దిగుబడులు రాబడుతున్నారు. విదేశాలకూ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నారు.

మిరియాల రైతులందరూ..

స్పెయిన్‌‌లోని అల్మేరియా ప్రావిన్స్‌‌. ఇక్కడ సుమారు లక్షా ఇరవై వేల మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అల్మేరియా ఆదాయంలో 20% వ్యవసాయం నుంచే వస్తోంది. ఈ ప్రాంతంలో మధ్యదరా సముద్రానికి ఆనుకుని ఉన్న ‘సీ ఆఫ్‌‌ ప్లాస్టిక్‌‌’ ప్రాంతం కూరగాయలు, పండ్ల పంటలకు ఫేమస్‌‌. యూరప్‌‌లో అవి ఎక్కువగా పండేది ఇక్కడే. సుమారు 75 వేల ఎకరాల ప్రాంతమిది. గతేడాది 25 లక్షల టన్నుల కూరగాయలు, పండ్లు ఇక్కడి నుంచి ఎగుమతి అయ్యాయి. సీ ఆఫ్‌‌ ప్లాస్టిక్‌‌ అని ఎందుకన్నారంటే ఇక్కడన్నీ గ్రీన్‌‌ హౌస్‌‌లే. పైనుంచి చూస్తే ప్లాస్టిక్‌‌ పరిచినట్టే ఉంటుంది. ఇక్కడ పండించే మిరియాల పంటలకు పెస్టిసైడ్స్‌‌ను వాడరు. వాటికి బదులు మైట్స్​ను వాడుతారు. ఈ ప్రాంతంలోని రైతులంతా ఈ బయలాజికల్‌‌ కంట్రోల్‌‌ పద్ధతినే పాటిస్తున్నారు. 60 శాతం మంది టమాట రైతులు కూడా వీటినే వాడుతున్నారు. దీంతో పురుగుమందుల  వాడకం 2007 నుంచి 40% పైగా తగ్గింది.

 1960ల్లో పెస్టిసైడ్స్‌‌ మొదలు

పంట పొలాల్లో పురుగు మందుల వాడకం 1960ల్లోనే మొదలైంది. మందులకు కీటకాలు రెసిస్టెన్స్‌‌ పెంచుకోవడంతో అవి ఇంకా ఎక్కువయ్యాయి.  దీంతో రైతులు కొత్త పద్ధతులను వెతకడం మొదలుపెట్టారు. ఈ కొత్త పద్ధతుల్లో మైట్స్‌‌ (పురుగులు) వాడకం ఒకటి. ఇదే ఇప్పుడు స్పెయిన్‌‌లో బాగా వాడుకలో ఉంది. దీంతో కంపెనీలు అటువైపు రూటు మార్చాయి. ఏడాదికి రూ.42 వేల కోట్ల వ్యాపారం చేస్తున్న ఫ్రెంచ్‌‌ అగ్రికల్చరల్‌‌ కో ఆపరేటివ్‌‌ ‘ఇన్‌‌వైవో’ సీ ఆఫ్‌‌ ప్లాస్టిక్‌‌లో బయో ఫ్యాక్టరీని స్టార్ట్‌‌ చేసింది. గాలి కూడా చొరబడని రూమ్‌‌లు రెడీ చేసి వేడిని, తేమను కంట్రోల్‌‌ చేస్తూ 4 రకాల మైట్స్‌‌ను పెంచుతోంది. వాటిని స్పెయిన్‌‌ సహా పోర్చుగల్‌‌, మొరాకోల్లో అమ్ముతోంది. ఈ ఏడాది లక్ష కోట్ల పురుగుల ఉత్పత్తిని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కంపెనీతో పాటు సుమారు 30 కొత్త కంపెనీలు పుట్టుకొచ్చాయి. ఈ పద్ధతులను వాడుతున్న దేశాల్లో స్పెయినే మొదటి స్థానంలో ఉందట.