
పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్ లోని 500 ఏళ్లనాటి గురుద్వారా దర్శనానికి ఇండియన్ సిక్కులకు అనుమతిస్తున్నట్లు పాక్ మీడియా సోమవారం వెల్లడించింది. కర్తార్ పూర్ లోని గురుద్వారాను దర్శించుకునేందుకు పాక్, యూరోప్, కెనడా, అమెరికాకు చెందిన భక్తులకు ఇప్పటికే పాక్ ప్రభుత్వం అనుమతిస్తోంది. ఇకపై ఈ జాబితాలో ఇండియాను కూడా చేర్చాలని పంజాబ్ గవర్నర్ మహమ్మద్ సర్వార్.. ప్రావిన్స్ అధికారులను ఆదేశించినట్లు ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్ వెల్లడించింది. దీంతో ఇండియన్ సిక్కు యాత్రికులు గురుద్వారాను సందర్శించేందుకు మార్గం సుగమం అయినట్లేనని తెలిపింది. పాక్ పంజాబ్ లోని కర్తార్ పూర్ గురుద్వారా సాహిబ్ ప్రాంతం సిక్కు మత వ్యవస్థాపకుడు గురునానక్ కు చివరి మజిలీగా ఉంది. ఆయన జయంతి, వర్ధంతి సందర్భంగా వేలాదిమంది ఇండియన్ సిక్కులు అక్కడికి వెళ్తుంటారు. ఇండియా–పాక్ సరిహద్దుకు నాలుగు కిలోమీటర్ల దూరంలోని కర్తార్ పూర్ సాహిబ్ గురుద్వారా వరకు రెండు దేశాలు కారిడార్ నిర్మించతలపెట్టాయి. ఈ కారిడార్ పూర్తయితే ఇండియన్ సిక్కులు వీసా లేకుండానే గురుద్వారాను సందర్శించే అవకాశం లభిస్తుంది.