స్ఫూర్తిదాయకం.. తెలుగులో తీర్పు : మంగారి రాజేందర్

స్ఫూర్తిదాయకం.. తెలుగులో తీర్పు : మంగారి రాజేందర్

ఇంగ్లీష్ భాషపై అంతగా ప్రావీణ్యం లేని లేదా ఇంగ్లీష్​ భాషపై ప్రాథమిక జ్ఙానం లేని సామాన్యుడు ఇంగ్లీషులో కోర్టులు వెలువరించిన తీర్పులను అర్థం చేసుకోవడం చాలా కష్టం. స్వాతంత్ర్యం వచ్చి ఏండ్లు గడిచినా న్యాయ పరిపాలన ఇంగ్లీషులో జరగడం, తీర్పులు ఇంగ్లీషులోనే ఉండటం కొంత బాధ కలిగించే విషయం. హైకోర్టుల్లో తీర్పులు ప్రాంతీయ భాషల్లో వెలువరించడానికి కొన్ని రాజ్యాంగపరమైన ఆటంకాలు ఉండవచ్చు. అయితే వాటిని పార్లమెంట్, సుప్రీంకోర్టులు అనుకుంటే అధిగమించవచ్చు. అది పెద్ద కష్టమైన పనేమీ కాదు. న్యాయం కోసం వచ్చిన ప్రజలకు వాళ్ల భాషలో తీర్పులు చెప్పడం ముఖ్యమైన విషయం. అయితే ఈ దిశగా స్వాతంత్ర్యం వచ్చిన ఇన్ని ఏండ్ల తర్వాత కూడా గట్టి చర్యలు తీసుకోలేదు.

 కృత్రిమ మేధస్సు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రాంతీయ భాషల్లో తీర్పులు చెప్పడం అంత కష్టమైన పని కాదు. అనువాద సమస్య ఉన్నా, దాన్ని సులువుగా అధిగమించవచ్చు. ఆ అనువాదాన్ని సరిదిద్దడంలో న్యాయమూర్తులు కొంత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. తీర్పులు ప్రజల భాషలో ఉండాలని నిర్ధారించడానికి ఏ భాషా శాస్త్రవేత్త అవసరం లేదు. ప్రజల భాషలో తీర్పులు వచ్చినప్పుడు ఇతరుల సహాయం అవసరం లేకుండా పార్టీలు తీర్పును అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. వారి సహాయం ఆదా అవుతుంది.

సుప్రీం కోర్టులో ఇంగ్లీష్​

ఆ మధ్య ప్రధాని వీడియో కాన్ఫరెన్స్​ద్వారా న్యాయశాఖ మంత్రులు, కార్యదర్శుల అఖిల భారత సదస్సును ప్రారంభించారు. న్యాయ వ్యవస్థను సులభతరం చేయడానికి న్యాయవ్యవస్థలో ప్రాంతీయ భాషల ఉపయోగం ఆవశ్యకత గురించి ఆ సందర్భంగా ప్రధాని నొక్కి చెప్పారు. కొత్త చట్టాలు ప్రాంతీయ భాషల్లో రాయాలని, దాని వల్ల న్యాయవ్యవస్థ ప్రజలకు చేరువవుతుందని అన్నారు. చట్టపరమైన భాష ప్రజలకు అవరోధంగా మారకూడదనీ ఆయన అన్నారు. మొఘలుల కాలంలో కోర్టుల్లో ఉర్దూ భాష ఉండేది. ఆ తర్వాత పర్షియన్, పార్సీ లిపిలకు మారింది. బ్రిటీష్​వాళ్ల పాలనలో కూడా ఆ భాషలు కొంత కాలం కొనసాగాయి. ఆ తర్వాత బ్రిటీష్​వారు మన దేశంలో ఆంగ్లభాషను ప్రవేశపెట్టారు. చట్టాలను ఇంగ్లీషులో రూపొందించారు. మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా15 సంవత్సరాలు ఇంగ్లీష్​ వాడకాన్ని ఆమోదించారు. ఆర్టికల్​343 ప్రకారం హిందీ అధికార భాష. ఆర్టికల్​348(1)(ఎ) ప్రకారం పార్లమెంట్​చట్టం ద్వారా భాషను నిర్ధారించే వరకు సుప్రీంకోర్టు హైకోర్టులో జరిగే అన్ని ప్రక్రియలు ఆంగ్లంలో జరుగుతాయి. ఆర్టికల్​348(2) ప్రకారం రాష్ట్రపతి పూర్వ సమ్మతితో, హిందీని గానీ ఇతర భాషలను గానీ అధికారిక అవసరాల కోసం సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో ఉపయోగించవచ్చు. 

ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్​ రాష్ట్రాలు తమ హైకోర్టుల ముందు విచారణలను కొనసాగించడానికి ఆయా గవర్నర్లు అధికారం ఇచ్చారు. తమిళనాడు రాష్ట్రం కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నది. అయినప్పటికీ ఈ అంశాలు ఏవీ హైకోర్టు ఇచ్చే తీర్పులకు వర్తించవు. విచారణల్లో ఇతర భాషలను ఉపయోగించినప్పటికీ హైకోర్టులు తమ తీర్పులను తప్పనిసరిగా ఆంగ్లంలోనే అందించాల్సి ఉంటుంది. అధికార భాషా చట్టం, 1963 ప్రకారం.. హైకోర్టు తమ తీర్పులను ఇంగ్లీష్​ కాకుండా ఇతర భాషల్లో ఇవ్వడానికి గవర్నర్​ అనుమతి ఇవ్వవచ్చు. అయితే ఇంతకు ముందు చెప్పినట్టుగా రాష్ట్రపతి పూర్వ అనుమతి అవసరం ఉంటుంది. అలా ఇచ్చినప్పటికీ, ఆ తీర్పుతోపాటు ఇంగ్లీష్​లో కూడా అనువాదం అందించాల్సి ఉంటుంది.  రాజ్యాంగ నిబంధనలతోపాటు ఈ నిబంధనలు చదివితే ఈ చట్టం కూడా ఇంగ్లీషుకే ప్రాధాన్యం ఇచ్చినట్టు కన్పిస్తుంది.  అధికార భాషా చట్టంలోని సుప్రీంకోర్టు ప్రస్తావన లేదు. అంటే అక్కడ ప్రక్రియలు నిర్వహించాల్సిన ఏకైక భాష ఇంగ్లీషు మాత్రమే.

ప్రాంతీయ భాషను ప్రోత్సహించాలి

న్యాయస్థానాల్లో స్థానిక భాషను ప్రోత్సహించడం అవసరం. దీనివల్ల న్యాయవ్యవస్థ విశ్వాసం పెరుగుతుంది. న్యాయం సులభంగా, త్వరగా, అర్థమయ్యే విధంగా ప్రయత్నాలు కొనసాగించాలి. అందుకు అవసరమైన ప్రణాళికలను హైకోర్టులు, ప్రభుత్వాలు చేపట్టాలి. ప్రాంతీయ భాషల్లో తీర్పుల వల్ల న్యాయవ్యవస్థ ప్రజలకు చేరువవుతుంది. ఆ దిశగా ఈ తీర్పు వల్ల మరోసారి చర్యలు ముమ్మరం అవ్వాలని ఆశిస్తున్నాను.

జిల్లా కోర్టులకు స్ఫూర్తి

జిల్లా కోర్టుల్లో తెలుగు భాషా వినియోగానికి ఎలాంటి అభ్యంతరాలు లేవు. సివిల్, క్రిమినల్ ​కేసుల్లో తెలుగును వినియోగించడానికి నిబంధనలు ఉన్నాయి. సివిల్​ప్రొసీజర్​కోడ్​లోని సెక్షన్​137 ప్రకారం ఏదైనా ప్రాంతీయ భాషను కోర్టు భాషగా నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. అయితే హైకోర్టును సంప్రదించాల్సి ఉంటుంది. అలాగే క్రిమినల్​ప్రొసీజర్​ కోడ్​లోని సెక్షన్​272 ప్రకారం క్రిమినల్​ కోర్టుల్లోని భాషను రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించవచ్చు. ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణలో అలాంటి ఉత్తర్వులను ప్రభుత్వాలు జారీ చేశాయి. హైకోర్టు తెలుగులో తీర్పును ప్రకటించడం ద్వారా జిల్లా కోర్టుల న్యాయమూర్తులు తెలుగులో తీర్పులు చెప్పడానికి స్ఫూర్తిని పొందుతారన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు. 

