నేడు కర్తవ్యపథ్​లో..ఫుల్ డ్రెస్ రిహార్సల్

నేడు కర్తవ్యపథ్​లో..ఫుల్ డ్రెస్ రిహార్సల్
  •      ‘మదర్ ఆఫ్ డెమోక్రసీ’ థీమ్​తో ఛబ్బీస్ జనవరి వేడుకలు
  •       మూడో సారి తెలంగాణ శకటం ప్రదర్శన

న్యూఢిల్లీ, వెలుగు : ఛబ్బీస్ జనవరి వేడుకలకు ఢిల్లీ ముస్తాబవుతున్నది. కర్తవ్యపథ్ పై మంగళవారం ఫుల్ డ్రెస్ రిహార్సల్ జరగనున్నాయి. ఈ సందర్భంగా అధికారులు భద్రత కట్టుదిట్టం చేశారు. ‘మదర్ ఆఫ్ డెమోక్రసీ’ థీమ్​తో కేంద్ర ప్రభుత్వం రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహిస్తున్నది. ప్రతి కార్యక్రమంలో నారీశక్తి చాటేలా ఏర్పాట్లు చేస్తున్నది.  ఫుల్ డ్రెస్ రిహార్సల్ లో భా గంగా ఢిల్లీ పోలీసులు, కేంద్ర భద్రతా బలగాలు సోమవారమే సెంట్రల్ ఢిల్లీని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. కర్తవ్యపథ్ పరిసర ప్రాంతాల్లో బ్లాక్ క్యాట్స్, ఎన్ఎస్ జీ కమాండోలను మోహరించారు. 

కర్తవ్యపథ్ లో (ఇండియా గేట్ నుంచి విజయ్ చౌక్ వరకు) ఫేస్ రికగ్నైజేషన్ కెమెరాలను ఏర్పాటు చేశారు. సోమవారం రాత్రి నుంచి ఇండియా గేట్ రూట్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. జనవరి 29న విజయ్ చౌక్ లో జరిగే బీటింగ్ రీ ట్రీట్ వేడుకలు ముగిసే దాకా ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు.

ముచ్చటగా మూడోసారి

పదేండ్ల వయసున్న తెలంగాణ రాష్ట్రం.. ముచ్చటగా మూడోసారి శకటాన్ని ప్రదర్శించబోతున్నది. గత ప్రభుత్వం ఈ విషయంలో అలసత్వం ప్రదర్శిస్తే... కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ సర్కార్ చివరి నిమిషంలో కేంద్రాన్ని ఒప్పించి మరీ రాష్ట్ర శకటాన్ని ప్రదర్శించబోతున్నది. ‘డెమోక్రసీ ఫర్ రూట్ లెవల్’ అనే థీమ్​తో తెలంగాణ శకటాన్ని రూపొందిస్తున్నారు. భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని శకటం ముందు భాగంలో ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో గిరిజన వీరులు రాంజీగోండు, కొమురం భీమ్ విగ్రహాలు ఆకట్టుకోనున్నాయి. వెయ్యి ఉరిల మర్రి, కొమురంభీం 
మెమోరియల్, గిరిజన జీవన శైలి శకటంపై కనిపిస్తాయి. గ్రామీణ ప్రజాస్వామ్య తెలంగాణను రాష్ట్ర ప్రభుత్వం చాటబోతున్నది.

ఇదీ షెడ్యూల్

ఉదయం 9:30 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. ఈ టైమ్​లో హెలీకాప్టర్ తో పూల వర్షం కురిపిస్తారు. తర్వాత మహిళల మ్యూజికల్ ప్రోగ్రామ్ ప్రారంభం అవుతుంది. తర్వాత విజయ్ చౌక్ నుంచి సైనిక దళాల కవాతుతో ఈ వేడుకలు షురూ అవుతాయి. తర్వాత ఆర్మీ తన అమ్ముల పొదిలోని యుద్ధ ట్యాంకులు, నూతన టెక్నాలజీతో తయారు చేసిన క్షిపణులు, శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తాయి. చివర్లో భారత వైమానిక దళం యుద్ధ విమానాల విన్యాసాలతో పరేడ్ ముగుస్తుంది.

తక్కువ టైమ్​లో ధీటైన శకటం రూపొందించాం: ఆర్సీ గౌరవ్ ఉప్పల్

ఇతర రాష్ట్రాలు దాదాపు మూడు నెలలు శ్రమించి శకటాలను రూపొందించాయని, కానీ.. తాము కేవలం పది రోజుల వ్యవధిలో తెలంగాణ శకటాన్ని వాటికి ధీటుగా తయారు చేశామని ఢిల్లీ తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. తెలంగాణ సంస్కృతి, ప్రజాస్వామ్య పరిరక్షణలో ముందు నిలిచిన చాకలి ఐలమ్మ, రాంజీగోండు, కొమురం భీం వంటి వీరులను శకటంపై ప్రదర్శిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణకు సొంతమైన కొమ్ముకోయ, లంబాడ, డప్పులతో మొత్తం 16 మంది తెలంగాణ ఆడపడుచులు శకటంతో ముందుకు సాగుతారన్నారు. ఇక శకటం సెర్మోనియల్ కమిటీ పర్మిషన్ పొందడంలో, రూపొందించడంలో రాష్ట్ర సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్ నాగులపల్లి వెంకటేశ్వర రావు, ఇతర అధికారులు ప్రత్యేకంగా శ్రమించారు.