ఈశాన్య రాష్ట్రాల్లో 50 చెరువులు తవ్వించాలి: అమిత్ షా

ఈశాన్య రాష్ట్రాల్లో 50 చెరువులు తవ్వించాలి: అమిత్ షా
  • అధికారులను ఆదేశించిన అమిత్ షా
  •     బ్రహ్మపుత్ర నది ఉప్పొంగడంతోనే ఇబ్బందులు
  •     సిక్కిం, మణిపూర్ వరదలపై నివేదిక ఇవ్వండి
  •     హైలెవల్ మీటింగ్​లో హోం శాఖ మంత్రి ఆదేశం

న్యూఢిల్లీ: నదుల నీటి మట్టాల ముందస్తు అంచనాల వ్యవస్థను మెరుగుపరుచుకోవాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌‌‌‌ షా సూచించారు. డ్రైనేజీ వ్యవస్థను రోడ్డు రూపకల్పనలో అంతర్భాగంగా ఉంచుకోవాలన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఆకస్మిక వరదలు సంభవిస్తున్నాయని, ఫలితంగా భారీ నష్టం వాటిల్లుతున్నదని తెలిపారు. వరదలను ఎదుర్కొనేందుకు నార్తీస్ట్ స్టేట్స్​లో 50 భారీ చెరువులను తవ్వించాలని అధికారులను ఆదేశించారు. సిక్కిం, మణిపూర్​లో వరదలపై స్టడీ చేసి నివేదిక ఇవ్వాలని జల్‌‌‌‌శక్తి మంత్రిత్వశాఖ, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థకు సూచించారు. విపత్తు నిర్వహణలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకుండా చూడటమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. వర్షాకాలం నేపథ్యంలో నీటి సంరక్షణ, వరదల సన్నద్ధతపై అమిత్ షా ఆదివారం హై లెవల్ రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 

‘‘ఈశాన్య రాష్ట్రాల్లో 50 భారీ చెరువులు నిర్మిస్తే బ్రహ్మపుత్ర వరదలను మళ్లించవచ్చు. వరదల నియంత్రణకు అత్యాధునిక పర్యవేక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలి. దీని కోసం ఇస్రో అందించే శాటిలైట్‌‌‌‌ ఫొటోలను ఉపయోగించుకోవాలి. వాతావరణం, వర్షపాతం, వరద హెచ్చరికలకు సంబంధించి వివిధ విభాగాలు రూపొందించిన యాప్‌‌‌‌లను ఒకే దగ్గర తీసుకురావాలి. వరద నిర్వహణ కోసం నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఏజెన్సీ జారీచేసే సూచనలను అమలు చేయాలి’’అని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అమిత్ షా ఆదేశించారు. వర్షాకాలం వచ్చిందంటే బ్రహ్మపుత్ర వరదల కారణంగా అస్సాంతో సహా ఈశాన్య రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు. ప్రాణనష్టంతో పాటు వేల హెక్టార్లలో పంట కూడా దెబ్బతింటున్నదని తెలిపారు. ఎంతోమంది నిరాశ్రయులవుతున్నారని చెప్పారు. రోడ్డు, సమాచార వ్యవస్థ దెబ్బతింటున్నదని తెలిపారు.