దాచిన బంగారం ‘వైట్​’గా మార్చొచ్చు

దాచిన బంగారం ‘వైట్​’గా మార్చొచ్చు

అఫీషియల్​​ చేసుకునేందుకు ప్రత్యేక స్కీమ్ 

పన్ను కట్టి తెల్లగా మార్చుకునేలా వీలు   బంగారాన్ని సిస్టమ్‌‌లోకి తేవాలనేదే టార్గెట్‌‌

దేశంలో బంగారాన్ని భారీగా దాచుకున్న వారి కోసం ప్రభుత్వం త్వరలో ఓ స్కీమును తేనుంది. నల్ల బంగారాన్ని (అకౌంట్లలో చూపని) తెల్లగా మార్చుకునేందుకు వారందరికీ ఒక అవకాశం కల్పించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ ప్రత్యేక స్కీము ద్వారా బంగారపు నిల్వలకు చట్టబద్దత కల్పించాలనేది ప్రభుత్వ టార్గెట్‌‌. ఈ స్కీము రూపకల్పనలో ఇప్పటికే ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ), ఆర్థిక మంత్రిత్వ శాఖల అధికారులు తలమునకలుగా ఉన్నట్లు తెలుస్తోంది.

తాము దాచుకున్న బంగారాన్ని బయట పెట్టి, దాని విలువ మీద పన్ను చెల్లిస్తే చాలు…ఆ బంగారం తెల్లదిగా మారిపోతుంది. వ్యక్తుల దగ్గర ఎంత పరిమితిలో బంగారం ఉండొచ్చనే అంశం మీద త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఆ పరిమితికి మించిన బంగారపు నిల్వలను వెల్లడించి, ఆ విలువకు పన్ను చెల్లిస్తే సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. స్కీము కాల పరిమితి ముగిశాక, ఎవరి దగ్గరైనా ఎక్కువ బంగారం (అనుమతించిన దాని కన్నా) ఉన్నట్లు బయట పడితే భారీగా ఫైన్స్‌‌ వేయనున్నారని ఆ అధికారులు వెల్లడించారు.

ఆడవాళ్ల నగలకు కొంత మినహాయింపు…

తాజా స్కీము కింద ఎంత పన్ను రేటు ఉంటుందనేది ఇంకా తెలియలేదు. కానీ, స్వచ్ఛందంగా ప్రకటించే స్కీములకు ఏ రేటైతే అమలులో ఉందో అదే రేటు ఉండొచ్చని ఒక అధికారి చెప్పారు. 2014–16లలో తెచ్చిన అలాంటి స్కీములను ఆ అధికారి ఉదహరించారు. ప్రభుత్వం నియమించిన ఒక అప్రైజర్‌‌ బంగారం విలువను లెక్కగడతారు. పెళ్లైన ఆడవాళ్ల ఆభరణాల విలువ విషయంలో కొంత పరిమితి దాకా మినహాయింపు ఇవ్వనున్నారని అధికార వర్గాల సమాచారం.

 ఏటా 900 టన్నుల బంగారం దిగుమతి..

బంగారమన్నా, బంగారు ఆభరణాలు అన్నా భారతీయులకు చాలా మమకారం. ఇండియా ఏటా 900 టన్నుల బంగారం దిగుమతి చేసుకుంటోంది. ఇందుకోసం సుమారు 2,50,000 కోట్ల (35 బిలియన్‌‌ డాలర్లు)ను దేశం వెచ్చిస్తోంది. ఇలా దిగుమతి చేసుకునే బంగారంలో ఎక్కువ శాతం సేఫ్‌‌ డిపాజిట్‌‌ లాకర్లలో పడి ఉంటున్నాయి. అంటే నిరుపయోగ ఆస్తిగా మిగిలిపోతున్నాయి. మరోవైపు దేశానికి ఎంతో విలువైన విదేశీ మారక ద్రవ్యం వృధా అవుతోంది.