అలాగే హైకోర్టులు ప్రాంతీయ భాషల్లో తీర్పులు చెప్పే విషయంలో చర్చ కచ్చితంగా జరుగుతుంది. ఆ చర్చ ఆశావహ దిశగా ప్రయాణం చేస్తుందని భావిస్తున్నాను. దేశం నలుమూల నుంచి సుప్రీంకోర్టుకు కేసులు వచ్చినట్టే న్యాయమూర్తులు, న్యాయవాదులు దేశంలోని  అన్ని ప్రాంతాల నుంచి వస్తారు. తమకు పరిచయం లేని భాషల్లో తీర్పులను చదవడం కొంత కష్టమైన పని. కాని అసాధ్యమైన పని కాదు. కృత్రిమ మేధస్సు వినియోగంలోకి వచ్చిన తర్వాత అనువాదాలు కష్టసాధ్యం కాదు. ఇప్పుడు మన దేశంలో న్యాయవ్యవస్థ బాగా అభివృద్ధి చెందింది. ఇతర హైకోర్టుల తీర్పులను అందరూ చదివే అవకాశం ఉంది. అందుకు ఇంగ్లీషు భాష తోడ్పడుతుంది. అందులో సందేహం లేదు. అట్లా అని ప్రాంతీయ భాషలను విస్మరించడానికి వీల్లేదు. ఇంగ్లీషు ఎంత ముఖ్యమో, తెలుగు అంతకన్నా ముఖ్యం. 

కొత్త ఒరవడికి శ్రీకారం

తెలంగాణ హైకోర్టు తొలిసారిగా తెలుగులో తీర్పును వెలువరించింది. ఇది ఒకరకంగా చరిత్రాత్మకమైన విషయంగా పేర్కొనవచ్చు. ఆస్తి వాటాకు సంబంధించిన అప్పీలుపై హైకోర్టు సీనియర్​ న్యాయమూర్తి జస్టిస్​పి. నవీన్​రావు, జస్టిస్​ నగేష్​ భీమపాకలతో కూడిన ధర్మాసనం తెలుగులో 44 పేజీల తీర్పును వెలువరించింది.  ఇది తెలుగులో చెప్పినప్పటికీ ఇంగ్లీష్ ప్రతి కూడా అవసరమే. ఎందుకంటే ఈ లిటిగేషన్​ఇక్కడితో ఆగిపోదు. సుప్రీంకోర్టు దాకా వెళ్లే అవకాశం ఉటుంది. అక్కడ అధికార భాష ఇంగ్లీష్. తెలుగు తెలియని న్యాయమూర్తులు ఎందరో ఉంటారు. హైకోర్టు న్యాయమూర్తులు తెలుగులో తీర్పులు చెప్పవచ్చన్న చర్చను అలా ఉంచితే.. తెలుగులో హైకోర్టు తీర్పు చెప్పడం ఆహ్వానించదగ్గ పరిణామం. 

ఇంగ్లీషు ప్రతి ఎలాగూ ఉంటుంది. కాబట్టి ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. న్యాయమూర్తులు ఇంగ్లీషులో తీర్పులు చెప్పినప్పటికీ, కృత్రిమ మేధస్సును ఉపయోగించి ప్రాంతీయ భాషలో తెలుగు ప్రతి తయారు చేయడం అవసరం. ఆ తెలుగు ప్రతిని న్యాయమూర్తులు సవరించడానికి అవకాశం ఉంటుంది. వాళ్లు చెప్పిన భావం సరిగ్గా తెలుగులోకి అనువాదం అయ్యిందానన్న విషయం వాళ్లు పరిశీలించే వీలు ఉంటుంది. తెలుగులో తొలి తీర్పును హైకోర్టు న్యాయమూర్తులు ప్రకటించి ఒక కొత్త ఒరవడిని సృష్టించారు. ఇది కోర్టుల్లో తెలుగు భాషాభివృద్ధికి తోడ్పడుతుందని ఆశించవచ్చు.

- మంగారి రాజేందర్, తెలుగులో మొదటిసారి తీర్పు ఇచ్చిన జిల్లా జడ్జి (రిటైర్డ్)