- కరువు కాలంలో ఉపాధి హామీ పనులకు డిమాండ్
- రూ.300కు పెరిగిన ఉపాధి కూలీల వేతనం
- కొత్తగా పని ప్రదేశాల్లో కొలతల ఫ్లెక్సీలు
- కూలీలకు వేతనం గిట్టుబాటు అయ్యేలా చర్యలు
నల్గొండ, వెలుగు : గ్రామాల్లో కూలీలు ఉపాధి హామీ పనుల బాట పట్టారు. వర్షాలు లేక సాగు తగ్గిపోవడంతో గ్రామాల్లో కూలీలు ఉపాధి పనుల వైపు మొగ్గుచూపుతున్నారు. కరువు పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఉపాధి హామీ పనుల రోజువారీ వేతనాన్ని ప్రభుత్వం రూ.300కు పెంచింది. కూలీలకు దినసరి వేతనం గిట్టుబాటు అయ్యేలా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ చర్యలు చేపట్టింది.
కొత్తగా ఈసారి పని జరుగుతున్న ప్రదేశాల్లో ఎంత పరిమాణంలో పనిచేస్తే కూలీలకు వేతనం గిట్టుబాటు అవుతుందో అర్థమయ్యేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కనీసం రోజుకు నాలుగు గంటలు పనిచేస్తే తప్పా ఉపాధి కూలీ వర్తించదు. గతంలో రోజు కూలీ సగటును రూ.157లు మాత్రమే గిట్టుబాటు అయ్యింది. కానీ ఈసారి ఎంత లేదన్న సగటున రూ.250 వరకు కూలీలకు అందేలా అధికారులు చర్యలు చేపట్టారు. దీంతో జిల్లాలోని 844 గ్రామాల్లో ఉపాధి హామీ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
రోజుకు 72 వేల మంది కూలీలు హాజరు..
జిల్లాలో ప్రతిరోజూ 72 వేల మంది కూలీలు ఉపాధి హామీ పనులకు హాజరవుతున్నారు. ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటలకు వరకు కూలీలు పనులు చేస్తున్నారు. ఈనెల 1న 65,562 మంది హాజరు కాగా, గురువారం 72,242 మంది కూలీలు పనులకు వచ్చారు. గతేడాది ఇదే సీజన్లో 56 వేల మంది ఉపాధి పనులకు హాజరయ్యారు. ప్రతి మండలంలో సగటున రోజుకు 1600 నుంచి 3 వేల మంది కూలీలు ఉపాధి హామీ పనులకు వెళ్తున్నారు.
ఆయకట్టులోనూ కరువు పనులకు డిమాండ్..
నాగార్జునసాగర్ఆయకట్టు పరిధిలోని మిర్యాలగూడ, నాగార్జునసాగర్నియో జకవర్గాల్లోనూ కరువు పనులకు డిమాండ్పెరిగింది. ఏఎమ్మార్పీ, డిండి ప్రాజెక్టుల కింద కరువు పరిస్థితి దారుణంగా కనిపిస్తోంది. జిల్లాలో అత్యధికంగా డిండి మండలంలో 3,951 మంది కూలీలు ఉపాధి పనులకు వెళ్తుండగా, దేవరకొండ మండలంలో 4,568 మంది కూలీలు కరువు పనులపై ఆధారపడుతున్నారు.
ఏఎమ్మార్పీ పరిధిలోని తిప్పర్తి మండలంలో 2,434 మంది, పీఏపల్లి మండలంలో 3,312 మంది కూలీలు హాజరవుతున్నారు. మిర్యాలగూడ మండలంలో 2,944 మంది, తిరుమలగిరి సాగర్మండలంలో 2,720 మంది కూలీలు ఉపాధి పనులు చేస్తున్నారు. మూసీ ప్రాజెక్టు పరిధిలోని నార్కట్‌పల్లి, చిట్యాల, కట్టంగూరు మండలాల్లో సైతం ఉపాధి పనులు జోరుగా సాగుతున్నాయి.
పెరిగిన లేబర్ బడ్జెట్..
కరువు నేపథ్యంలో ఈసారి లేబర్బడ్జెట్కూడా భారీగా పెంచారు. గతేడాది 82 లక్షల పనిదినాలు ఉండగా, ఈసారి కోటీ 15 లక్షల పనిదినాలు పెంచారు. ప్రతి గ్రామంలో సగటున300 పనిదినాలు అందుబాటులో ఉంచారు. కూలీలు ఎప్పుడు పని అడిగినా లేదనకుండా అన్ని రకాల పనులు సిద్ధం చేశారు. ప్రస్తుతం జిల్లాలో ఫాం పాండ్స్, కందకాల తవ్వకం, చెరువుల పూడికతీత, ఫీడర్చానల్స్, ఎస్సీ, ఎస్టీ, సన్నచిన్న కారు రైతుల భూముల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 3,56,218 కుటుంబాలు ఉండగా, 7,62,848 మందికి జాబ్‌కార్డులు ఉన్నాయి. గతేడాది వీళ్లలో 2,89,109 మంది కూలీలకు మాత్రమే ఉపాధి పనులకు వచ్చారు. ఈ సీజన్లో కూలీల సంఖ్య సగటున రోజుకు లక్ష వరకు చేరే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
పని ప్రదేశాల్లో సౌలత్లు..
జిల్లాలో పగటిపూట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటింది. దీంతో పని జరిగే ప్రదేశాల్లో కూలీలకు ఎండ దెబ్బ తగలకుండా ఉండేందుకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. నీటి సరఫరా, కూలీలు ఎండ నుంచి విశ్రాంతి తీసుకునేందుకు టెంట్లు వంటి బాధ్యతను గ్రామ పంచాయతీలకు అప్పగించారు. ఎండ దెబ్బ తగిలిన కూలీలకు వెంటనే వైద్యం సదుపాయం కల్పించేందుకు ఫస్ట్ఎయిడ్కిట్స్కూడా అందుబాటులో ఉంచామని అధికారులు చెప్పారు.
అడిగినంత పని కల్పిస్తాం
కరువు నేపథ్యంలో కూలీలకు అడిగినంత పని కల్పించేందుకు సిద్ధంగా ఉన్నాం. అన్ని గ్రామాల్లో ఉపాధి హామీ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రతి కూలీకి సగటున రూ.250 వేతనం గిట్టుబాటు అయ్యేలా చర్యలు చేపట్టాం. గతేడాది ఉపాధి పనుల కోసం రూ.180 కోట్ల వరకు ఖర్చు పెట్టాం. ఈసారి బడ్జెట్అంతకు మించి పెరిగే అవకాశం ఉంది. వేసవి తాపం నుంచి తట్టుకునేలా కూలీలకు అన్ని వసతులు కల్పిస్తున్నాం.
టి.నాగిరెడ్డి, డీఆర్డీఏ పీడీ