గోల్డ్‌‌ బోర్డ్‌‌ ఏర్పాటు…

గోల్డ్‌‌ స్కీము రూపకల్పనను డిపార్ట్‌‌మెంట్‌‌ ఆఫ్‌‌ ఎకనమిక్‌‌ ఎఫైర్స్‌‌, డిపార్ట్‌‌మెంట్‌‌ ఆఫ్‌‌ రెవెన్యూలు కలిసి చేపట్టినట్లు మరో అధికారి తెలిపారు. ప్రభుత్వం, ప్రైవేటు రంగాలలోని ప్రతినిధులతో ఒక గోల్డ్‌‌ బోర్డ్‌‌ను నెలకొల్పనున్నారు. ఈ బోర్డు ఏటా గోల్డ్‌‌ స్కీముకు అనుగుణమైన మార్పులు చేస్తూ, కొనుగోలుదారులకు ఆకర్షణీయంగా అట్టేపెడుతుందని ఆ అధికారి వెల్లడించారు. ఫలితంగా గోల్డ్‌‌ హోల్డింగ్స్‌‌ను ఉపయోగకరమైన అసెట్‌‌గా మలిచినట్లవుతుందని పేర్కొన్నారు.

గుళ్లు, ట్రస్ట్‌‌ల చేతిలో అత్యధిక బంగారం…

ఇండియాలోని గుళ్లు, ట్రస్ట్‌‌ల చేతిలో భారీ మొత్తంలో బంగారం నిల్వలున్నాయి. బహుశా ఈ బంగారం పరిమాణం వేల టన్నులలో ఉంటుంది. దేవుళ్లకు బంగారం ఇవ్వడం దేశంలో ఆచారంగా కొనసాగుతోంది. అలా వచ్చిన బంగారాన్ని జాగ్రత్తగా ప్రభుత్వ రంగ బ్యాంకుల లాకర్లలో  దాచిపెట్టడం దేవాలయాల బాధ్యత. అలా దాచిపెట్టడంతో ఆ బంగారం పూర్తి నిరుపయోగ అసెట్‌‌గా మిగిలిపోతోంది. ఈ తాజా ప్లాన్‌‌తోపాటు, ఇప్పుడున్న సావరిన్‌‌ గోల్డ్‌‌ బాండ్‌‌ స్కీము రూపురేఖలూ మార్చి, కొనుగోలుదారులకు ఆకర్షణీయంగా
మలచాలని ఆలోచిస్తున్నట్లు ప్రభుత్వాధికారులు చెబుతున్నారు.

త్వరలోనే కేబినెట్ నిర్ణయం

కొత్త గోల్డ్‌‌ ప్లాన్‌‌ తెచ్చే విషయంలో కేబినెట్‌‌ త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. నిజానికి అక్టోబర్‌‌ రెండో వారంలో జరిగిన కేబినెట్‌‌ మీటింగ్‌‌లోనే ఈ అంశంపై నిర్ణయం తీసుకోవల్సి ఉన్నా, మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడింది. డీమెటీరియలైజేషన్‌‌ ఫామ్‌‌లో నాలుగు కిలోల దాకా బంగారం కొనేందుకు వ్యక్తులు, హిందూ అన్‌‌డివైడెడ్‌‌ ఫ్యామిలీస్‌‌ (హెచ్‌‌యూఎఫ్‌‌)కూ సావరిన్‌‌ బాండ్‌‌ స్కీము కింద అనుమతి ఇస్తున్నారు. ఇక ట్రస్ట్‌‌లైతే 20 కిలోల దాకా కొనొచ్చు. ఈ స్కీము కింద ఏటా 2.5 శాతం వడ్డీ చెల్లించడంతోపాటు, బంగారం మార్కెట్‌‌ విలువ వద్ద   ఆ  బాండ్స్‌‌ను రిడీమ్‌‌ చేస్తారు. అంటే, మెచ్యూరిటీ రోజు బంగారపు విలువ ఆధారంగా చెల్లింపులు జరుపుతారన్నమాట. ఏడో సిరీస్‌‌ సావరిన్‌‌ బాండ్‌‌ స్కీము ఈ ఏడాది డిసెంబర్‌‌ 2– డిసెంబర్‌‌ 6 మధ్యలో అందుబాటులోకి తేనున్నారు. ఆరో సిరీస్‌‌ అక్టోబర్‌‌ 25 న ముగిసింది.

మరిన్ని వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి