ఈ–కామర్స్ ప్లాట్‌‌ఫారాల్లో ‘డార్క్ ప్యాటర్న్‌‌’ లపై నిషేధం

 ఈ–కామర్స్ ప్లాట్‌‌ఫారాల్లో ‘డార్క్ ప్యాటర్న్‌‌’ లపై నిషేధం

న్యూఢిల్లీ : ఆన్​లైన్​లో షాపింగ్​ చేసే వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి, మోసాల బారిన పడకుండా కాపాడేందుకు ఈ–కామర్స్​లో  "డార్క్ ప్యాటర్న్‌‌ల" వాడకాన్ని ప్రభుత్వం నిషేధించింది.  తప్పుదారి పట్టించే ప్రకటనలు చేయడం, కస్టమర్​కు తెలియకుండానే కొన్ని ప్రొడక్టులను కార్ట్​లో వేయడం, డొనేషన్​ పేరుతో కొంత డబ్బు వసూలు చేయడం, సబ్​స్క్రిప్షన్​ వంటివి అంటగట్టడం వంటి పద్ధతులను డార్క్​ ప్యాటర్న్స్​అంటారు. "డార్క్​ప్యాటర్న్​ల నివారణ  నియంత్రణ కోసం మార్గదర్శకాలు" అనే గెజిట్ నోటిఫికేషన్‌‌ను నవంబర్ 30న సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) జారీ చేసింది. ఇది భారతదేశంలోని వస్తువులు,  సేవలను అందించే అన్ని ప్లాట్‌‌ఫారమ్‌‌లకు  ప్రకటనకర్తలకు, సెల్లర్లకు కూడా వర్తిస్తుంది.

రూల్స్​ను ఉల్లంఘిస్తే వినియోగదారుల రక్షణ చట్టంలోని నిబంధనల ప్రకారం జరిమానా విధిస్తామని హెచ్చరించింది. డిజిటల్ కామర్స్​లో వినియోగదారుల కొనుగోలు ఎంపికలను,  ప్రవర్తనను మార్చడం ద్వారా వారిని తప్పుదారి పట్టించడానికి ప్లాట్‌‌ఫారమ్‌‌లు ప్రయత్నిస్తున్నాయని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ చెప్పారు.   ఉదాహరణకు, 'బాస్కెట్ స్నీకింగ్' అనేది ఒక డార్క్ ప్యాటర్న్. చెక్​ అవుట్​ సమయంలో కొంత మొత్తాన్ని సేవలకో, ధార్మిక సంస్థలకో చెల్లించాలని అడుగుతారు. వినియోగదారు అనుమతి లేకుండా ఈ మొత్తాలను వసూలు చేస్తారు. "ఫోర్స్​డ్​ యాక్షన్" అనేది మరో  డార్క్​ప్యాటర్న్. వినియోగదారు ఏదైనా అదనపు వస్తువులను కొనుగోలు చేయడం లేదా సబ్‌‌స్క్రయిబ్ చేయడం లేదా సంబంధం లేని సేవ కోసం డబ్బులు కట్టిస్తారు. వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయడం వంటివి కూడా ఉంటాయి.