
దేశంలోని పలు విమానాశ్రయాలు క్రమంగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. భారీ ఎత్తున నిధుల సమీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల మానిటైజేషన్ ప్రణాళికను ప్రకటించింది. ఇందుకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) ముందుకొచ్చింది. వచ్చే ఏడాది వరకు 13 ఎయిర్ పోర్టులను ప్రైవేటీకరించేందుకు అంగీకరించింది. ఇందులో ఆరు పెద్ద విమానాశ్రయాలు, ఏడు చిన్నవి ఉన్నాయి. వీటిని కలిపి మరింత పెద్ద విమనాశ్రయాలుగా తీర్చిదిద్దనున్నారు.
ఆరు పెద్ద విమనాశ్రయాల్లో అమృత్‌సర్, భువనేశ్వర్, ఇండోర్, రాయ్‌పూర్, తిరుచ్చి, వారణాసి ఉండగా, ఏడు చిన్న విమానాశ్రయాల్లో హుబ్లి, తిరుపతి, ఔరంగాబాద్, జబల్‌పూర్, కంగ్రా, కుషినగర్, గయ ఉన్నాయి. మార్చి 2024 నాటికి విమానాశ్రయాల్లో దాదాపు రూ.3,700 కోట్లు ప్రైవేటు పెట్టబడులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
వారణాసి విమానాశ్రయంలో కుషినగర్, గయను కలిపేయనుండగా, అమృత్‌సర్‌లో కంగ్రాను, భువనేశ్వర్‌ను తిరుపతితో, రాయ్‌పూర్‌ను ఔరంగాబాద్‌తోను, ఇండోర్‌ను జబల్‌పూర్‌తోను, తిరుచ్చిని హుబ్లీతో కలిపేస్తారని తెలుస్తోంది. వచ్చే ఏడాది నాటికి ప్రైవేటీకరణ పూర్తయ్యేలా AAI అతి త్వరలోనే కార్యాచరణ రూపొందించనుంది. వారణాసి-కుషినగర్-గయ బుద్ధిస్ట్ సర్క్యూట్ కావడంతో బిడ్డర్లు దీనిపై ఆసక్తి చూపే అవకాశం ఉంది. ఇవన్నీ పర్యాటక ప్రదేశాలు కావడంతోపాటు వారణాసి పవిత్ర పుణ్యస్థలం కూడా.
చిన్న విమానాశ్రయాలను పెద్దవాటితో కలపడం దేశంలో ఇదే తొలిసారి కానుంది. పీపీఈ మోడ్‌లో ఆదాయ పంపకాలు ఉండే అవకాశం ఉన్నప్పటికీ ఓనర్‌షిప్ మాత్రం ప్రభుత్వానిదే.