వరికి కష్టకాలం.. ఆందోళనలో రైతులు

వరికి కష్టకాలం.. ఆందోళనలో  రైతులు
  • అదను దాటుతున్నా ప్రారంభంకాని నాట్లు
  • ముదిరిపోతున్న నార్లు
  • ఆందోళనలో పాలమూరు రైతులు

మహబూబ్​నగర్, వెలుగు: తీవ్ర వర్షాభావ పరిస్థితులు వరి సాగుపై ప్రభావం చూపుతున్నాయి. నార్లు పోసుకున్నా.. సాగునీరు లేక కరిగెట్ట పనులు ఆగిపోయాయి. ఈ పనులైతేనే వరి నాట్లు వేయాల్సి ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు వెనక్కిపోవడం, బోర్లల్లో గ్రౌండ్​ వాటర్​ పడిపోవడం, కాలువలు, చెరువులు ఎండిపోవడంతో దాదాపు 2 లక్షల ఎకరాల్లో సాగుకావాల్సిన వరి సాగు లక్ష ఎకరాలకే పరిమితమయ్యే ప్రమాదం​ఉందని అగ్రికల్చర్​ ఆఫీసర్లు చెబుతున్నారు.

10 వేల ఎకరాల్లోనే నాట్లు..

మహబూబ్​నగర్​ జిల్లా వ్యాప్తంగా వానాకాలం సీజన్​లో 3,77,971 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని, ఇందులో 1.70 లక్షల ఎకరాల్లో వరి సాగువుతుందని అంచనా వేశారు. కానీ, వాతావరణం అనుకూలించకపోవడంతో జిల్లాలో ఇప్పటి వరకు 10 వేల ఎకరాల్లో కూడా నాట్లు పడలేదు. వాస్తవానికి మే చివర్లో వచ్చే రోహిణి కార్తెలో నార్లు పోసుకొని, జూన్​ మూడో వారం నుంచి నాట్లు పెట్టుకొని జులై చివరి నాటికి పూర్తి చేయాలి. ఆగస్టులో పొట్ట దశకు చేరుకున్నాక, అక్టోబరులో కోతలు కోయాలి. కానీ, ఈసారి రైతులు వరి నార్లు పోసుకొని నెల రోజులు దాటినా ఇంత వరకు నాట్లు వేయలేదు. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో సాగునీరు లేక కరిగెట్ట పనులు ఆపేశారు. బోర్లు ఉన్నా నీళ్లు పోస్తలేవు. రిజర్వాయర్లు డెడ్​ స్టోరేజీకి చేరడంతో కెనాల్స్​ పారుతలేవు. దీంతో నెల కింద పోసుకున్న నారుమళ్లు ముదిరిపోతున్నాయి. నాట్లకు అదను దాటిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా దాదాపు 50 వేల ఎకరాల్లో సాగు తగ్గిపోయింది. మరో వారం రోజుల్లో భారీ వర్షాలు పడకుంటే, సాగు మరింత తగ్గిపోయే చాన్స్ ఉంది.

ముదిరిపోతున్న నారు..

నారు పోసుకున్న 20 నుంచి 25 రోజుల్లోపు నాట్లు వేసుకోవాలి. కానీ, జిల్లాలో లక్ష ఎకరాల సాగు కోసం నార్లు పోసుకొని నెల దాటిపోయింది. ప్రస్తుతం ఆ నార్లు ముదిరిపోయాయి. ఈ నార్లనే నాటితే దిగుబడిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. పంట పెరిగినా, ఎకరాకు 20 క్వింటాళ్లకు మించి దిగుబడి రాదు. లేత నార్లు రెండు నుంచి నాలుగు మొక్కల వరకు పెట్టుకుంటే, ముదురు నారు ఐదు నుంచి ఏడు మొక్కలు వరకు పెట్టుకోవాల్సి ఉంటుంది. లేదంటే దిగుబడి తగ్గుతుంది.

ALSO READ :కాంగ్రెస్,​ బీఆర్ఎస్ ​నడుమ.. ముదిరిన కరెంట్​ లొల్లి

ఆగస్టులో నాట్లు వేస్తే లాస్..

ఆగస్టులో కేవలం ఆర్ఎన్ఆర్​ రకానికి చెందిన నాట్లనే వేసుకోవాలి. బీపీటీ రకానికి ఇప్పటికే సీజన్​ దాటిపోయింది. ఈ రకం వేస్తే దిగుబడిపై ప్రభావం చూపుతుంది. పంట ఎదుగుదల ఉండదు. భారీ వర్షాలు పడితే ఉల్లి తెగులు, అగ్గి తెగులు, సుడిదోమ వ్యాపిస్తుంది. ఉదయం ఎండలు ఎక్కువగా ఉండి, సాయంత్రం వానలు పడితే పంటపై సుడిదోమ ప్రభావం ఉంటుంది. దీంతో పైర్లు ఎర్రగా మారి, పంట చేతికి రాకుండాపోతుంది. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో అక్టోబరు, నవంబరులో వర్షాలు పడితే కోతల టైంలో రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. 

డ్రమ్​ సీడర్​ ద్వారా విత్తుకోవాలి..

వరి నాట్లకు కాలం దాటిపోతోంది. డ్రమ్​ సీడర్​ ద్వారా నారు వేయకుండానే వరి వేసుకోవచ్చు. దీని ద్వారా విత్తనాలు వేయమని రైతులకు చెబుతున్నాం. జిల్లా వ్యాప్తంగా దాదాపు వందకు పైగా డ్రమ్​ సీడర్లను అందుబాటులో ఉంచాం. రైతు వేదికల వద్ద రూ.200 చెల్లించి ఒక రోజు అద్దెకు తీసుకెళ్లవచ్చు. హార్వెస్టింగ్ కూడా 15 రోజుల ముందే వస్తుంది. కలుపు వస్తుందనే భయం ఉండదు. కూలీల ఖర్చు తగ్గి, రైతులకు రూ.10 వేల నుంచి రూ.15 వేల దాకా ఆదా అవుతాయి. - వెంకటేశ్వర్లు, డీఏవో, మహబూబ్​నగర్​

నారు పోసి మూడు వారాలైంది..

నాకున్న ఐదు ఎకరాల్లో నారు పోసుకున్నా. ఇప్పటికే మూడు వారాలు దాటిపోయి నారు ముదురుతోంది. నాట్లు వేద్దామంటే కరిగెట్ట చేయడానికి ఇంత వరకు వర్షాలు పడ్తలేవు. పొలం పక్కనే కురుమూర్తిరాయ స్కీం కెనాల్​ ఉన్నా మొత్తం ఎడిపోయింది. 

 బోయ బుడ్డన్న, రైతు, అమ్మాపురం, చిన్నచింతకుంట మండలం