యూఎస్ లో తెలుగు హవా..

యూఎస్ లో తెలుగు హవా..
  • ఎక్కువ మంది మాట్లాడుతున్న ఇండియన్‌‌ భాషల్లో మూడో ప్లేస్‌‌
  • ఫస్ట్‌‌ ప్లేస్‌‌లో హిందీ, సెకండ్‌‌ గుజరాతీ
  • గత 8 ఏళ్ల పెరుగుదలలో తెలుగే టాప్‌‌

అమెరికాలో తెలుగు మాట్లాడే వాళ్లు పెరుగుతున్నారు. ఎనిమిదేళ్లలో ఈ సంఖ్య 80 శాతం పెరిగింది. ఈ లెక్కన అక్కడ ఎక్కువ మంది మాట్లాడుతున్న ఇండియన్‌‌ భాషల్లో తెలుగు మూడో ప్లేస్‌‌లో నిలిచింది. ఫస్ట్‌‌ ప్లేస్‌‌లో హిందీ, రెండో ప్లేస్‌‌లో గుజరాతీ ఉన్నాయి. యూఎస్‌‌ సెన్సస్‌‌ బ్యూరో ఇటీవల విడుదల చేసిన ‘అమెరికన్‌‌ కమ్యూనిటీ సర్వే రిపోర్టు 2018’లో ఈ వివరాలు వెల్లడించింది. 2018 జులై నాటికి అమెరికాలో 8.74 లక్షల మంది హిందీ మాట్లాడుతున్నారని పేర్కొంది. గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య 1.3 శాతం ఎక్కువని, గత 8 ఏళ్లలో హిందీ మాట్లాడే వాళ్లు 2.65 లక్షలు (43.5 శాతం) పెరిగారని వెల్లడించింది. గుజరాతీ విషయానికొస్తే  ప్రస్తుతం ఈ లాంగ్వేజ్‌‌ మాట్లాడే వాళ్లు 4.19 లక్షల మంది ఉన్నారని, గతేడాదితో పోలిస్తే వీళ్ల సంఖ్య 3.5 శాతం తగ్గిందని చెప్పింది. తెలుగు మాట్లాడే వాళ్లు ప్రస్తుతం 4 లక్షల మంది ఉన్నారని, గతేడాదితో పోలిస్తే వీళ్ల సంఖ్య కూడా 3.7 శాతం తగ్గిందని, 2017లో 4.15 లక్షల మంది ఉండేవారని వివరించింది.

2010లో తెలుగు మాట్లాడేటోళ్లు 2.23 లక్షలే

ఎనిమిదేళ్లలో పెరుగుదల పరంగా చూస్తే తెలుగే టాప్‌‌లో ఉందని, 2010లో అమెరికాలో 2.23 లక్షల మంది తెలుగు మాట్లాడే వాళ్లు ఉండగా 2018 జులై నాటికి 80 శాతం పెరిగి 4 లక్షలకు చేరిందని పేర్కొంది. బెంగాలీ మాట్లాడే వాళ్లు అమెరికాలో బాగా పెరుగుతున్నారని, ప్రస్తుతం వీళ్ల సంఖ్య 3.75 లక్షలుందని రిపోర్టు చెప్పింది. ఎనిమిదేళ్లలో వీళ్ల సంఖ్య 68 శాతం పెరిగిందంది. ఆ తర్వాత తమిళం మాట్లాడే వాళ్లు 3.08 లక్షలున్నారని, ఎనిమిదేళ్లలో వీళ్ల సంఖ్య 67.5 శాతం పెరిగిందని రిపోర్ట్​  వివరించింది.

6.7 కోట్ల మంది వేరే భాషలోనే

అమెరికాలో 6.7 కోట్ల మంది ఇంగ్లీష్‌‌ కాకుండా మరో భాషలో మాట్లాడుతున్నారని, యూఎస్‌‌ జనాభాలో ఇది 21.9 శాతమని రిపోర్టు తెలిపింది. వేరే భాష మాట్లాడుతున్న వాళ్ల సంఖ్య గతేడాదితో పోలిస్తే 0.1 శాతమే పెరిగిందని వివరించింది. అమెరికాలోని ఐదు పెద్ద సిటీల్లో సగం మంది ఇంగ్లీష్‌‌ కాకుండా వేరే భాష మాట్లాడుతున్నారంది. న్యూయార్క్‌‌లో 49 శాతం, లాస్‌‌ ఏంజిలిస్‌‌లో 59 శాతం, షికాగోలో 36 శాతం, హోస్టన్‌‌లో 59 శాతం, ఫీనిక్స్‌‌లో 38 శాతం వేరే లాంగ్వేజ్‌‌ మాట్లాడే వాళ్లున్నారని చెప్పింది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలను తీసుకుంటే గత 8 ఏళ్లలో స్పానిష్‌‌ మాట్లాడేవాళ్లు బాగా పెరిగారని (45 లక్షలు) రిపోర్టు చెప్పింది. తర్వాతి స్థానాల్లో చైనీస్‌‌ (6.6 లక్షలు), అరబిక్‌‌ (3.94 లక్షలు), హిందీ (2.65 లక్షలు) ఉన్నాయంది.