ఇండస్ట్రియల్ ఏరియాల్లో  ఏటా100 ఫైర్​ యాక్సిడెంట్లు

ఇండస్ట్రియల్ ఏరియాల్లో  ఏటా100 ఫైర్​ యాక్సిడెంట్లు

జీడిమెట్ల, వెలుగు: గ్రేటర్​ పరిధిలోని ఇండస్ట్రియల్​ ఏరియాల్లో ఏటా అగ్ని ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఫార్మా కంపెనీలు  పేలుళ్లకు అడ్డాగా మారుతున్నాయి. ఎండలు మండుతుండడంతో స్థానిక ప్రజలు, కార్మికులు భయంతో వణికిపోతున్నారు. జీడిమెట్ల లాంటి ఇండస్ట్రియల్ ఎస్టేట్​లో ఏటా100 అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వీటిలో ఎక్కువగా వేసవిలోనే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, కంపెనీల అత్యాశ, నిర్లక్ష్యమే ప్రమాదాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. తరచూ ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు, కంపెనీల యాజమాన్యాల తీరు మార్చుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

300 ఫార్మా కంపెనీలు..

జీడిమెట్ల, బాలానగర్, మేడ్చల్, పటాన్​చెరు, బొల్లారం, ఖాజీపల్లి, పాశమైలారం ఇండస్ట్రియల్ ఏరియాల్లోని దాదాపు 300 ఫార్మా కంపెనీల్లో బల్క్​డ్రగ్స్, ఇంటర్మీడిట్స్ తయారు చేస్తుంటారు. కెమికల్​తో పని కాబట్టి కంపెనీలు ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్స్​పీరియన్స్​ఉన్న కార్మికుల నియామకం మొదలు అన్ని రకాల పరికరాల్లో  క్వాలిటీ ఉండేలా చూడాలి. కానీ చాలా కంపెనీలకు అవేం పట్టడం లేదు. కార్మికుల ప్రాణాలను పణంగా పెడుతున్నాయి. ఫైర్​ సేఫ్టీ  జాగ్రత్తలు తీసుకోవడం లేదు. కెమికల్స్ ​నిర్వహణలో ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నాయి.

మార్చి ప్రాణాల మీదికి..

ఫార్మా కంపెనీలు కెమికల్ ​పేరును తెలిసేలా కాకుండా, వేరే పేరుతో నిల్వ చేయడంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. గ్రేటర్​లో జరుగుతున్న ప్రమాదాలకు 90 శాతం ఇదే కారణమని నిపుణులు చెబుతున్నారు. ఒక ఉత్పత్తిలో వాడే కెమికల్ ​పేరు కాకుండా నిర్వాహకులు వేరే పేర్లు పెడుతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. తమ ఉత్పత్తుల గురించి బయటకు తెలియొద్దని, తమ ఫార్ములా బయటకు వెళ్లొద్దని ఇలా చేస్తున్నట్లు తెలుస్తోంది. అనుభవం లేని కార్మికులు ఒక కెమికల్​కు బదులు మరో కెమికల్ కలపడం, రియాక్టర్లలో పోయడంతో పేలుళ్లు జగుతున్నాయి. ప్రాణనష్టం పెరుగుతోంది. శివారు ప్రాంతాల్లో కొనసాగుతున్న ఫార్మా కంపెనీల్లో స్కిల్డ్​ వర్కర్స్ ​లేరని సమాచారం. ఖర్చు తగ్గించుకునేందుకు ఒకరిద్దరిని నియమించుకుని వారి పర్యవేక్ష
ణలో అనుభవం లేనివారితో బల్క్​డ్రగ్స్, ఇంటర్మీడిట్స్ తయారు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇటీవల జరిగిన ఘటనలు

 

  • జీడిమెట్ల అరోరే ఫార్మా కంపెనీలో మార్చిలో రియాక్టర్ పేలి  కెమిస్ట్ నరేందర్, కాంట్రాక్ట్ లేబర్ కుమార్ చనిపోయారు. కెమిస్ట్, హెల్పర్ అనుభవంపై అనేక అనుమానాలు ఉన్నాయి. గతంలో ఆర్​అండ్​డీ విభాగంలో అబ్జర్వర్​గా పని చేసిన నరేందర్​ను కెమిస్ట్​గా నియమించారనే ఆరోపణలు వచ్చాయి.   
  • జీడిమెట్ల శోధనా లాబొరేటరీస్ ​కంపెనీలో మార్చిలో పేలుడు సంభవించి ఇద్దరు కార్మికులు  చనిపోయారు. మరో కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు.
  • గతేడాది ఎస్వీ కోఆపరేటివ్స్​ సొసైటీలోని వశిష్ట లైఫ్ సైన్సెస్​లో పేలుడు సంభవించి కంపెనీ బిల్డింగ్ ​మొత్తం కుప్పకూలింది. అదే టైంలో కంపెనీ పక్కగా వెళ్తున్న ఇద్దరు తీవ్రంగా  గాయపడ్డారు.

సమ్మర్​ భయంతో బతుకుతున్నం

ఎండాకాలం వచ్చిందంటే చాలు భయంతో బతకాల్సి వస్తోంది. ఇండస్ట్రియల్ ​ఏరియాలోని కంపెనీల్లో  వానాకాలంలోనూ ఫైర్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. కెమికల్ డ్రమ్ములు పేలే టైంలో గుండెలు అదురుతున్నాయి. ఒక్కోసారి రాత్రంతా భయంతో వణుకుతున్నాం. టీవీల్లో చూసి
 మా బంధువులు ఫోన్లు చేసి అడుగుతున్నారు. కంపెనీలను ఇక్కడి నుంచి తరలిస్తే అందరికి మంచిది.  

– ప్రవీణ్​కుమార్, అపురూప కాలనీ, జీడిమెట్ల

తరచూ తనిఖీలు చేస్తున్నం
ఫార్మా కంపెనీల్లో తరచూ తనిఖీలు చేస్తున్నాం. ఫైర్ ​సేఫ్టీ ఉండేలా చూస్తున్నాం. కార్మికులకు ఫైర్ ​యాక్సిడెంట్లపై అవగాహన కల్పిస్తున్నాం. ప్రమాదాలు జరిగిన టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నాం. ఎక్కడైనా ఫైర్​యాక్సిడెంట్ జరిగితే వీలైనంత త్వరగా మంటలను అదుపులోకి తెచ్చి, ఆస్తి, ప్రాణ నష్టం తగ్గించేందుకు కృషి చేస్తున్నాం.

– సుభాశ్​ రెడ్డి, ఫైర్ ఆఫీసర్, జీడిమెట్ల