షార్ట్​కట్ దారి కోసం.. చైనా వాల్​నే కూలగొట్టిన్రు

షార్ట్​కట్ దారి కోసం.. చైనా వాల్​నే  కూలగొట్టిన్రు

షార్ట్​​కట్ దారి కోసం ఓ ఇద్దరు వ్యక్తులు చైనా గ్రేట్ వాల్​నే కూలగొట్టారు. తాము చేపట్టిన నిర్మాణం దగ్గరికి పోయి వచ్చేందుకు అడ్డుగా ఉందని  పురాతన గోడలో కొంత భాగాన్ని ధ్వంసం చేశారు. నిర్మాణం జరిగే చోటుకు సామగ్రిని తీసుకెళ్లేందుకు గోడ చుట్టూ తిరిగి పోవాల్సి వస్తోందని వాళ్లు ఇలా చేసినట్లు అధికారులు గుర్తించారు. 

ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు

బీజింగ్ :  షార్ట్​కట్ దారి కోసం ఏకంగా చైనా గ్రేట్ వాల్​నే కూలగొట్టారు. తాము చేపట్టిన నిర్మాణం దగ్గరికి పోయివచ్చేందుకు అడ్డుగా ఉందని ఇద్దరు వ్యక్తులు పురాతన గోడలో కొంత భాగాన్ని ధ్వంసం చేశారు. నిర్మాణం జరిగే చోటుకు సామగ్రిని తీసుకెళ్లేందుకు గోడ చుట్టూ తిరిగి పోవాల్సి వస్తోందని వాళ్లు ఇలా చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈశాన్య చైనాలోని షాంగ్సీ ప్రావిన్స్​లో ఈ ఘటన జరిగింది.

గోడ చుట్టూ తిరిగి పోలేక.. 

షాంగ్సీ ప్రావిన్స్​లో ఉండే 35 ఏండ్ల వ్యక్తి, 55 ఏండ్ల మహిళ స్థానికంగా ఓ నిర్మాణం చేపడుతున్నారు. అక్కడికి పోయివచ్చేందుకు, సామగ్రిని తరలించేందుకు ప్రతిరోజు గోడ చుట్టూ కొన్ని కిలోమీటర్లు తిరిగాల్సివస్తోంది. దీంతో షార్ట్ కట్ కోసం బుల్డోజర్​తో వాల్​ను తవ్వి రోడ్డు మార్గానికి లైన్ క్లియర్ చేసుకున్నారు. దీని గురించి ఆగస్టు24న సమాచారం అందడంతో అధికారులు స్పాట్​కు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. 

ఇద్దరినీ అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. షార్ట్ కట్ కోసం చారిత్రాత్మక గ్రేట్​ వాల్​కే గండి కొట్టారని, చైనా ప్రతిష్టకు భంగం కలిగించారని చైనా డైలీ మెయిల్ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచంలోనే  అద్భుతమైన కట్టడాల్లో ఒకటైన గ్రేట్​వాల్ ఆఫ్ చైనా నిర్మాణం క్రీస్తుపూర్వం మూడో శతాబ్దంలోనే ప్రారంభమైనట్లు చెబుతారు. ఇప్పుడున్న కట్టడాన్ని మాత్రం క్రీస్తు శకం 1368–1644  మధ్య మిగ్ రాజవంశీయులు నిర్మించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. ఈ గోడను 1987లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది.