జింబాబ్వే మాజీ కెప్టెన్ పై బ్యాన్

జింబాబ్వే మాజీ కెప్టెన్ పై బ్యాన్

దుబాయ్: వరల్డ్ క్రికెట్ లో ఫిక్సింగ్ భూతం మరోమారు ప్రకంపనలు సృష్టిస్తోంది. జింబాబ్వే తరఫున అత్యధిక శతకాలు(17) బాదిన క్రికెటర్‌గా రికార్డుల్లో నిలిచిన ఆ దేశ మాజీ కెప్టెన్‌ బ్రెండన్ టేలర్ పై ఐసీసీ బ్యాన్ విధించింది. ఫిక్సింగ్ కు పాల్పడ్డాడని ఒప్పుకున్న టేలర్ కు.. ఐసీసీ యాంటీ కరప్షన్ కోడ్ లో మూడు, ఐసీసీ యాంటీ డోపింగ్ కోడ్ ను ఉల్లంఘించినందుకు అతడి మీద మూడున్నరేళ్ల పాటు నిషేధం వేసింది.

కాగా, ఇటీవల బ్రెండన్ టేలర్ మ్యాచ్ ఫిక్సింగ్ కు సంబంధించి సంచలన విషయాలు బయటపెట్టాడు. 2019లో ఓ భారత వ్యాపారవేత్త, తనను మ్యాచ్ ఫిక్సింగ్ చేయమని బెదిరించాడని, అందుకు అతను 15 వేల అమెరికన్‌ డాలర్లు ఆఫర్‌ చేశాడని ట్విటర్‌ వేదికగా ఆరోపణలు చేశాడు. నాటి ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా తాను ఆ వ్యక్తి నుంచి కొంత నగదు కూడా తీసుకున్నట్లు అంగీకరించాడు.

గతేడాది సెప్టెంబర్‌లో ఇంటర్నేషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టేలర్‌.. 2019లో ఓ ప్రముఖ భారత వ్యాపారవేత్త ఆహ్వానం మేరకు భారత్‌కు వచ్చానని, ఆ సందర్భంగా ఓ పార్టీలో కొందరు తనకు కొకైన్‌ ఆఫర్‌ చేశారన్నాడు. తాను కొకైన్‌ సేవిస్తుండగా వీడియోలు తీసి బెదిరించడం మొదలుపెట్టారని, ఈ క్రమంలోనే మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కూడా చేయమన్నారని సంచలన స్టేట్‌మెంట్‌ను విడుదల చేశాడు. ఆ వ్యాపారవేత్త జింబాబ్వేలో టీ20 లీగ్‌ను లాంచ్‌ చేస్తామని తనను సంప్రదించాడని, అప్పటికే తమ దేశ క్రికెట్ బోర్డు నుంచి ఆరు నెలలుగా జీతాలు లేవని, తన ఆర్ధిక అవసరాలను ఆసరాగా తీసుకుని సదరు వ్యక్తి తనను ప్రలోభ పెట్టాడని, తాను అంగీకరించకపోయే సరికి బ్లాక్‌ మెయిలింగ్‌కు దిగాడని స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. గత రెండేళ్లుగా ఈ భారాన్ని మోయలేక మానసికంగా, శారీరకంగా కృంగిపోయానని, అందుకే ఈ స్టేట్‌మెంట్‌ను విడుదల చేస్తున్నాని పేర్కొన్నాడు.

మరిన్ని వార్తల కోసం..

డ్రగ్స్ విషయంలో ఎంతటివారినైనా ఉపేక్షించొద్దు

బ్రహ్మోస్‌ మిస్సైల్ ఎగుమతికి భారత్‌కు తొలి ఆర్డర్

ఎన్సీసీ పరేడ్‌లో ప్రధాని మోడీ న్యూ లుక్