బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి నెల్లూరుకు గౌతంరెడ్డి పార్థివదేహం

బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి నెల్లూరుకు  గౌతంరెడ్డి పార్థివదేహం

ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పార్థివదేహాన్ని ఆయన స్వస్థలం నెల్లూరు జిల్లాకు తరలించారు. హైదరాబాద్ బేగంపేట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో నెల్లూరుకు తీసుకెళ్లారు. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెలికాప్టర్లో గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా నెల్లూరుకు వెళ్లారు. ఇవాళ సాయంత్రం అమెరికా నుంచి ఆయన కొడుకు రానున్నారు. రేపు నెల్లూరు జిల్లాలోని ఉదయగిరిలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ హైదరాబాద్ నుంచి పార్థివదేహాన్ని తరలింపును పర్యవేక్షించారు. ఉదయం జూబ్లీహిల్స్ లో గౌతమ్ రెడ్డి పార్థివదేహానికి వైసీపీ సీనియర్ నేత, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మాజీ ఎంపీ పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి నివాళులర్పించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి నిన్న ఉదయం హఠాన్మరణం చెందారు. సోమవారం ఉదయం గుండెపోటు రావడంతో ఆయనను హుటాహుటిన జూబ్లిహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు అత్యవసర చికిత్స అందించి ప్రాణాలు నిలబెట్టేందుకు తీవ్రంగా శ్రమించినా ప్రయోజనం లేకపోయింది. ఐసీయూలో చేరిన సమాయానికే ఆయన హార్ట్ బీట్ చాలా బలహీనంగా ఉండడంతో ఆయనను బతికించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆస్పత్రికి చేరుకున్న కొద్ది నిమిషాల్లోనే ఆయన తుది శ్వాస విడిచారు. కాగా, ఇటీవలే ఆయన కొవిడ్ బారిన పడి కోలుకున్నారు. పోస్ట్ కొవిడ్ పరిణామాల కారణంగానే గౌతమ్ రెడ్డికి గుండె పోటు వచ్చిందని డాక్టర్లు చెబుతున్నారు.

మరిన్ని వార్తల కోసం..

తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం

15 పులులను దత్తత తీసుకున్న ఎస్​బీఐ

కరోనా భయంతో ముందస్తు మొక్కులు